»Im Still In Congress Because Of Gandhi Family Says Sangareddy Mla Jagga Reddy
Gandhi Bhavanలో ఉండలేకపోతున్నా.. కూర్చోలేకపోతున్నా: Congress ఎమ్మెల్యే జగ్గారెడ్డి
ఎన్నో ఆవేదనలు నా మనసులో మెదలుతున్నాయి. చెబితే ఏం అవుతుందో.. చెప్పకపోతే ఏం జరుగుతుందో? కానీ ఒక చిన్న మాటను తప్పని పరిస్థితుల్లో మీడియా ద్వారా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు చెబుతున్నా. త్యాగాలు చేసిన రాహుల్ గాంధీ కుటుంబమంటే నాకు చాలా ఇష్టం. ఆ పిచ్చితోనే ఇంకా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నా
సంచలనాలకు మారుపేరుగా నిలిచే కాంగ్రెస్ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి (Jagga Reddy) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలోనే విపక్షంలాగా వ్యవహరించే జగ్గారెడ్డి మళ్లీ తన పాత ధోరణిలోనే మాట్లాడారు. ఈసారి పార్టీ నాయకులపై కాకుండా గాంధీ భవన్ (Gandhi Bhavan) కేంద్రంగా చేసుకుని విమర్శలు చేశారు. తన మనసులోని మాట పేరుతో బుధవారం సంగారెడ్డి (Sangareddy) ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక ప్రకటన చేశారు.
‘ఐదు నెలలకు ప్రస్తుతానికి పరిస్థితులు చాలా మారాయి. నేను ఇప్పుడు కేవలం నా నియోజకవర్గం (సంగారెడ్డి)పైనే పూర్తి దృష్టి సారిస్తున్నా. గాంధీ కుటుంబంపై (Gandhi Family) ఉన్న అభిమానంతోనే కాంగ్రెస్ (Congress Party)లో ఇంకా కొనసాగుతున్నా. గతంలో గాంధీ భవన్ లో అనేక చర్చలు చేసుకునేవాళ్లం. నాయకులమంతా కలిసి స్వేచ్ఛగా చర్చించుకునేవారం. ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదు. ఒకప్పుడు నేను రోజు గాంధీభవన్ లో కూర్చొని అనేక సమస్యలు మర్చిపోయి ఆనందించేవాడిని. ఈ రోజు అక్కడకు వెళ్లి ప్రశాంతంగా కూర్చునే పరిస్థితి లేదు. రాజకీయంగా గాంధీభవన్ కు రాలేని పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి ఎన్నో ఆవేదనలు నా మనసులో మెదలుతున్నాయి. చెబితే ఏం అవుతుందో.. చెప్పకపోతే ఏం జరుగుతుందో? కానీ ఒక చిన్న మాటను తప్పని పరిస్థితుల్లో మీడియా ద్వారా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు చెబుతున్నా. త్యాగాలు చేసిన రాహుల్ గాంధీ కుటుంబమంటే నాకు చాలా ఇష్టం. ఆ పిచ్చితోనే ఇంకా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నా’ అని మనసులోని మాట ప్రకటనలో జగ్గారెడ్డి పేర్కొన్నారు.
ఈ ప్రకటనను చూస్తుంటే జగ్గారెడ్డి ఇంకా అసంతృప్తితోనే రగులుతున్నట్లు తెలుస్తున్నది. పార్టీ రాష్ట్ర నాయకత్వంపై జగ్గారెడ్డి ఎప్పటి నుంచో రగిలిపోతున్నాడు. రేవంత్ రెడ్డి (Revanth Reddy) తీరు, సీనియర్లకు గౌరవం దక్కకపోవడం వంటివి వాటితో విసుగెత్తారు. ముఖ్యంగా బీఆర్ఎస్ (BRS Party)కు దీటుగా పార్టీ ప్రజల్లోకి చొచ్చుకెళ్లకపోవడం, సీఎం కేసీఆర్ (KCR) పాలనకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు నిర్మించడంలో విఫలమవడంతో జగ్గారెడ్డి అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఢిల్లీలో పార్టీ అధిష్టానానికి కూడా ఫిర్యాదు చేసినా పరిస్థితిలో మార్పు లేదు. దీంతో రాష్ట్ర రాజకీయాలు మానేసి కేవలం నియోజకవర్గానికే పరిమితం కావాలని జగ్గారెడ్డి నిర్ణయించారు. కేవలం గాంధీ కుటుంబంపై ఉన్న ప్రేమతోనే పార్టీలో కొనసాగుతున్నా అనే ప్రకటన చూస్తే పార్టీ రాష్ట్ర నాయకత్వంపై జగ్గారెడ్డి ఇంకా గుర్రుగా ఉన్నట్టే తెలుస్తున్నది. కాగా వచ్చే ఎన్నికల్లో సంగారెడ్డి నుంచి తనను తాను అభ్యర్థిగా జగ్గారెడ్డి ప్రకటించుకుని ఇప్పటి నుంచే ప్రచారం మొదలుపెట్టారు. కాగా కొన్నాళ్ల నుంచి కొంత అధికార పార్టీపై విమర్శల ధాటి తగ్గించారు. తన నియోజకవర్గం సంగారెడ్డికి వైద్య కళాశాల ఏర్పాటు చేయడం, నియోజకవర్గంలో అభివృద్ధి పనుల్లో వేగం పెంచడంతో ప్రస్తుతం సీఎం కేసీఆర్ పై జగ్గారెడ్డి సానుకూల వైఖరితో ఉన్నారు.