»Cm Kcr Visited Kondagattu Temple And Review On Development
Kondagattuలో సీఎం కేసీఆర్ పూజలు.. ఆలయ అభివృద్ధిపై సమీక్ష
ఆగమశాస్త్రం ప్రకారం ఆలయ అభివృద్ధి పనులు జరగాలని సీఎం కేసీఆర్ సూచించారు. యాదాద్రి ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దిన ఆర్కిటెక్చర్ ఆనంద్ సాయికే కొండగట్టు బాధ్యతలు కూడా అప్పగించారు. సీఎం ఆదేశాలతో ఆనంద్ సాయి రెండు రోజులుగా కొండగట్టులో బస చేశారు. ఆలయాన్ని మొత్తం పరిశీలించారు. ప్రకారాలు, ప్రహరీ, ఆలయం లోపల అన్నింటిని పరిశీలించి ఒక అంచనాకు వచ్చారు. కొండగట్టు మాస్టర్ ప్లాన్ తయారీ, పర్యవేక్షణ బాధ్యతలు ఆనంద్ సాయి దగ్గరుండి చూసుకోనున్నారు.
తెలంగాణ (Telangana)లో ఆలయాల (Temples)ను అభివృద్ధి చేయడం లక్ష్యంగా విధించుకున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (K Chandrasekhar Rao) యాదాద్రి ఆలయాన్ని ఇప్పటికే అద్భుతంగా తీర్చిదిద్దారు. ఇప్పుడు జగిత్యాల (Jagtial District) మల్యాల మండలంలో ఉన్న కొండగట్టు (Kondagattu) ఆంజనేస్వామి ఆలయాన్ని పున:నిర్మాణం కోసం అడుగు వేశారు. ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు.. భక్తులకు సకల సౌకర్యాలు కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం కంకణం కట్టుంది. ఈ క్రమంలో ఆలయ అభివృద్ధికి రూ.100 కోట్లు విడుదల చేసింది. ఆ నిధులతో ఆలయాన్ని ఎలా తీర్చిదిద్దాలనే దానిపై సీఎం కేసీఆర్ స్వయంగా ఆలయాన్ని సందర్శించారు. హైదరాబాద్ లోని ప్రగతి భవన్ (Pragathi Bhavan) నుంచి బుధవారం బేగంపేట (Begumpet) విమానశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో నాచుపల్లిలోని జేఎన్టీయూలో ఏర్పాటుచేసిన హెలిప్యాడ్ వద్ద దిగారు. అక్కడి నుంచి బస్సులో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతో కలిసి సీఎం కేసీఆర్ కొండగట్టుకు చేరుకున్నారు. 21 సంవత్సరాల తర్వాత ముఖ్యమంత్రిగా తొలిసారి వచ్చిన సీఎం కేసీఆర్ వేదమంత్రోచ్ఛరణాల మధ్య ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా కొండగట్టు ఆలయంతో తనకు ఉన్న అనుబంధాన్ని సీఎం కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. అనంతరం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆలయ పున:నిర్మాణం ఎలా చేద్దామనే దానిపై అధికారులు, ఇంజనీర్లతో సీఎం కేసీఆర్ చర్చలు జరిపారు. ఈ సందర్భంగా తన ఆలోచనలను అధికారులకు సీఎం కేసీఆర్ పంచుకున్నారు. ఆగమశాస్త్రం ప్రకారం ఆలయ అభివృద్ధి పనులు జరగాలని సీఎం కేసీఆర్ సూచించారు. యాదాద్రి ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దిన ఆర్కిటెక్చర్ ఆనంద్ సాయికే కొండగట్టు బాధ్యతలు కూడా అప్పగించారు. సీఎం ఆదేశాలతో ఆనంద్ సాయి రెండు రోజులుగా కొండగట్టులో బస చేశారు. ఆలయాన్ని మొత్తం పరిశీలించారు. ప్రకారాలు, ప్రహరీ, ఆలయం లోపల అన్నింటిని పరిశీలించి ఒక అంచనాకు వచ్చారు. కొండగట్టు మాస్టర్ ప్లాన్ తయారీ, పర్యవేక్షణ బాధ్యతలు ఆనంద్ సాయి దగ్గరుండి చూసుకోనున్నారు. అయితే ఆలయం వద్ద దాదాపు 108 అడుగుల భారీ హనుమాన్ విగ్రహం నెలకొల్పనున్నట్లు సమాచారం. ఆలయ అభివృద్ధిపై జరిపిన చర్చలను సీఎం కేసీఆర్ మీడియా సమావేశం ద్వారా వివరించే అవకాశం ఉంది. కార్యక్రమంలో వెంట మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యేలు సంజయ్ కుమార్, సుంకె రవిశంకర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా (Karimnagar District) ప్రజాప్రతినిధులు తదితరులు ఉన్నారు.
కాగా సీఎం పర్యటన నేపథ్యంలో సాధారణ భక్తులకు దర్శనాలను నిలిపివేశారు. కొండ కింద దుకాణాలను మూసి వేయించారు. భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే కొండగట్టు బస్సు ప్రమాద బాధితులను ఆదుకోవాలని కోరుతూ కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఆందోళన చేస్తామని హెచ్చరించారు. సీఎం పర్యటన నేపథ్యంలో వాళ్లు ఆందోళనలు చేయకుండా ప్రతిపక్ష పార్టీల నాయకులను ముందస్తు అరెస్టులు చేశారు. సీఎం కేసీఆర్ పర్యటన ముగిసేంత వరకు ఆలయ ప్రాంతాన్ని భద్రతా బలగాలు (Police Force) తమ ఆధీనంలోకి తీసుకున్నాయి.