Get married through social media contact. She takes jewelry and money and runs away. Gharana Lady who cheated 8 people like this
Chennai: సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లు తీసి చాటింగ్ తో చీట్ చేసిన ఘరాన మోసాలను ఎన్నో చూశాము. అయితే ఓ యువతి సోషల్ మీడియా వేదికగా అబ్బాయిలను లైన్లో పెట్టి పెళ్లి చేసుకొని, ఉన్నదంతా తీసుకొని పథకం ప్రకారం పారిపోతుంది. ఒకరు ఇద్దరు కాదు ఏకంగా 8 మంది యువకులను బకరా చేసింది ఈ లేడీ. తాజాగా సేలాం జిల్లా పోలీసు స్టేషన్ లో వెలుగు చూసిన ఓ వివాహిత పరారి కేసును విచారణ చేపట్టగా, పోలీసులే విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో ఎనిమిది మందిని వివాహం చేసుకుని నగలు, నగదుతో పారిపోయిన యువతి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
చెన్నై(Chennai), సేలం జిల్లా తారమంగళానికి చెందిన ఫైనాన్షియర్ మూర్తికి ఇన్స్టాగ్రామ్లో రషీద అనే యువతితో పరిచయం ఏర్పడింది. తర్వాత ఇద్దరూ ప్రేమించుకున్నారు. ప్రేమ కాస్త మార్చి 30న పెళ్లిగా మారింది. వివాహం అయిన కొన్నిరోజులకే ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో రషీద ఈ నెల 4న ఇంట్లో ఉన్న రూ.1.5 లక్షల నగదు, 5 సవర్ల బంగారు నగలతో పరార్ అయింది. భర్త మూర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇంకెముంది రషీద గుట్టు రట్టు అయింది. నీలగిరి జిల్లా గూడలూర్కు చెందిన రషీద సామాజిక మాధ్యమాల్లో నకిలీ ఖాతాలు తెరచి డబ్బున్న మగవారితో పరిచయం పెంచుకుంటుందని తెలుసుకున్నారు. తర్వాత వారిని వివాహం చేసుకుంటుందని, కొన్ని రోజుల తర్వాత ఇళ్లలో ఉన్న నగదు, నగలతో పారిపోతుందని గుర్తించారు. ఆమె ఇప్పటివరకు కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎనిమిది వివాహాలు చేసుకున్నట్లు కనిపెట్టారు. పరారీలో ఉన్న ఆమె కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.