అక్కడ స్నానాలు చేస్తూ సరదాగా నీటిలో ఆడుకుంటున్నారు. ఆ క్రమంలోనే లోతు ఎక్కువ ఉన్న ప్రదేశంలోకి వెళ్లడంతో ప్రమాదవశాత్తు మునిగిపోయారు. లోతు అధికంగా ఉండడంతో నీటిలోనే కూరుకుపోయి మృతి చెందారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు చేరుకుని బాలుర మృతదేహాలను బయటకు తీశారు.
హోలీ పండుగ (Holi) తెలంగాణ (Telangana)లో ఆనందోత్సాహాల మధ్య జరిగింది. అయితే కొన్నిచోట్ల మాత్రం తీవ్ర విషాదం నింపింది. హోలీ సందర్భంగా రంగులతో ఉత్సాహంగా ఆడుకున్న వారు అనంతరం శుభ్రం చేసుకునేందుకు వెళ్లగా జలాశయా (Water Reservoirs)ల్లో మునిగి ఐదుగురు మృతి చెందారు. దీంతో ఆయా కుటుంబాల్లో పండుగ పూట విషాదం అలుముకుంది. కరీంనగర్ జిల్లాలో ముగ్గురు బాలురు, నాగర్ కర్నూల్ లో ఒకరు, వికారాబాద్ జిల్లాలో మరొకరు మృత్యువాత పడ్డారు. అయితే మృతి చెందిన వారంతా 25 ఏళ్లలోపు వయసు గలిగిన వారే ఉండడం కలచివేస్తోంది. వివరాలు ఇలా ఉన్నాయి.
కరీంనగర్ (KarimNagar)లోని హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన వల్లెపు అనిల్ (12), గోనెపల్లి సంతోశ్ (13), బత్తిన వీరాంజనేయులు (16) స్నేహితులు. హోళీ సందర్భంగా కాలనీలో మంగళవారం రంగులు వేసుకుని స్నేహితులతో సరదాగా గడిపారు. అనంతరం వీరు ముగ్గురు తీగల వంతెన సమీపంలోని మానేరు నది (Manair River)లో స్నానానికి వెళ్లారు. అక్కడ స్నానాలు చేస్తూ సరదాగా నీటిలో ఆడుకుంటున్నారు. ఆ క్రమంలోనే లోతు ఎక్కువ ఉన్న ప్రదేశంలోకి వెళ్లడంతో ప్రమాదవశాత్తు మునిగిపోయారు. లోతు అధికంగా ఉండడంతో నీటిలోనే కూరుకుపోయి మృతి చెందారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు చేరుకుని బాలుర మృతదేహాలను బయటకు తీశారు. మృతుల కుటుంబాలు ఏపీలోని ప్రకాశం జిల్లా (Prakasam District)కు చెందిన వారు. కొన్నేళ్ల కిందట కూలీ పనుల కోసం కరీంనగర్ కు వచ్చి అక్కడే స్థిరపడ్డాయి. కాగా బాలుర మృతి సంఘటనపై తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సీఎం ఫండ్ నుంచి రూ.3 లక్షల చొప్పున, తన వంతుగా రూ.2 లక్షలు అందిస్తామని మంత్రి ప్రకటించారు.
ఇక నాగర్ కర్నూల్ (NagarKurnool)లోని అంబేడ్కర్ కాలనీకి చెందిన వినయ్ (25) హోలీ అనంతరం పట్టణంలోని మినీ ట్యాంక్ బండ్ లో స్నానం చేసేందుకు వెళ్లాడు. స్నానం చేస్తుండగా కాలు జారి నీటిలో మునిగిపోయి ప్రాణాలు కోల్పోయాడు. అతడు హమాలీగా పని చేస్తుండగా గత నెలలోనే వినయ్ కు వివాహమైంది. పెళ్లయి నెల కూడా కాక మునుపే అతడు మృతి చెందడంతో కుటుంబం విషాదంలో మునిగింది.
వికారాబాద్ జిల్లా (Vikarabad District) తాండూరు (Tandur)లోని మల్ రెడ్డిపల్లికి చెందిన ప్రదీప్ (18) హైదరాబాద్ ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. పండుగ సందర్భంగా స్వగ్రామం మల్ రెడ్డిపల్లికి వచ్చాడు. స్నేహితులు, కుటుంబసభ్యులతో ఉత్సాహంగా హోలీలో పాల్గొన్నాడు. అనంతరం కాగ్నా నదికి వెళ్లి అక్కడ చెక్ డ్యామ్ లో స్నానానికి దిగాడు. ప్రమాదవశాత్తు నీళ్లలో మునిగి మృతి చెందాడు.
ఆదిలాబాద్ జిల్లా (Adilabad District) బోథ్ (Both) మండలం గుర్రాలతండాలో నిర్వహించిన బరువు ఎత్తే పోటీలు విషాదంగా మారాయి. హైదరాబాద్ లో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్న కటక్ వార్ రమేశ్ (45) బండరాయి ఎత్తే పోటీలో పాల్గొన్నాడు. అయితే వంద కిలోల బరువున్న రాయిని ఎత్తలేకపోయాడు. ఆ బండరాయి అతడి తలపై పడడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. ఆస్పత్రికి తరలిస్తుండగానే మృతి చెందాడు. ఇలా హోలీ పండుగ వీరి కుటుంబాల్లో విషాదం నింపింది.