Chandrababu: Why not give pension to every household
Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు అధికార పార్టీ వైసీపీపై మండిపడ్డారు. పింఛన్ల నగదు బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామంటున్న విషయం తెలిసిందే. అయితే ఇంత ఎండల్లో వృద్ధులను బ్యాంకుల చుట్టూ తిప్పడం సబబా అని చంద్రబాబు ప్రశ్నించారు. వైసీపీ కుట్రలు, కుతంత్రాల్లో అధికారులు కూడా భాగస్వామ్యం కావడం దురదృష్టమన్నారు. లబ్దిదారులకు ఇంటి దగ్గరే పింఛన్లు ఇవ్వాలని గట్టిగా డిమాండ్ చేశామని చంద్రబాబు గుర్తు చేశారు. ప్రభుత్వ సిబ్బంది ఉన్నా ఇంటింటికీ ఎందుకు పింఛను ఇవ్వలేకపోతున్నారన్నారు.
ఎన్నికల అధికారులు చెప్పినా రాష్ట్ర అధికారులు వినే పరిస్థితిలో లేరన్నారు. కుంటి సాకులతో తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆక్షేపించారు. ఒక పార్టీ, ఒక వ్యక్తి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పింఛను తీసుకునేందుకు వెళ్లే క్రమంలో ఏ ఒక్కరు చనిపోయినా రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యతన్నారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరగాలని.. తప్పుడు రాజకీయాలు చేసి నాటకాలు ఆడొద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు.