దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్థంతి సభలో మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నాని పాల్గొన్నారు. కృష్ణా జిల్లా గుడివాడలో నిర్వహించిన ఎన్టీఆర్ వర్థంతి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. చాలామంది ఎన్టీఆర్ ఫోటో పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారని నాని మండిపడ్డారు. తెలుగు ప్రజల గుండెల్లో ఎన్టీఆర్ చిరస్మరణనీయంగా నిలిచిపోయిన వ్యక్తి. ఆయన పేరు, ఫోటోలతో అనేకమంది నీచ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.
ఎన్టీఆర్ తమకు ఆదర్శమంటూ కొంతమంది వ్యక్తులు ముసలి కన్నీరు కారుస్తున్నారన్నారు. అంత ప్రేమ, అభిమానం ఉంటే.. ఎన్టీఆర్ ని ఆదర్శంగా తీసుకుంటే ఎందుకు వెన్నుపోటు పొడిచారని ఆయన చంద్రబాబును పరోక్షంగా ప్రశ్నించారు. ఎన్టీఆర్ను క్షోభకు గురిచేసిన దొంగలను ఆయన అభిమానులు మట్టి కరిపించాలన్నారు. ఎన్టీఆర్ పదవిని దొంగలించిన చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు, అప్పటి నాయకులు నేటికీ ఎన్టీఆర్ పేరుతో ఓట్లు పొందుతున్నారన్నారు. రాజకీయాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఎన్టీఆర్ జీవితం ఆదర్శం.. గుడివాడ నుంచి రెండుసార్లు ఎన్టీఆర్ ప్రాతినిధ్యం వహించడం గర్వకారణం అన్నారు.