»At Paris Olympics Indian Athletes To Get A Taste Of Home
Paris Olympics : పారిస్ ఒలింపిక్స్‌లో పప్పు, చపాతీ, చికెన్.. ఇంకా ఎన్నో!
విదేశాల్లో క్రీడలు ఆడటానికి వెళ్లే భారతీయ క్రీడాకారులకు ఎప్పుడూ ఆహారం సమస్యగానే ఉంటుంది. మనకు అలవాటైన ఆహార పదార్థాలు అక్కడ అందుబాటులో ఉండవు. అయితే పారిస్‌లో జరగబోయే ఒలింపిక్స్‌లో మాత్రం ఎన్నో భారతీయ వంటకాలు అందుబాటులో ఉండనున్నాయి.
Paris Olympics Indian Athletes Food : ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరిగే ఒలింపిక్స్ అంటే క్రీడాకారుల సన్నద్ధత మామూలుగా ఉండదు. దీనితో పాటు ఆ సమయంలో దొరికే ఆహారంపైనా వారి ఆటతీరు ఆధారపడి ఉంటుంది. అందుకనే ఈ ఏడాది జులై, ఆగస్టుల్లో పారిస్‌లో జరగబోయే ఒలంపిక్స్‌కు భారత ఆటగాళ్ల కోసం మెనూ సిద్ధమైంది. విదేశీ ఆహారాలతో వారు ఇబ్బందులు పడకుండా ఉండటం కోసం ఒలింపిక్స్‌లో ప్రత్యేకంగా భారతీయ మెనూ ఉండనుంది.
ఒలింపిక్స్(Olympics) క్రీడా గ్రామంలో భారతీయ ఆటగాళ్ల కోసం పప్పు, చపాతీ, ఆలుగడ్డ, గోబీ, చికెన్ లాంటి కొన్ని రకాల వంటకాలను తయారు చేసి వడ్డించనున్నారు. ఈ మెనూను భారత్ ఇప్పటికే ఒలింపిక్స్ నిర్వాహకులకు పంపించిందని భారత డిప్యూటీ చెఫ్ డి మిషన్ శివ కేశవన్ తెలిపారు. ఈ విషయమైన కేశవన్ మాట్లాడారు.
మన ఆటగాళ్ల కోసం భారతీయ ఆహారం ఉండాలని తాము చేసిన ప్రతిపాదనకు ఒలింపిక్ నిర్వాహకుల నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని కేశవన్ తెలిపారు. భారతీయ అథ్లెట్లకు(Indian Athletes) ఆహారం విషయం గతంలో పెద్ద సమస్యగా ఉంటూ వచ్చిందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని వంటకాలూ అక్కడ ఉంటాయిగాని భారతీయ వంటకాలు మాత్రం ఉండవు. అందుకనే ఈ విషయంలో తాము పట్టుబట్టామని ఆయన తెలిపారు. దక్షిణాసియా వంటకాలు తయారు చేయడానికి వారు ఒప్పుకున్నారని అన్నారు. దీంతో ఇప్పుడు పప్పు, అన్నం పారిస్ ఒలింపిక్స్‌లోనూ(Paris Olympics) అందుబాటులో ఉంటాయని చెప్పారు.