దేశ రాజధాని న్యూఢిల్లీలో ఓ స్కూల్ కు బాంబు బెదిరింపు వచ్చింది (Bomb threat to Delhi school). వెంటనే ఆ స్కూల్ ను మొత్తం ఖాళీ చేయించారు (Delhi School Evacuated). స్కూల్ మొత్తం తనిఖీలు నిర్వహించగా ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనిపించలేదు. స్కూల్ కు బాంబు బెదిరింపు రావడం బుధవారం ఉదయం స్థానికంగా కలకలం రేపింది. ఈ సంఘటన సాదిఖ్ నగర్ లోని ది ఇండియన్ పబ్లిక్ స్కూల్ కు జరిగింది (Indian Public School). ఈ రోజు ఉదయం ఈ స్కూల్ కు ఓ ఈ-మెయిల్ వచ్చింది. స్కూల్ ప్రాంగణంలో బాంబులు ఉన్నాయని (Bomb Threat to School), అందులో పేర్కొన్నారు. అప్రమత్తమైన యాజమాన్యం.. వెంటనే విద్యార్థులు, ఉపాధ్యాయులను బయటకు పంపించింది. పోలీసులకు సమాచారం అందించింది. ఘటనాస్థలికి చేరుకున్న బాంబు స్క్వాడ్ తనిఖీలు చేపట్టగా.. ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదు. అయినప్పటికీ ఒకటికి రెండుసార్లు తనిఖీలు నిర్వహించారు. అయినప్పటికీ ఎలాంటి బాంబు దొరకలేదు.
ఈ-మెయిల్ ఎవరు పంపించారు… ఎందుకు పంపించారనే అంశంపై పోలీసులు దర్యాఫ్తును చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సాదిక్ నగర్ లోని ఇండియన్ పబ్లిక్ స్కూల్ ఆవరణలో బాంబు పెట్టినట్లు ఉదయం 10:49 గంటలకు ఒక ఇమెయిల్ వచ్చింది. ముందు జాగ్రత్త చర్యగా పాఠశాలను ఖాళీ చేయించారు. పాఠశాల వెలుపలి నుండి వీడియోలు పెద్ద గుంపును చూపిస్తున్నాయి, ఎక్కువగా విద్యార్థుల తల్లిదండ్రులు, గేట్ వద్ద గుమిగూడారు. తమ పిల్లలను ఇంటికి తీసుకెళ్లమని స్కూల్ నుండి తమకు సందేశం వచ్చిందని విద్యార్థుల తల్లిదండ్రులలో ఒకరు చెప్పారు.
పాఠశాల అడ్మిన్‌కి బాంబు బెదిరింపు రావడం ఇదే మొదటిసారి కాదు. గత సంవత్సరం నవంబర్ నెలలోను, అడ్మిన్‌కు గుర్తు తెలియని వ్యక్తుల నుండి ఇలాంటి ఈ-మెయిల్ వచ్చింది. అది బూటకపు ఈ-మెయిల్. తమ పోలీసు బృందాలు బాంబు డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో సంఘటనా స్థలంలో తనిఖీలు చేస్తున్నాయి అని సీనియర్ పోలీసు అధికారి చందన్ తెలిపారు.