MLC Kaushik Reddy పెద్ద రౌడీ: జీవిత సంచలన వ్యాఖ్యలు
జీవిత మళ్లీ రాజకీయ జీవితంలో చురుకయ్యారు. బీజేపీ పుంజుకోవడంతో ఆమె సందడి మొదలైంది. ఇటీవల తరచూ పార్టీ కార్యక్రమాలకు హాజరవుతూ వస్తున్నారు. వేదిక ఏదైనా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని దూషించేందుకు సిద్ధమయ్యారు. రాజకీయ కార్యక్రమాలను విస్తృతం చేస్తున్న బీజేపీ అందులో భాగంగా స్ట్రీట్ కార్నర్ సమావేశాలు నిర్వహిస్తున్నది.
తెలంగాణ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి (Padi Kaushik Reddy) పెద్ద రౌడీ అని బీజేపీ నాయకురాలు, సినీ నటి జీవిత రాజశేఖర్ (Jeevitha Rajasekhar) సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కుటుంబానికి చెందిన వ్యక్తిపై కౌశిక్ బెదిరింపులకు పాల్పడ్డాడని ఆరోపించారు. అలాంటి వ్యక్తికి హుజురాబాద్ నియోజకవర్గం ఎలా అప్పగిస్తారు అని ప్రశ్నించారు. అలాంటి వ్యక్తి వలన ప్రజలకు మేలు లేదని తెలిపారు. ఈ సందర్భంగా గవర్నర్ పై కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. మహిళా గవర్నర్ (Governor)తో ఎలా వ్యవహరించాలో తెలియని వ్యక్తి అని దుయ్యబట్టారు. హుజురాబాద్ (Huzurabad) నియోజకవర్గంలోని జమ్మికుంట (Jammikunta)లో బీజేపీ (BJP) స్ట్రీట్ కార్నర్ (Street Corner) అనే కార్యక్రమం మంగళవారం రాత్రి నిర్వహించింది. ఈ సభకు హాజరైన జీవిత కౌశిక్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రౌడీ.. గూండ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
‘టీఆర్ఎస్ పార్టీ పేరుతో తెలంగాణ (Telangana) రాష్ట్రాన్ని ఉద్దరించని వాళ్లు.. బీఆర్ఎస్ పార్టీ పేరు పెట్టుకుని దేశాన్ని ఉద్ధరిస్తారా’ అని జీవిత ప్రశ్నించారు. స్వార్థ రాజకీయాల కోసమే బీఆర్ఎస్ గా పేరు మార్చుకున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పాలనపై విమర్శలు చేశారు.‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అని కేసీఆర్ చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనకు కౌంట్ డౌన్ మొదలైందని చెప్పారు. రానున్న ఎన్నికల్లో కాషాయ జెండా ఎగురడం ఖాయం. ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారు. తొమ్మిదేళ్లు సీఎంగా ఉండి కూడా తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు, ఆశయాలు నెరవేర్చలేదు. బంగారు తెలంగాణగా మారుస్తానని మాటలు చెప్పిన వ్యక్తి నేడు అప్పుల తెలంగాణగా మార్చారు. బీఆర్ఎస్ ను అధికారం కూల్చే వరకు పోరు కొనసాగిస్తాం’ అని జీవిత విమర్శించారు. అసభ్య పదజాలంతో రెచ్చిపోయారు.
అనంతరం స్థానిక బీఆర్ఎస్ నాయకుడు, ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డిపై జీవిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘కేటీఆర్ ఇటీవల కౌశిక్ రెడ్డిని హుజురాబాద్ అభ్యర్థిగా పరోక్షంగా ప్రకటించాడు. కౌశిక్ రెడ్డి పెద్ద రౌడీ. అతడికి ఒకరితో ఎలా మాట్లాడాలో తెలియదు. కారు పార్కింగ్ విషయమై మా కుటుంబ సభ్యులతో దౌర్జన్యం చేశాడు. ఇది పోలీస్ స్టేషన్ వరకు చేరింది. మహిళా గవర్నర్ ను అసభ్యంగా మాట్లాడిన వ్యక్తి కౌశిక్. కౌశిక్ లాంటి రౌడీ షీటర్ ని హుజురాబాద్ నియోజకవర్గానికి తీసుకురావడానికి బీఆర్ఎస్ కంకణం కట్టుకుంది’ అని జీవితా ఆరోపించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వంపై పలు ఆరోపణలు జీవిత చేశారు.
కాగా జీవిత మళ్లీ రాజకీయ జీవితంలో చురుకయ్యారు. బీజేపీ పుంజుకోవడంతో ఆమె సందడి మొదలైంది. ఇటీవల తరచూ పార్టీ కార్యక్రమాలకు హాజరవుతూ వస్తున్నారు. వేదిక ఏదైనా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని దూషించేందుకు సిద్ధమయ్యారు. రాజకీయ కార్యక్రమాలను విస్తృతం చేస్తున్న బీజేపీ అందులో భాగంగా స్ట్రీట్ కార్నర్ సమావేశాలు నిర్వహిస్తున్నది. కమలం పార్టీ స్ట్రీట్ కార్నర్ అనే పేరిట గల్లీలల్లో చిన్న చిన్న సభలు పెట్టి ప్రభుత్వ వైఫల్యాలను వివరించే ప్రయత్నం చేస్తున్నారు.