»Brs Party Enters In 23 Years Foundation Day Celebrations And Trs To Brs History Detais
23వ పడిలోకి BRS Party.. ఉద్యమం నుంచి జాతీయ రాజకీయాల వరకు పార్టీ ప్రస్థానం
మూణ్నాళ్ల పార్టీ.. వచ్చేది లేదు.. కేసీఆర్ వలన కాదు.. హే ఇది ఉప ఎన్నికల పార్టీ అని అవహేళన చేసిన వారు.. నేడు వారు నివ్వెరపోయేలా బీఆర్ఎస్ పార్టీ అద్భుత ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది. ఉద్యమ పార్టీ నుంచి రాజకీయ పార్టీ, రాజకీయ పార్టీ నుంచి జాతీయ పార్టీగా అవతరించిన బీఆర్ఎస్ పార్టీ ప్రస్థానం సందర్భంగా ప్రత్యేక కథనం.. చదవండి
ఒక రాష్ట్ర సాధన కోసం ఏర్పడిన పార్టీ.. ఫక్తూ ఉద్యమ పార్టీగా అవతరించినప్పటికీ మారిన పరిణామాల క్రమంలో రాజకీయ పార్టీగా (Political Party) అవతరించింది. తాజాగా దేశంలో నెలకొన్న ప్రమాదకర పరిస్థితుల నేపథ్యంలో జాతీయ పార్టీగా (National Party) రూపుదిద్దుకుంది. ఇలా మారిన కాలమాన పరిస్థితులకు అనుగుణంగా రూపాంతరం చెందుతూ నేడు దేశ ప్రజలకు ఆశదీపంలా కనిపిస్తున్నది భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) (BRS Party). 14 ఏళ్లు స్వరాష్ట్రం కోసం.. తొమ్మిదేళ్లు స్వరాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామవుతున్న బీఆర్ఎస్ ఇప్పుడు దేశ రాజకీయాలను మార్చేందుకు రంగంలోకి దిగింది. అలాంటి బీఆర్ఎస్ ఏప్రిల్ 27 గురువారంతో 22 ఏళ్లు పూర్తి చేసుకుని 23వ వసంతంలోకి అడుగుపెట్టింది. దీంతో తెలంగాణవ్యాప్తంగా గులాబీ పండుగ కనిపిస్తోంది. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం..
హైదరాబాద్ (Hyderabad)లోని హుస్సేన్ సాగర్ ఒడ్డున ఉన్న జలదృశ్యంలో (Jaladrushyam) 2001 ఏప్రిల్ 27వ తేదీన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీ (TRS Party) పురుడు పోసుకుంది. అప్పుడు ఎగిరిన గులాబీ జెండా దినదిన ప్రవర్ధనమానమై నేడు దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే స్థాయికి ఎదిగింది. తెలుగుదేశం పార్టీలో ఉన్న కేసీఆర్ (KCR) అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవితో పాటు టీడీపీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి సరికొత్త రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. పార్టీ స్థాపనే ఒక సంచలనం కాగా.. 2001 మే 17న కరీంనగర్ లో నిర్వహించిన సింహ గర్జన సభ దేశాన్ని ఆకర్షించింది. లక్షలాది ప్రజలు ‘జై తెలంగాణ’ అని నినదించడంతో మలి ఉద్యమానికి అడుగు పడింది. అదే ఏడాది జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో 2 జిల్లా పరిషత్ స్థానాలు, 85 జెడ్పీటీసీ, 3 వేల సర్పంచ్, 12 వేల వార్డు, వందకు పైగా ఎంపీటీసీ స్థానాలను సొంతం చేసుకుని టీఆర్ఎస్ తిరుగులేని విజయాన్ని నమోదు చేసింది.
– 2003లో వరంగల్ లో ‘తెలంగాణ జైత్రయాత్ర’ కాంగ్రెస్ తో పొత్తుకు దారి తీసింది.
– 2010 డిసెంబర్ 16న వరంగల్ లో నిర్వహించిన తెలంగాణ మహాగర్జన తెలంగాణ వాదాన్ని ప్రపంచానికి టీఆర్ఎస్ చాటి చెప్పింది.
తొలి అసెంబ్లీ ఎన్నికలు
– కాంగ్రెస్ (Congress)తో కలిసి పొత్తు పెట్టుకుని టీఆర్ఎస్ 2004లో తొలిసారి అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లింది. ఆ ఎన్నికల్లో 26 అసెంబ్లీ, 5 పార్లమెంట్ స్థానాలు సొంతం చేసుకుంది. యూపీఏలో చేరడంతో కేసీఆర్ కేంద్ర మంత్రి అయ్యారు. అయితే రెండేళ్ల తర్వాత తెలంగాణపై కాంగ్రెస్ మాట మార్చడంతో 2006లో యూపీఏ నుంచి టీఆర్ఎస్ బయటకు వచ్చింది. రాజీనామా చేయడంతో 2006 సెప్టెంబర్ 13న జరిగిన కరీంనగర్ (Karimnagar) ఉప ఎన్నికల్లో కేసీఆర్ భారీ మెజార్టీతో గెలుపొందారు.
– తెలంగాణ ఉద్యమాన్ని తీవ్రం చేయడంలో భాగంగా ఏప్రిల్ 2008లో పార్టీ 16 మంది ఎమ్మెల్యేలు, నలుగురు ఎంపీలు తృణపాయంగా పదవులకు రాజీనామా చేశారు. అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ 7 ఎమ్మెల్యే, 2 ఎంపీ స్థానాలు సొంతం చేసుకుంది.
– 2009 ఎన్నికల్లో తెలంగాణ సాధన కోసం మహా కూటమిగా ఏర్పడిన కూటమిలో టీడీపీ, బీజేపీతో కలిసి టీఆర్ఎస్ చేతులు కలిపింది. 45 అసెంబ్లీ, 9 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయగా 10 ఎమ్మెల్యే, 2 పార్లమెంట్ స్థానాల్లో టీఆర్ఎస్ గెలిచింది.
– 2014లో స్వరాష్ట్ర కల తెలంగాణను తీసుకురావడంతో టీఆర్ఎస్ కు ప్రజలు పట్టం కట్టారు. 119 నియోజకవర్గాల్లో పోటీ చేస్తే 63 ఎమ్మెల్యే స్థానాలు గెలుపొంది అధికారం చేపట్టింది. ఇక 17 ఎంపీ స్థానాల్లో 11ను సొంతం చేసుకుని టీఆర్ఎస్ తిరుగులేని విజయాన్ని సాధించింది.
– వ్యూహంలో భాగంగా 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లిన టీఆర్ఎస్ సంచలన విజయాన్ని నమోదు చేసింది. 117 స్థానాల్లో 88 ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకుని కొత్త చరిత్ర లిఖించింది.
– 2019 లోక్ సభ ఎన్నికలు కొంత నిరాశ కలిించాయి. 17 స్థానాల్లో 9 ఎంపీ స్థానాలను గులాబీ పార్టీ గెలుచుకుంది.
జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశం
దేశంలో నెలకొన్న రాజకీయ శూన్యతను భర్తీ చేసేందుకు టీఆర్ఎస్ కాస్త భారత్ రాష్ట్ర సమితిగా రూపాంతరం చెందింది. 2022 అక్టోబర్ 6వ తేదీన దసరా పండుగ రోజు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించింది. దీనికి ఎన్నికల సంఘం కూడా ఆమోదం తెలిపింది. ఢిల్లీలో జాతీయ కార్యాలయం ప్రారంభం కాగా, ప్రస్తుతం మహారాష్ట్రలో రెండు కార్యాలయాలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. త్వరలోనే ఏపీ, బిహార్, కర్ణాటకలో పార్టీ కార్యాలయాలు ప్రారంభించనున్నారు.
ఆవిర్భావ దినోత్సవం వేళ కేసీఆర్ దిశానిర్దేశం
పార్టీ ఆవిర్భావం సందర్భంగా హైదరాబాద్ లోని పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్ లో పార్టీ సర్వసభ్య సమావేశం నిర్వహించనుంది. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ సారథ్యంలో జరిగే ఈ సమావేశానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లాల అధ్యక్షులు, కార్పొరేషన్ చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున ఈ సమావేశానికి తరలిరానున్నారు. ఈ సమావేశంలో పలు రాజకీయ తీర్మానాలు ప్రవేశపెట్టి, చర్చించి ఆమోదించే అవకాశం ఉంది. ప్లీనరీ బదులు అక్టోబర్ 10వ తేదీన భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభతో అసెంబ్లీ ఎన్నికలకు సమర శంఖం పూరించనుంది. పార్టీ ఆవిర్భావం సందర్భంగా నెల రోజుల నుంచి రాష్ట్రంలో ఆత్మీయ సమ్మేళనాలు ఉత్సాహంగా జరిగాయి. గ్రామాలు, మండలాలు, పట్టణాలు, మున్సిపాలిటీలు, జిల్లాల స్థాయిలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు జరిగాయి.