»Young Man Protest On Ambati Rambabu In Sattenapalle
Ambati Rambabuకి షాక్.. మంత్రి అయితే ఏంటి గొప్ప? నిలదీసిన యువకుడు
మంత్రి అయితే ఎవరికి గొప్ప. మా తమ్ముడు కారు నడిపి జీవనం సాగిస్తున్నాడు. వాడు కారు తిప్పితే మా అమ్మ పింఛన్ ఎలా తొలగిస్తారు’ అని వెంకటేశ్వర్లు మంత్రి అంబటిని నిలదీశాడు. ఈ క్రమంలో మంత్రికి, ఆ యువకుడికి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అక్కడే ఉన్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి వెంకటేశ్వర్లును అదుపులోకి తీసుకున్నారు. మంత్రి నిలదీస్తావా అంటూ పోలీసులు అతడిని లాక్కెళ్లి వాహనంలో కూర్చోబెట్టారు.
ప్రజల ఆగ్రహం నుంచి ఏపీలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు తప్పించుకోలేకపోతున్నారు. గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్న ప్రజాప్రతినిధులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ పనితీరుపై, సమస్యలపై ప్రజలు ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. ఎలాంటి జంకుబెంకు లేకుండా ఎమ్మెల్యే, మంత్రులను ప్రశ్నిస్తున్నారు. మా ప్రాంతానికి ఏం చేశారు? నియోజకవర్గానికి ఏం చేశారు? మీరు ఉండి ఏం ప్రయోజనం అని తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. అయితే ఈ ప్రజా వ్యతిరేకతను తట్టుకోలేక నిలదీసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. కేసులు నమోదు చేయించి జైలుకు తరలిస్తున్నారు. లేకుంటే నిలదీసిన కుటుంబంపై కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారు. తాజాగా ఇలాంటి సంఘటనే సత్తెనపల్లిలో జరిగింది. తనను నిలదీసిన యువకుడిపై మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) ఆదేశాలతో పోలీసులు (AP Police) అరెస్ట్ చేశారు. మంత్రి అయితే ఎవరికి గొప్ప అని అంబటి నిలదీయడమే అతడు చేసిన పాపం. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఏపీలోని పల్నాడు జిల్లా (Palnadu District) సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు. మంత్రి అయ్యాక అంబటి రాంబాబు నియోజకవర్గాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ప్రస్తుతం జగన్ ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని ఆదేశించడంతో గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలో రాంబాబు పర్యటిస్తున్నాడు. తాజాగా సత్తెనపల్లి (Sattenapalle)లోని 31వ వార్డులో మంత్రి అంబటి పర్యటించాడు. ప్రభుత్వ పథకాలను కరపత్రాల ద్వారా ప్రజలకు వివరిస్తూ వెళ్తున్నాడు. ఈ క్రమంలో వృద్ధురాలు పసుపులేటి సీతమ్మ వద్దకు వెళ్లి జగన్ పాలనలో అందరికీ మేలు జరుగుతోందని చెప్పాడు. ఎప్పటి నుంచో వస్తున్న పింఛన్ ను తనకు ఆపేశారని సీతమ్మ మంత్రి అంబటికి మొర పెట్టుకుంది. మీ ప్రభుత్వం వచ్చాక పింఛన్ (Pension) తొలగించారని వాపోయింది. దీనికి స్పందించిన అంబటి వెంటనే సచివాలయ ఉద్యోగులను ఆరా తీశాడు. ‘అవును పింఛన్ నిలిపివేశాం’ అని సిబ్బంది తెలపడంతో మంత్రి షాక్ కు గురయ్యారు. ఆమె కుటుంబసభ్యుల్లో ఒకరికి కారు (Car) ఉండడంతో పింఛన్ నిలిపివేశామని సిబ్బంది వివరణ ఇచ్చారు. త్వరలోనే పింఛన్ల పునరుద్ధరణ కార్యక్రమం చేస్తున్నట్లు మంత్రి సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశాడు. సర్ది చెబుతున్న సమయంలో సీతమ్మ కుమారుడు వెంకటేశ్వర్లు వచ్చాడు. ఇదే అంశంపై మంత్రిని నిలదీశాడు.
‘మంత్రి అయితే ఎవరికి గొప్ప. మా తమ్ముడు కారు నడిపి జీవనం సాగిస్తున్నాడు. వాడు కారు తిప్పితే మా అమ్మ పింఛన్ ఎలా తొలగిస్తారు’ అని వెంకటేశ్వర్లు మంత్రి అంబటిని నిలదీశాడు. ఈ క్రమంలో మంత్రికి, ఆ యువకుడికి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అక్కడే ఉన్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి వెంకటేశ్వర్లును అదుపులోకి తీసుకున్నారు. మంత్రినే నిలదీస్తావా అంటూ పోలీసులు అతడిని లాక్కెళ్లి వాహనంలో కూర్చోబెట్టారు. పోలీస్ స్టేషన్ కు తరలించి మాట్లాడారు. ఇంకోసారి ఇలాంటివి చేయవద్దు అని హితవు పలికి వెంకటేశ్వర్లను బుజ్జగించి పంపిచారు. ఈ సంఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. నిలదీస్తే అరెస్ట్ చేయిస్తారా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. సమస్యలపై నిలదీయడం మా హక్కు అని స్పష్టం చేస్తున్నారు.