David Warner: ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ నూతన సంవత్సర వేళ అభిమానులకు షాక్ ఇచ్చాడు. ఓపెనర్ వార్నర్ ఇక వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. తాను తీసుకున్న ఈ నిర్ణయం వల్ల కొత్త వారికి అవకాశాలు లభిస్తాయని వార్నర్ భావించారు. ఇప్పటికే డేవిడ్ టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ వారం పాకిస్థాన్‌తో జరగనున్న ఫైనల్ టెస్ట్ మ్యాచ్ అతని కెరీర్లో చివరిది. భారత గడ్డపై వరల్డ్ కప్ గెలవడం అతని కెరీర్లో అతిముఖ్యమైన సందర్భమని వార్నర్ తెలిపాడు.
ఒకవేళ శరీరం సహకరిస్తే వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడుతానని వార్నర్ తెలిపాడు. అలాగే ఆస్ట్రేలియాలో జరిగే బిగ్‌బాష్ లీగ్‌లో కొనసాగుతానని కూడా స్పష్టం చేశారు. తన క్రికెట్ కెరీర్‌ను తీర్చిదిద్దడంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ గ్రెగ్ చాపెల్ కీలకపాత్ర పోషించినట్లు తెలిపాడు. లెఫ్ట్ హ్యాండర్ అయిన వార్నర్ ఇప్పటివరకు 161 వన్డేల్లో 6932 పరుగులు సాధించాడు. అంతేకాకుండా 97.26 స్ట్రైక్ రేటుతో 22 సెంచరీలు చేసి.. ఆస్ట్రేలియా తరఫున అత్యధిక శతకాలు బాదిన రెండో క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు.