ఆంధ్రప్రదేశ్(Andhra pradesh), తెలంగాణ(Telangana)కు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మరో 3 రోజులు భారీ ఎండలు ఉంటాయని వెల్లడించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ గత రెండు రోజుల నుంచి ఎండలు దంచికొడుతున్నాయి. ఇటీవలె ద్రోణి ప్రభావంతో వర్షాలు(Rain) కురిశాయి. ప్రస్తుతం వానలు తగ్గుముఖం పట్టడంతో ఎండలు తీవ్రం అయ్యాయి. తెలంగాణలో గరిష్టంగా కరీంనగర్ జిల్లా వీణవంకలో 45.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత(Temperature) నమోదైందని వాతావరణ శాఖ(Weather Department) అధికారులు తెలిపారు.
తెలంగాణ(Telangana)లోని జగిత్యాల జిల్లా జైన, బుద్దేశ్పల్లి, సారంగాపూర్, ఇబ్రహీంపట్నం మండలం గోధూరు, మల్లాపూర్ మండలం రాఘవపేట, వెల్గటూరులో 44.6 నుంచి 45.4 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఖమ్మం జిల్లాలో ముదిగొండ, నేలకొండపల్లి, చింతకాని, పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్, రంగంపల్లి, పాల్తెంతో పాటు హైదరాబాద్లో 42 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు రికార్డు అయినట్లు అధికారులు తెలిపారు. మరో మూడు రోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
ఏపీ(Andhra pradesh)లో పడమటి గాలులు వీస్తున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ(Weather Department) అధికారులు తెలిపారు. ఎండల తీవ్రత నేపథ్యంలో అత్యవసర పరిస్థితుల్లోనే ప్రజలకు బయటకు రావాలని, లేదంటే ఇంట్లోనే ఉండాలని సూచించారు. ఎండ తీవ్రతకు వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉందని, బయటకు వెళ్లేవారు తప్పనిసరిగా వారి వెంట వాటర్ బాటిల్స్ తీసుకెళ్లాలని సూచించారు. ఏపీలోని రాయలసీమ జిల్లాల్లో అత్యధిక ఎండలు ఉంటాయని, ఉభయ గోదావరి జిల్లాలు, రాయలసీమ, యానాం ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అమరావతి వాతావరణ కేంద్రం(Weather Department) వెల్లడించింది.