తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu)పై మరో కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించిన పీటీ వారెంట్ దాఖలైంది. విజయవాడ ఏసీబీ కోర్టు (ACB Court)లో టీడీపీ (TDP) అధినేతపై సీఐడీ మరో పీటీ వారెంట్ దాఖలు చేయడం చర్చనీయాంశమైంది. ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబును నిందితుడిగా పేర్కొంటూ పీటీ వారెంట్ జారీ చేసింది.
టీడీపీ ప్రభుత్వ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా టెరాసాఫ్ట్ కంపెనీకి ఫైబర్ నెట్ కాంట్రాక్ట్ (Fiber Net Contract) ఇచ్చారనే ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో రూ.121 కోట్లకు పైగా అవినీతి జరిగిందని సీఐడీ ఆరోపించింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పలువురిని విచారించి కీలక ఆధారాలు సేకరించినట్లుగా తెలిపింది.
2021లో ఫైబర్ నెట్ కుంభకోణం (Fiber Net Scam)పై 19 మందిపై సీఐడీ కేసు నమోదు చేసింది. ఆనాటి ఎఫ్ఐఆర్లో ఏ1గా వేమూరి హరిప్రసాద్, ఏ2గా మాజీ ఎంపీ సాంబశివరావుల పేర్లను నమోదు చేసింది. చంద్రబాబుపై ఇప్పటికే ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు ఉంది. మరోవైపు స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో ఆయనను అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించింది. ఈ నేపథ్యంలో బాబుపై మరో కేసు నమోదవ్వడంతో టీడీపీ నేతలు భగ్గుమంటున్నారు.