అనుభవలేమితో ఆత్మహత్యలకు (Suicide) పాల్పడుతుంటారు కొందరు. చిన్నపాటి విషయాలకే సున్నితంగా స్పందిస్తూ జీవితానికి ముగింపు పలుకుతున్నారు. కష్టాలు వస్తే ధైర్యంగా ఎలా ఎదుర్కోవాలో చెప్పే వారు లేక తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. విజయవాడ (Vijayawada) క్రీస్తురాజపురానికి చెందిన ఓ బీటెక్ (B Tech) విద్యార్థి తన తల్లిదండ్రులను సంతోషంగా ఉంచలేకపోతున్నానని తన వల్ల ఏ ఉపయోగం లేదనుకుని ప్రాణాలు వదిలాడు.
జమ్ములమూడి జీవన్ (21) నగరంలోని పొట్టి శ్రీరాములు ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతున్నాడు. తల్లిదండ్రులు నాగమణి, సుధాకర్ వీరికి ఇద్దరు సంతానం. కుమార్తె, కుమారుడు. కుమార్తెకు మివాహమైంది. సుధాకర్ వాచ్ మెన్ గా పనిచేస్తున్నాడు. ఇటీవల లోన్ కట్టమని జీవన్ కు 12వేల రూపాయలను తండ్రి ఇచ్చాడు. నగదును వివిధ అవసరాలకోసం జీవన్ ఖర్చు చేశాడు. విషయం తెలుసుకున్న తండ్రి జీవన్ ను మందలించాడు.
మనస్థాపానికి గురైన జీవన్ సోమవారం ఇంటినుంచి వెళ్లిపోయాడు. స్నేహితుడి ఇంట్లోనే పడుకుని మంగళవారం ఇంటికి చేరాడు. సాయంత్రం స్నేహితుడి పుట్టిన రోజు పార్టీ ఉందని బయటకు వెళ్లాడు. ఆ రోజే తన ఇన్ స్టాగ్రామ్ (Instagram) ఖాతాలో బహుశా ఇదే తన చివరి రోజని పోస్టు చేశాడు. ఈ పోస్టుకు అతని ఫ్రెండ్ వెటకారం చేశాడు. ‘సరేలే నీకు సాయంత్రం తెలుస్తుంది. అని సమాధానం పెట్టాడు’. రాత్రి 9 గంటలకు తన తల్లితో మామూలుగానే మాట్లాడాడు. బర్త్ డే పార్టీకి అటెండ్ అయి అక్కడే పడుకున్నాడు. అనుకోకుండా రాత్రి 12 గంటల సమయంలో లేచి ఫ్రెండ్ బైక్ ను తీసుకుని బయటకు వెళ్లాడు.
తెల్లవారుజామున 2 గంటలకు బాటిల్ లో పెట్రోల్ (Petrol) పోయించుకున్నాడు. తండ్రికి ఫోన్ చేశాడు. ఈఎంఐ నగదును సొంతానికి వాడుకుని ఇబ్బంది పెట్టానని బాధపడ్డాడు. తల్లితో కూడా మాట్లాడుతూ.. అమ్మా… నాన్నను సంతోష పెట్టలేక పోతున్నాను. ఎప్పుడూ మిమ్మల్ని నిరాశపరుస్తున్నాను. నాన్నను జాగ్రత్తగా చూసుకో. నన్ను ఇంతకాలం భరించినందుకు కృతజ్ఞతలు. అని ఫోన్ పెట్టేశాడు. తల్లిదండ్రులు కంగారుగా తిరిగి చాలా సార్లు ఫోన్ చేసినా ఎత్తలేదు. పెదపులిపాక వెళ్లి పెట్రోల్ ను పోసుకుని ఆత్మహత్య (Suicide) చేసుకున్నట్లుగా పోలీసులు తెలిపారు. బుధవారం ఉదయం స్థానిక రైతులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్ట్ మార్టంలో సొంతంగా నిప్పంటిచుకుని చనిపోయినట్లుగా తేలింది. సీసీటీవీ ఫుటేజీలో కూడా జీవన్ ఒక్కడే ఆ ప్రాంతానికి వెళ్లినట్లుగా రికార్డ్ అయింది. కుమారుడు చనిపోవడంతో తల్లిదండ్రుల రోధనలు మిన్నంటాయి. చిన్నపాటి కారణాలకే తమ కొడుకు ప్రాణాలు విడిచాడని రోధిస్తున్నారు.