Etala Jamuna: బీజేపీ ముఖ్య నేత ఈటల రాజేందర్ సతీమణి జమున (Etala Jamuna) హుజురాబాద్ నియోజకవర్గంలో ప్రచారం స్పీడప్ పెంచారు. క్యాంపెయిన్‌లో మాటల తూటాలను పేలుస్తున్నారు. ప్రత్యర్థి బీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్ లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారు. తాజాగా మరోసారి కాంగ్రెస్ అభ్యర్థి ప్రణవ్ బాబును ఇక్కడకు పంపింది కేసీఆర్ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అతను అంతుకుముందు బీఆర్ఎస్ పార్టీలో ఉండేవారని గుర్తుచేశారు.
హుజురాబాద్‌లో ఈటల రాజేందర్‌ను (Etala Rajender) ఓడించడం కేసీఆర్ లక్ష్యంగా పెట్టుకున్నారని జమున ఆరోపించారు. అందుకోసం కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రణవ్ బాబును బరిలోకి దింపారని హాట్ కామెంట్స్ చేశారు. ఈటలను ఓడించడం పాడి కౌశిక్ రెడ్డితో కావడం లేదన్నారు. అందుకోసం ప్రణవ్ను రంగంలోకి తీసుకొచ్చారని ఆరోపించారు. ప్రణవ్ బాబు గురించి మీకు ఇంతకుముందు ఎప్పుడైనా తెలుసా..? అతని పేరు, అతని గురించి విన్నారా అని అడిగారు. చూడడానికే ప్రణవ్ బాబు, పాడి కౌశిక్ రెడ్డి పార్టీలు వేరు అని.. వీరిలో ఎవరూ గెలిచినా పోయేది ప్రగతి భవన్కేనని తెలిపారు. ఈటలను ఓడించేందుకు కౌశిక్‌తోపాటు ప్రణవ్ను కేసీఆర్ బరిలోకి దింపారని ఆరోపించారు.
గజ్వేల్‌లో సీఎం కేసీఆర్ మీద ఈటల రాజేందర్ బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. కామారెడ్డిలో కూడా కేసీఆర్ పోటీ చేస్తున్నారు. అక్కడ టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బరిలో ఉన్నారు. ఈ సారి కేసీఆర్ రెండు చోట్ల పోటీ చేస్తుండగా.. అక్కడ బీజేపీ, కాంగ్రెస్ ముఖ్య నేతలు బరిలో ఉన్నారు. బీజేపీ ముఖ్య నేత ఈటల రాజేందర్ సిట్టింగ్ స్థానం హుజురాబాద్‌లో అతనిని ఓడించాలని కేసీఆర్ భావించారు. బై పోల్ సమయంలో ఆ నియోజకవర్గం మొత్తానికి దళితబంధు ఇచ్చారు. అయినప్పటికీ ఈటల ప్రభ ముందు బీఆర్ఎస్ బోసిపోయింది. ఈసారైనా సరే.. ఓడించాలని చూస్తున్నారని ఈటల భార్య జమున సంచలన వ్యాఖ్యలు చేశారు.