Mamata Banerjee Made Sensational Comments On Train Accident
Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంలో కుట్రకోణం ఉందని ఆరోపించారు. ప్రమాద కారణాలపై సమగ్రంగా దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. ప్రమాదంలో గాయపడ్డ బాధితులకు మెరుగైన వైద్యం అందజేయాలని డిమాండ్ చేశారు. ఈ సమయంలో రాజకీయాలు చేయడం సరికాదని.. బాధితులకు అండగా నిలువాల్సిన అవసరం ఉందన్నారు. బాధితులకు పశ్చిమ బెంగాల్ తరఫున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. రైలు ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. 288 మంది చనిపోయారు. తీవ్రంగా గాయపడ్డ వారి సంఖ్య 1000కి చేరుకుంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ప్రమాదం జరిగిన ఘటనా స్థలాన్ని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పరిశీలించారు. కాసేపట్లో ప్రధాని నరేంద్ర మోడీ వస్తున్నారు.
‘అత్యుత్తమ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో కోరమాండల్ ఒకటి.మూడు సార్లు రైల్వే మంత్రిగా పనిచేశా. 21వ శతాబ్దంలో జరిగిన అతిపెద్ద రైల్వే ప్రమాదం. ఘటనపై కేంద్రం విచారణ జరపాలి. రైల్వేలో సమన్వయ లోపం, గ్యాప్ కనిపిస్తోంది. వీళ్లకు బడ్జెట్ కూడా ఉండదు’ అని మమతా బెనర్జీ విమర్శించారు. రైల్వే బడ్జెట్లో నిధులు పెంచాలని డిమాండ్ చేశారు. ‘రైలులో యాంటీ కొలిజన్ పరికరం లేదు. ఆ పరికరం రైలులో ఉండి ఉంటే.. ఈ ఘోరం జరిగేది కాదు. చనిపోయిన వారిని తిరిగి తీసుకురాలేము. రెస్క్యూ ఆపరేషన్, సాధారణ స్థితిని పునరుద్ధరించడమే మన పని’’ అని మమత చెప్పుకొచ్చారు.
ఒడిశా ప్రభుత్వానికి, రైల్వే శాఖకు సహకరిస్తామని తెలిపారు. బెంగాల్ నుంచి అంబులెన్స్‌లు, వైద్య సిబ్బందిని ఒడిశాకు తీసుకొచ్చినట్టు వెల్లడించారు. మృతుల కుటుంబాలకు రైల్వేశాఖ రూ.10 లక్షలు సాయం అందజేస్తుందని, బెంగాల్ ప్రజలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున ఇస్తామని మమత ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.లక్ష చొప్పున అందజేస్తామన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆమె పరామర్శించారు.