»Heavy Rain Forecast For 5 Days In Telangana 3 Days In Andhra Pradesh Yellow Alert Issued In Telangana
Rain Alert: తెలంగాణ, ఆంధ్రాలకు భారీ వర్ష సూచన..ఎల్లో అలెర్ట్ జారీ!
రెండు తెలుగు రాష్ట్రాలకు భారతవాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. తెలంగాణలో 5 రోజులు, ఆంధ్రప్రదేశ్‌లో 3 రోజులు భారీ వర్షాలు కురుస్తాయి. తెలంగాణలో ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
Rain Alert: తెలంగాణలో(Telangana) రాబోయే 5 రోజులు, ఆంధ్రప్రదేశ్(Andrapradesh)లో 3 రోజులు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ(IMD) అధికారులు వెల్లడించారు. ఉత్తర తమిళనాడు తీరంలో నైరుతి బంగాళాఖాతం మీదుగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపారు. ముఖ్యంగా ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాలు ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. రాబోయే ఐదు రోజులు రాష్ట్రంలోని 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను జారీ చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో బుధ, గురు, శుక్ర వారాల్లో ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, కొన్నిచోట్ల ఉరుములతో కూడిన చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. అలాగే ఒకట్రెండు ప్రాంతాల్లో భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని అధికారులు అన్నారు. ఇక హైదరాబాద్‌లో ఉరుములతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు తెలిపారు.