»Gold Mining In Andhra Pradesh 18 Lakh Ton Deposits In One Place Chittoor Anantapur
Gold mining: ఆంధ్రాలో గోల్డ్ మైనింగ్..ఒక్క చోటే 18 లక్షల టన్నుల నిక్షేపాలు?
ఆంధ్రప్రదేశ్(Andhra pradesh) రాష్ట్రంలో గోల్డ్ మైనింగ్(gold mining) నిక్షేపాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఒక్క చోటనే 18 లక్షల టన్నుల బంగారు ఖనిజం నిక్షేపాలు ఉన్నాయని సమాచారం. అంతేకాదు ఆంధ్రప్రదేశ్‌లో బంగారం తవ్వకాల కోసం nmdc మొదటి గోల్డ్ బ్లాక్‌లో 61 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టాలని చూస్తున్నట్లు తెలిసింది.
గత కొన్నిరోజులుగా పలు ప్రాంతాల్లో ఖనిజ నిక్షేపాల వెలికితీతకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా జమ్మూకశ్మీర్, రాజస్థాన్ వంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున లిథియం నిల్వలను కనుగొన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఇనుప ఖనిజంతోపాటు పలు అరుదైన ఖనిజాలను వెలికితీస్తున్న ప్రభుత్వ రంగ సంస్థ ఎన్ఎండీసీ(NMDC) లిమిటెడ్ ఏపీ(Andhra pradesh)లో బంగారం(gold) తవ్వకాలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో దాదాపు రూ.500 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో పెద్ద ఎత్తున బంగారం నిల్వలు ఉన్నాయి. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాతో పాటు మరికొన్ని సంస్థలు ఎక్కడెక్కడ ఎంతెంత బంగారం నిల్వలు ఉన్నాయో సర్వే చేసి సమాచారాన్ని సేకరించాయి. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం గుడుపల్లె మండలంలో ఉన్న ‘చిగురుగుంట-బిసనట్టం’ బంగారు గని అందులో ఒకటి. ఈ ఒక్క గనిలోనే 18 లక్షల టన్నుల బంగారు ఖనిజం ఉన్నట్లు అంచనా. ఒక్కో టన్ను ఖనిజం నుంచి దాదాపు 5 గ్రాముల బంగారం మాత్రమే లభిస్తుందని నిర్ధారించారు. ఇప్పుడు ఈ గనిలో ఎన్ఎండిసి తవ్వకాలు ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.
ఈ బంగారు గనిలో మైనింగ్(mining) నిర్వహించేందుకు ఆసక్తిగా ముందుకు వచ్చిన రాష్ట్ర ప్రభుత్వంతో ఎన్ఎండీసీ ఇప్పటికే లెటర్ ఆఫ్ ఇంటెంట్ (LOA)పై సంతకం చేసింది. ఆ తర్వాత మైనింగ్ లీజును రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీసుకోవాలి. ఇంకా అనేక అనుమతులు తీసుకోవడంతోపాటు పర్యావరణ క్లియరెన్స్ పొందాలి. అనుమతి ప్రక్రియను వేగవంతం చేసేందుకు కన్సల్టింగ్ సంస్థను ఎంపిక చేయనున్నట్లు తెలిసింది. దీంతో రెండేళ్లలో ఈ పనులన్నీ పూర్తి చేసి బంగారు(gold) తవ్వకాలు ప్రారంభించాలని ఎన్ఎండీసీ భావిస్తోంది. ఎన్ఎండీసీ(NMDC) కొన్నేళ్లుగా ఛత్తీస్‌గఢ్, కర్ణాటక రాష్ట్రాల్లో ఇనుప ఖనిజాన్ని తవ్వుతోంది. ఇది మధ్యప్రదేశ్‌లోని పన్నాలో వజ్రాల గనిని కూడా నిర్వహిస్తోంది. ఇన్నేళ్లుగా బంగారం తవ్వకాలపై ఆసక్తి చూపలేదు. కానీ ఇప్పుడు అందులోకి కూడా అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. కుప్పం సమీపంలోని కర్ణాటక(karanataka)లోని కోలార్‌లో చాలా ఏళ్లుగా బంగారు గనులు తవ్వుతున్నారు. కర్ణాటక ప్రభుత్వానికి చెందిన హట్టి గోల్డ్ మైన్స్ కంపెనీ లిమిటెడ్ రాయచూర్ సమీపంలో దేశంలోనే అతిపెద్ద బంగారు గనిని నిర్వహిస్తోంది.