Fire Accident : సంగారెడ్డి కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు.. ఐదుగురి మృతి
సంగారెడ్డి జిల్లాలో ఉన్న కెమికల్ ఫ్యాక్టరీలో బాయిలర్ నుంచి భారీ పేలుడు సంభవించింది. దీంతో ఫ్యాక్టరీ డైరెక్టర్ సహా ఐదుగురు మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Fire Accident In Sangareddy : సంగారెడ్డి జిల్లాలో వరుస అగ్ని ప్రమాదాలు మనుషుల ప్రాణాలను బలిగొంటున్నాయి. బుధవారం అక్కడి హత్నూర్ మండలంలో ఉన్న కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. చందాపూర్ శివారులో ఉన్న ఎస్బీ ఆర్గానిక్ పరిశ్రమలో ఆయిల్ బాయిలర్లో పేలుడు (Boiler Explosion) సంభవించింది. ఆ భారీ పేలుడు దాటికి అక్కడ ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. బిల్డింగ్ ధ్వంసం అయ్యింది. ఎస్బీ ఆర్గానిక్స్ యూనిట్-1 పరిశ్రమలో కాలం చెల్లిన రియాక్టర్లను ఉపయోగించడంతోనే ప్రమాదం సంభవించినట్లు అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. దశాబ్దాల క్రితం నిర్మించిన భవనంతోపాటు బాయిలర్ కూడా పూర్తిగా శిథిలావస్థకు చేరినట్లు సమాచారం.
ఈ ఫ్యాక్టరీలో డైరెక్టర్గా ఉన్న రవి అనే వ్యక్తితో పాటు బిహార్ రాష్ట్రానికి చెందిన నలుగురు కార్మికులు సైతం మృతి చెందారు. మరో పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను దగ్గరలో ఉన్న సంగారెడ్డి, హైదరాబాద్ ఆసుపత్రులకు హుటాహుటిన తరలించారు. స్థానికుల ఇచ్చిన సమాచారంతో అగ్నిమాపక దళం కాసేపటికే అక్కడికి చేరుకుంది. మంటలు ఆర్పే ప్రక్రియ మొదలు పెట్టంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పేలుడు జరిగిన సమయంలో పరిశ్రమలో దాదాపు 60 మంది ఉన్నారని తెలుస్తోంది. ఇందులో 15 మంది పేలుడు జరిగిన రియాక్టర్ వద్దే పని చేస్తున్నారు. ప్రమాద స్థలాన్ని మంత్రి కొండా సురేఖ, పటాన్ చెర్వు డీఎస్పీ రవీందర్ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి, మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందర్రావులు పరిశీలించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు.