»Cm Kcr Friend Senior Journalist N Rahul Retired From The Hindu
CM KCRకు భారీ షాక్.. ఇకపై ప్రెస్ మీట్ కు ఆయన దోస్త్ రాహుల్ రానట్టే..
ఆయన లేకుంటే కేసీఆర్ కు కూడా బోరు కొడుతుంది కదా అని నెటిజన్లు (Netizens) కామెంట్ చేస్తున్నారు. కేసీఆర్ ఎలాగైనా చేసి తన మిత్రుడిని తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలని కోరుతున్నారు. లేదంటే ఎంతో మందిని సలహాదారులుగా నియమించుకున్నారు.. వారిలో రాహుల్ ను కూడా నియమించుకోవాలని సూచిస్తున్నారు.
బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) ఊహించని షాక్ తగిలింది. ఇకపై ప్రెస్ మీట్ (Press Meet)లో తన మిత్రుడు రాహుల్ కనిపించనట్టే. ఎందుకంటే రిపోర్టర్ రాహుల్ ఉద్యోగ విరమణ (Retirement) పొందాడు. దీంతో ఇక నుంచి కేసీఆర్ నోటి వెంట ‘ఏం రాహుల్’ అనే పదం వినిపించకపోవచ్చు. ప్రతి సమావేశంలో సీఎం కేసీఆర్, రాహుల్ మధ్య జరిగే సంభాషణ ఇకపై ఉండకపోవచ్చు.
సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ అంటేనే రాహుల్ అనే పేరు కోసం వీక్షకులు (Viewers) ఎదురుచూస్తుంటారు. కేసీఆర్, రాహుల్ మధ్య సరదా సంభాషణ (Talks) జరుగుతుంటుంది. ముఖ్యంగా కరోనా సమయంలో సీఎం కేసీఆర్ నిర్వహించిన ప్రతి సమావేశంలో రాహుల్ ప్రత్యేక ఆకర్షణగా (Special Attraction) నిలిచారు. అంతెందుకు ఇటీవల ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీఎం కేసీఆర్ రాహుల్ పేరు ప్రస్తావించిన విషయం తెలిసిందే.
కేసీఆర్ పిలిచే ఎన్.రాహుల్ అనే వ్యక్తి ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ‘ది హిందూ’లో (The Hindu) సీనియర్ రిపోర్టర్. సుదీర్ఘ కాలం పాటు పాత్రికేయ వృత్తిలో (Journalism) కొనసాగుతున్నారు. ఎందరో ముఖ్య నాయకులను ఇంటర్వ్యూలు (Interviews) చేశారు. కానీ ఎప్పుడూ పేరు బయటకు రాలేదు. సాధారణంగా ఏ పత్రిక రిపోర్టర్ (Reporter) పేరు బయటకు రాదు. వారి ముఖం కూడా ఎవరికీ తెలియదు. వాళ్లు రాసే వార్త (News) మాత్రమే బయటకు వస్తుంది. అలాంటిది రాహుల్ మాత్రం కేసీఆర్ ప్రెస్ మీట్ ద్వారా ప్రపంచానికి తెలిసింది. పలుమార్లు రాహుల్ ప్రస్తావన రావడంతో ప్రజలు నెట్ (Internet)లో ‘రాహుల్ ఎవరు? ఆయన వయసెంత? ఏం చేస్తారు? ఏ పేపర్?’ వంటివి వెతికారు.
రాహుల్ పేరిట ఎంతో మంది జర్నలిస్టులు (Journalists) ఉన్నా కేసీఆర్ పిలిచేది మాత్రం ది హిందూలో పని చేసే ఎన్.రాహుల్. ది హిందూ వెబ్ సైట్ లో ఆయన ఆథర్ గా చాలా వార్తలు పబ్లిష్ అయ్యాయి. తాజాగా ఆయనకు 60 ఏళ్లు పూర్తవడంతో సంస్థ నిబంధనల ప్రకారం హిందూ సంస్థ నుంచి ఎన్.రాహుల్ ఉద్యోగ విరమణ పొందారు. రాహుల్ చివరి పనిదినం మే 31వ తేదీ. ఆయన ఉద్యోగ విరమణ పొందారనే వార్త వైరల్ (Viral)గా మారింది.
కాగా, రాహుల్ తో కేసీఆర్ కు ప్రత్యేక అనుబంధం ఉంది. తొలిసారి సీఎంగా ప్రమాణస్వీకారానికి (Oath) వెళ్తున్న సమయంలో సీఎం కేసీఆర్ రాహుల్ పని చేసే సోమాజిగూడలోని (Somajiguda) హిందూ పత్రిక కార్యాలయం ముందు కాన్వాయ్ ను నిలిపేశాడు. తన ప్రమాణస్వీకారానికి హాజరుకావాలని కోరుతూ తన కాన్వాయ్ (Convoy)లోకి రాహుల్ ను ఆహ్వానించాడని తెలుస్తోంది. అయితే నిబద్ధత గల రాహుల్ ‘ఇప్పుడు రాలేను.. ఆఫీసులో చేయాల్సిన పని ఉంది. అది పూర్తవగానే వస్తా’ అని చెప్పి సీఎం కేసీఆర్ ఆహ్వానాన్ని తిరస్కరించారు. ఉమ్మడి సీఎంగా ఉన్న నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి (Nallari Kiran Kumar Reddy) క్లాస్ మేట్ రాహుల్. సీఎం అయిన తర్వాత రాహుల్ ను కిరణ్ వెన్నంటే ఉండేలా చూసుకున్నారు. హైదరాబాద్ (Hyderabad)లో ఓ పర్యటన సందర్భంగా రాహుల్ ను భద్రతా సిబ్బంది ఆపివేయగా కిరణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఆయన నాకు ముఖ్యమైన వ్యక్తి అని చెప్పినట్లు సమాచారం. ఇలా ప్రముఖులతో రాహుల్ కు సత్సంబంధాలు ఉన్నాయి. కానీ ఏనాడూ ఆ సంబంధాలను ఉపయోగించుకుని రాహుల్ లబ్ధి పొందలేదు. అందుకే రాహుల్ అందరికీ ప్రత్యేకం.
ఇకపై రాహుల్ సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ లో కనిపించారా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఆయన లేకుంటే కేసీఆర్ కు కూడా బోరు కొడుతుంది కదా అని నెటిజన్లు (Netizens) కామెంట్ చేస్తున్నారు. కేసీఆర్ ఎలాగైనా చేసి తన మిత్రుడిని తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలని కోరుతున్నారు. లేదంటే ఎంతో మందిని సలహాదారులుగా నియమించుకున్నారు.. వారిలో రాహుల్ ను కూడా నియమించుకోవాలని సూచిస్తున్నారు. లేదంటే సీఎం కార్యాలయంలో (CMO) ప్రత్యేక పదవి ఇవ్వాలని కోరుతున్నారు. ఈ విధంగా రాహుల్ పై ప్రజలు అభిమానం పెంచుకున్నారు. మరి రాహుల్ ఉద్యోగ విరమణ వార్త సీఎం కేసీఆర్ కు తెలుసో లేదో తెలియదు. తెలిస్తే మాత్రం తనకు నచ్చిన వ్యక్తి కాబట్టి కేసీఆర్ ఏదో విధంగా తన వెంట ఉంచుకునే అవకాశం ఉంది.