»Holi Safely Completed Pidiguddulata At Hunsa Village Of Nizamabad District
Holi పిడిగుద్దుల పండుగ.. ఊరంతా కలిసి పొట్టుపొట్టు కొట్టుకున్నారు
ఈ ఉత్సవం నిర్వహించరాదని న్యాయస్థానాల వరకు చేరింది. అయినా తమ గ్రామం క్షేమం కోరి తాము నిర్వహించుకుంటామని గ్రామస్తులు ముక్తకంఠంతో చెబుతుండడంతో ఇక ఉత్సవానికి అనుమతులు లభిస్తున్నాయి. మీ సంప్రదాయాన్ని గౌరవిస్తాం కానీ ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉత్సవం నిర్వహించుకోవాలనే పోలీసుల సూచనతో పిడిగుద్దులాట ప్రతియేటా జరుగుతోంది.
భారతదేశం (India) భిన్న సంస్కృతులు, సంప్రదాయాలకు పుట్టినిల్లు. అయినా ఐకమత్యంగా కలిసి మెలిసి జీవించడం మన దేశ గొప్పతనం. వసుధైక కుటుంబం (Vasudaika Kutumb)గా విలసిల్లుతున్న మన దేశంలో మనకు తెలియని ఎన్నో సంప్రదాయాలు కొనసాగుతున్నాయి. తరతరాల నుంచి వస్తున్న ఆచార వ్యవహారాలను సంబంధిత వర్గాలు కొనసాగిస్తున్నాయి. అలాంటి సంప్రదాయమే పిడిగుద్దులాట. తెలంగాణలో హోలీ పండుగ (Holi Festival) సందర్భంగా చేసుకునే పిడిగుద్దులాట దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ప్రతియేటా మాదిరి మంగళవారం జరిగిన హోలీ పండుగ రోజు కూడా ఆనవాయితీగా పిడిగుద్దులాట (Pidiguddulata) ఉత్సాహంగా కొనసాగింది. దాని వివరాలు ఇలా ఉన్నాయి.
తెలంగాణ (Telangana)-మహారాష్ట్ర (Maharashtra) సరిహద్దులోని నిజామాబాద్ జిల్లా (Nizamabad District) సాలూరు మండలం హున్సా (Hunsa) గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా ప్రతి సంవత్సరం పిడిగుద్దులాట నిర్వహిస్తారు. తాజాగా ఈ ఏడాది మంగళవారం కూడా హోలీ పండుగ రోజే గ్రామస్తులు పిడిగుద్దులాట చేశారు. సోమవారం రాత్రి కామ దాహనం అనంతరం గ్రామస్తులు హోలీ సంబరాల్లో పాల్గొన్నారు. ఇక సాయంత్రం గ్రామస్తులు రెండు వర్గాలుగా ఏర్పడి హనుమాన్ ఆలయం (Hanuman Temple) వద్దకు ఊరేగింపుగా చేరుకున్నారు. అనంతరం ఒక తాడు కట్టి తాడుకు ఇరువైపులా రెండు వర్గాలు నిలబడి పరస్పరం పిడిగుద్దులతో దాడి చేసుకున్నారు. ముఖం, వీపులపై పిడిగుద్దులు కురిపించారు. ఇలా దాదాపు 15 నిమిషాల పాటు పిడిగుద్దుల వర్షం కొనసాగింది.
అనంతరం గ్రామస్తులంతా అలయ్ బలయ్ (Alai Balai) చేసుకుని పండుగ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఈ పండుగ సందర్భంగా బోధన్ రూరల్ పోలీసులు (Bodhan Rural Police) పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా పిడిగుద్దులలో గాయాలైతే రాత్రి కాముడి దహనం చేయగా మిగిలిన బూడిదను గాయాలకు పట్టిస్తే మానుతాయని గ్రామస్తుల నమ్మకం. గాయాలపాలైన వారికి వైద్యం అందించారు. ఈ ఉత్సవం జరగకపోతే తమ గ్రామానికి అరిష్టమని గ్రామస్తులు భావిస్తున్నారు. కాగా పండుగ సందర్భంగా కుస్తీ పోటీలు కూడా నిర్వహించారు. ఈ ఉత్సవాల నేపథ్యంలో తెలంగాణతో పాటు మహారాష్ట్రలోని ఇతర ప్రాంతాల వారు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
కాగా నలభై ఏళ్లలో పిడిగుద్దులాట ఒకసారి నిర్వహించకపోతే ఆ సంవత్సరం గ్రామంలో చాలా అపశకునాలు జరిగాయని గ్రామస్తులు చెబుతున్నారు. అందుకే గ్రామస్తులు పట్టుబట్టి ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ ఉత్సవం నిర్వహించరాదని న్యాయస్థానాల వరకు చేరింది. అయినా తమ గ్రామం క్షేమం కోరి తాము నిర్వహించుకుంటామని గ్రామస్తులు ముక్తకంఠంతో చెబుతుండడంతో ఇక ఉత్సవానికి అనుమతులు లభిస్తున్నాయి. మీ సంప్రదాయాన్ని గౌరవిస్తాం కానీ ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉత్సవం నిర్వహించుకోవాలనే పోలీసుల సూచనతో పిడిగుద్దులాట ప్రతియేటా జరుగుతోంది.