»Bomb Threat To Belagavi Express And High Alert In Secunderabad Railway Station
Bomb Alert సికింద్రాబాద్ స్టేషన్ కు బాంబు బెదిరింపు.. ఆ తర్వాత ఆటో డ్రైవర్ ను
‘ఉత్తిగానే చేయలేదు. పోలీస్ స్టేషన్ దగ్గరలో ముగ్గురు వ్యక్తులు మాట్లాడుకుంటున్నారు. రైలు బాంబు (Bomb Threat) ఉందని మాట్లాడుకుంటుంటే నేను విన్నా. ఇదే విషయాన్ని ఫోన్ చేసి చెప్పా. అంతే’ అని వివరణ ఇచ్చాడు.
కొద్ది సేపట్లో రైలు (Train) బయల్దేరాల్సి ఉండగా ఒక ఫోన్ (Phone Call) వచ్చింది. ఆ తర్వాత రైల్వే స్టేషన్ (Railway Station) లో మొత్తం గందరగోళ వాతావరణం ఏర్పడింది. క్షణాల్లో పోలీసులు (Railway Police) వచ్చారు. హడావిడిగా వచ్చేసి తనిఖీలు చేపట్టారు. దీంతో ప్రయాణికులు (Passengers) భయాందోళన చెందారు. తనిఖీలు ముమ్మరం చేశారు.. అనుమానిత వస్తువులను తెరచి చూశారు. డాగ్ స్క్వాడ్ (Dog Squad)లు వచ్చి చూసినా ఏం కనిపించలేదు. దీంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఎందుకు అంతలా తనిఖీలు చేశారంటే ఆ ఫోన్ లో వచ్చింది బాంబు బెదిరింపు. రైలులో బాంబు ఉందని ఫోన్ రావడంతో పోలీసులు తనిఖీలు చేశారు. అయితే అది ఉత్తుత్తి ఫోన్ కాల్ అని తేల్చేయడంతో హమ్మయ్య అనుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ (Secunderabad Railway Station)లో బుధవారం రాత్రి 10.20 గంటలకు బెళగావి (Belagavi)కి వెళ్లాల్సిన రైలు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో రాత్రి 9.30 సమయంలో స్టేషన్ కు ఓ ఫోన్ వచ్చింది. బెళగావి ఎక్స్ ప్రెస్ (07335/36) (Belagavi Express)లో బాంబు (Bomb) ఉందని హెచ్చరించాడు. దీంతో పోలీసులు హుటాహుటిన డాగ్ స్క్వాడ్, బాంబు స్క్వాడ్ (Bomb Squad)తో బృందాలుగా ఏర్పడి రైలును జల్లెడ పట్టారు. అణువణువు తనిఖీ చేశారు. రాత్రి 11.15 గంటల వరకు రైలులో సోదాలు చేశారు. బాంబు ఆనవాళ్లు కనిపించకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం రైలు గంటన్నర ఆలస్యంగా సికింద్రాబాద్ నుంచి బెళగావికి బయల్దేరింది.
అయితే ఆ ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది.. ఎవరు చేశారు అని పోలీసులు ఆరా తీశారు. ఫోన్ చేసింది సంగారెడ్డి జిల్లా (Sangareddy District) దేవరంపల్లి గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ (Auto Driver) బాలరాజు గా గుర్తించారు. ఎందుకు ఉత్తుతి ఫోన్ కాల్ చేశావని బాలరాజును ప్రశ్నించగా.. ‘ఉత్తిగానే చేయలేదు. పోలీస్ స్టేషన్ దగ్గరలో ముగ్గురు వ్యక్తులు మాట్లాడుకుంటున్నారు. రైలు బాంబు (Bomb Threat) ఉందని మాట్లాడుకుంటుంటే నేను విన్నా. ఇదే విషయాన్ని ఫోన్ చేసి చెప్పా. అంతే’ అని వివరణ ఇచ్చాడు. విన్న ప్రకారం పోలీసులను అప్రమత్తం చేసిన బాలరాజుపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవచ్చు. కాకపోతే ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరు? ఏం మాట్లాడుకున్నారనే దానిపై పోలీసులు విచారించే అవకాశం ఉంది. వారిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
కాగా కొందరు ఆకతాయిలు సరదా కోసం తప్పుడు ఫోన్ కాల్స్ చేసి ఇబ్బందులకు గురి చేస్తుంటారు. గతంలో ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి. బాంబు ఉందంటూ బెదిరింపు కాల్ చేసి బస్సులు, రైళ్లను చివరికి విమానాలను కొద్దిసేపు ఆపేలా ప్రయత్నిస్తారు. ఆ సమయంలో ప్రయాణికులు ఎంత కంగారు పడతారో వారికి తెలియదు. పోలీసులు ప్రజల ప్రాణాలు కాపాడేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తారు. తప్పుడు ఫోన్ కాల్స్ తో ప్రయాణికుల సమయం, పోలీసుల శ్రమ వృథా అవుతుంది. వాస్తవం ఉంటేనే ఫోన్ కాల్స్ చేయాలని పోలీసులు సూచిస్తున్నారు.