»85 Years Old Man Wills Property Worth Rs 1 5 Crore To Up Government
Old Man బిడ్డలపై కోపంతో కోట్ల ఆస్తిని ప్రభుత్వానికి ఇచ్చేసిన వృద్ధుడు
ఈ వయసులో నేను నా కొడుకు, కోడలితో ఉండాల్సి ఉంది. కానీ వాళ్లు నన్ను చూసుకోవడం లేదు. ఇక వాళ్లకు ఆస్తి ఎలా ఇస్తాను. అందుకే నా యావదాస్తిని ప్రభుత్వానికి ఇవ్వాలని నిర్ణయించుకున్నా
మలి వయసు (Oldage)లో కన్న వాళ్ల బాగోగులను చూసుకోవాల్సిన పిల్లలు (Daughters and Sons) పట్టించుకోవడం లేదు. పెంచి పెద్ద చేసి.. జీవితం స్థిరపడేలా చేసిన తల్లిదండ్రుల (Mother and Father)ను వారసులు మరచిపోతున్నారు. తమ సంసారంలో మునిగి కన్నవారి ఆలనాపాలనా చూసుకోవడం లేదు. దీంతో వృద్ధాప్యంలో ఉన్న వారు దిక్కు లేని వారవుతున్నారు. చివరకు వృద్ధాశ్రమాలకు (Old Age Home) చేరుతున్నారు. కుటుంబసభ్యుల (Family) మధ్య ఆనందోత్సాహాలతో ఉండాల్సిన వాళ్లు నాలుగ్గోడల మధ్య దేవుడి పిలుపు కోసం ఎదురుచూస్తు కాలం నెట్టుకొస్తున్నారు. ఇలా ప్రవర్తించిన తన వారసులకు ఓ పెద్దాయన బుద్ధి చెప్పాడు. తనను వదిలేసిన వారసులకు ఆస్తి దక్కకుండా ఉన్నదంతా ప్రభుత్వానికి (Govt) రాసిచ్చేశాడు. తండ్రి చేసిన పనికి ఆయన వారసులు (Descendants) బిక్కమొహం వేశారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.
ముజఫర్ పుర్ (Muzaffarpur)కు చెందిన నాథూ సింగ్ (85) కు ఓ కుమారుడు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. వారందరికీ పెళ్లిళ్లు చేసి మంచి భవిష్యత్ కల్పించారు. కుమారుడు సహరాన్ పుర్ లో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. కొడుకుతో పాటు కుమార్తెలు వేర్వేరు కాపురాలు పెట్టుకుని జీవిస్తున్నారు. కొన్నేళ్ల కిందట అతడి భార్య ఉండడంతో ఇద్దరు కలిసి జీవించారు. ఆమె చనిపోయిన అనంతరం నాథూ సింగ్ ఒంటరిగా మిగిలిపోయాడు. తన ఆలనాపాలనా ఎవరూ పట్టించుకోవడం లేదు. దీంతో అందరూ ఉన్నా అనాథలా మారిపోయాడు. ఇంట్లో ఉండలేక వృద్ధాశ్రమంలో చేరాడు. రక్తం పంచుకున్న వారిపై మనసు విరిగింది.
వారిపై కోపంతో నాథూ సింగ్ కు తనకున్న ఇల్లుతో పాటు స్థలం వారసులకు ఇవ్వొద్దని నిర్ణయించుకున్నాడు. వాటి విలువ దాదాపు కోటిన్నర ఉంటుంది. ఆ ఆస్తినంతా ప్రభుత్వానికి రాసి ఇస్తున్నట్లు వీలునామా రాయించాడు. తాను చనిపోయిన తర్వాత ఆ స్థలంలో ఆస్పత్రి (Hospital), పాఠశాల (School) నిర్మించాలని వీలునామాలో ప్రభుత్వాన్ని కోరాడు. ఈ పరిణామంతో ఆయన వారసులు అవాక్కయ్యారు. అయితే వారి పిల్లలపై ఎంత కోపంగా ఉన్నారంటే తాను చనిపోయిన తర్వాత కనీసం పిల్లలను చూడడానికి కూడా అనుమతివ్వరాదని నాథూ సింగ్ పేర్కొన్నాడు. తనను తాకవద్దని కూడా తెలిపాడు. తాను చనిపోయిన తర్వాత అంత్యక్రియలు చేయొద్దని.. ప్రభుత్వ ఆస్పత్రికి తన మృతదేహాన్ని దానంగా ఇవ్వాలని వీలునామాలో రాయించాడు. వైద్య పరీక్షలకు తన బాడీని వినియోగించుకోవాలని సూచించాడు. ఈ విషయమై నాథూసింగ్ తో మాట్లాడగా.. ‘ఈ వయసులో నేను నా కొడుకు, కోడలితో ఉండాల్సి ఉంది. కానీ వాళ్లు నన్ను చూసుకోవడం లేదు. ఇక వాళ్లకు ఆస్తి ఎలా ఇస్తాను. అందుకే నా యావదాస్తిని ప్రభుత్వానికి ఇవ్వాలని నిర్ణయించుకున్నా’ అని తెలిపాడు. నాథూసింగ్ రాసిచ్చిన పత్రాలు (అఫిడవిట్) అందిందని ముజఫర్ పుర్ సబ్ రిజిస్ట్రార్ తెలిపాడు.