»Us Investigative Agency Has Identified A Man Who Was Sharing Pornographic Videos Of Children
Hyderabad: చిన్నారుల అశ్లీల వీడియోలను షేర్ చేస్తున్న వ్యక్తిని గుర్తించిన అమెరికా దర్యాప్తు సంస్థ
హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ యువకుడు చిన్నారుల అశ్లీల వీడియోలను తను చూడడమే కాకుండా వేరే వాళ్లకు వాట్సాప్ ద్వారా షేర్ చేస్తున్నాడు. ఈ విషయాన్ని అమెరికన్ దర్యాప్తు సంస్థ హోమ్‌లాండ్ సెక్యూరిటీ ఇన్వెస్టిగేషన్స్ (హెచ్ఎస్ఐ) గుర్తించింది.
Hyderabad: హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ యువకుడు చిన్నారుల అశ్లీల వీడియోలను తను చూడడమే కాకుండా వేరే వాళ్లకు వాట్సాప్ ద్వారా షేర్ చేస్తున్నాడు. ఈ విషయాన్ని అమెరికన్ దర్యాప్తు సంస్థ హోమ్‌లాండ్ సెక్యూరిటీ ఇన్వెస్టిగేషన్స్ (హెచ్ఎస్ఐ) గుర్తించింది. ఈ ఘటనపై రాచకొండ సైబర్ క్రైం పోలీసులకు సమాచారం అందింది. వెంటనే దర్యాప్తు సంస్థల నుంచి అందిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. సదరు యువకుడి వయసు 24. అతడు మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లికి చెందినవాడు. ప్రస్తుతం అతడు హైదరాబాదులోని రామంతాపూర్‌లో నివాసముంటూ ఎంసీఏ మూడో సంవత్సరం చదువుతున్నాడు.
తాను గత రెండేళ్లుగా ఐదు వాట్సప్ గ్రూపుల ద్వారా వస్తున్న చిన్నారుల అశ్లీల వీడియోలను డౌన్లోడ్ చేసి చూసి ఎంజాయ్ చేస్తున్నాడు. తాను అలా చేయడమే కాకుండా వాటిని వేరే గ్రూపుల్లో పోస్టు చేస్తున్నాడు. ఈ తతంగం అంతా అమెరికాలోని హోమ్‌లాండ్ సెక్యూరిటీ ఇన్వెస్టిగేషన్స్ సంస్థ గుర్తించింది. వీడియోలు షేర్ అవుతున్న ఫోన్ నంబర్ గుర్తించి భారత్‌లోని సంబంధిత దర్యాప్తు సంస్థలకు సమాచారం అందించాలని దేశ రాజధాని ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయానికి లేఖ రాసింది. రాయబార కార్యాలయం ఈ విషయాన్ని సీబీఐకి సమాచారం అందజేసింది. వెంటనే సీబీఐ తెలంగాణ సీఐడీకి విషయం చేరవేసింది. ఈ ఫోన్ నంబరు ఆధారంగా ఇన్స్పెక్టర్ బృందంతో దర్యాప్తు చేయించిన సీఐడీ సదరు నిందితుడు రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఉంటున్నట్లు నిర్ధారణకు వచ్చింది. వెంటనే తనపై తదుపరి చర్యలు తీసుకోవాలంటూ రాచకొండ కమిషనర్ డీఎస్ చౌహాన్‌కు సూచించింది. దీంతో సైబర్‌క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తు కొనసాగిస్తున్నారు.