»Osmania Hospital Doctors Conducted Bariatric Surgery Successful
Osmania Hospital: ప్రభుత్వ ఆస్పత్రిలో అంబానీ కొడుకు మాదిరి వైద్యం
అత్యాధునిక సౌకర్యాలతో పాటు కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు అందుతున్నాయి. దీంతో ప్రజలు ప్రభుత్వ ఆస్పత్రుల బాట పడుతున్నారు. అరుదైన వ్యాధులకు చికిత్సలు అందిస్తూ సర్కార్ దవాఖానాలు సత్తా చాటుతున్నాయి. అరుదైన గుర్తింపును పొందుతున్నాయి. తాజాగా ఉస్మానియా ఆస్పత్రి (Osmania General Hospital-OGH) మరో ఘనతను సాధించింది. ప్రపంచ కుబేరుడు ముకేశ్ అంబానీ (Mukesh Ambani) కుమారుడు అనంత్ అంబానీ (Anant Ambani)కి విదేశాల్లో అందించిన వైద్యం మాదిరి ఉస్మానియా దవాఖానా అందించింది.
తెలంగాణలో ప్రభుత్వ దవాఖానాల (Telangana Govt Hospitals) పరిస్థితులు మారుతున్నాయి. ఒకప్పుడు అరకొర వసతులు, వైద్యుల నిర్లక్ష్యంతో ఆస్ప్రతులకు ప్రజలు వెళ్లేందుకు భయపడేవారు. కానీ పరిస్థితుల్లో మార్పు వచ్చింది. అత్యాధునిక సౌకర్యాలతో పాటు కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు అందుతున్నాయి. దీంతో ప్రజలు ప్రభుత్వ ఆస్పత్రుల బాట పడుతున్నారు. అరుదైన వ్యాధులకు చికిత్సలు అందిస్తూ సర్కార్ దవాఖానాలు సత్తా చాటుతున్నాయి. అరుదైన గుర్తింపును పొందుతున్నాయి. తాజాగా ఉస్మానియా ఆస్పత్రి (Osmania General Hospital-OGH) మరో ఘనతను సాధించింది. ప్రపంచ కుబేరుడు ముకేశ్ అంబానీ (Mukesh Ambani) కుమారుడు అనంత్ అంబానీ (Anant Ambani)కి విదేశాల్లో అందించిన వైద్యం మాదిరి ఉస్మానియా దవాఖానా అందించింది. దీంతో ఓ యువకుడు 240 కిలోల బరువు నుంచి అమాంతం దాదాపు 70 కిలోల బరువుకు తగ్గాడు. ఈ అరుదైన వైద్యంపై ఆస్పత్రి అధికారులు వివరించారు.
హైదరాబాద్ (Hyderabad)లోని గుడిమల్కాపూర్ ప్రాంతానికి చెందిన మునీందర్ (24) (Muneendar) చిన్నతనం నుంచి ఊబకాయం (Obesity)తో బాధపడుతున్నాడు. వయసుతో పాటు అతడి బరువు పెరుగుతూ వస్తున్నాడు. ఏకంగా 240 కిలోల బరువుకు చేరుకోవడంతో నడవడం కూడా కష్టంగా మారింది. తల్లిదండ్రులు ప్రైవేటు ఆస్పత్రలకు వెళ్లగా చికిత్స కోసం రూ.15 లక్షల దాక ఖర్చవుతుందని చెప్పారు. అంత స్థోమత లేకపోవడంతో ఉస్మానియా ఆస్పత్రిని సంప్రదించారు. వైద్యులు అతడికి చికిత్స అందిస్తామని చెప్పడంతో ఆ తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. మునీందర్ పరిస్థితిని గమనించిన వైద్యులు ఒక బృందంగా ఏర్పడ్డారు. సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, ఎండోక్రైనాలజీ, అనస్థీషియ విభాగాలకు చెందిన దాదాపు 15 మంది వైద్యులు బృందంగా ఏర్పడి బేరియాట్రిక్ సర్జరీ (Bariatric Surgery) చేయాలని నిర్ణయించారు. ఈ సర్జరీలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో చేయడం చాలా తక్కువ. ఈ సర్జరీ చేసి ఏకంగా 70 కిలోల బరువును తగ్గించారు. ప్రస్తుతం ఆ యువకుడు 170 కిలోలకు చేరాడు. త్వరలోనే 80-90 కిలోలు తగ్గి సాధారణ బరువుకు చేరుకుంటాడు అని వైద్యులు తెలిపారు.
చికిత్స ఇలా..
మునీందర్ బరువు తగ్గించడంపై వైద్యులు పరిశోధనలు చేశారు. అనంతరం బేరియాట్రిక్ సర్జరీ చేయాలని నిర్ణయించారు. గ్యాస్ట్రిక్ బైపాస్ ద్వారా పొట్ట పరిమాణం తగ్గించడంతోపాటు ఎక్కువ ఆహారం తీసుకోకుండా నియంత్రించారు. దీనికి ఆహారం స్వీకరించే చిన్నపేగును కొంతమేరకు తగ్గించారు. రెండు నెలల కిందట ఈ సర్జరీని విజయవంతంగా పూర్తి చేశారు. మొత్తం పూర్తి వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు. ఆహార పరిమాణం గణనీయంగా తగ్గడంతో మునీందర్ బరువు తగ్గడం మొదలైంది.
సర్జరీకి అష్టకష్టాలు
ఆ యువకుడి పరిస్థితిని చూసి చలించిన వైద్యులు మానవీయ కోణంలో స్పందించారు. అధిక బరువుతో మునీందర్ మోకాళ్లపై భారం పడడం, మధుమేహం, అధిక రక్తపోటు, ఇతర శారీరక, మానసిక రుగ్మతలతో బాధపడుతున్నాడు. వీటన్నిటిని చూసిన వైద్యులు అతడికి ఎలాగైనా వైద్యం అందించి సాధారణ రూపానికి తీసుకురావాలని భావించారు. కాగా 240 కిలోల బరువు ఉండడంతో చికిత్స అందించేందుకు తిప్పలు పడాల్సి వచ్చింది. ఆపరేషన్ బల్లపై పడుకోబెట్టడం కష్టంగా మారింది. శరీరానికి రెండువైపులా అదనపు బల్లలు ఏర్పాటు చేసి అతి కష్టం మీద సర్జరీ పూర్తి చేశారు. వారి కష్టానికి ప్రతిఫలం ఆ యువకుడు 70 కిలోల బరువు తగ్గాడు. త్వరలోనే మరింత బరువు తగ్గనున్నాడు. అరుదైన సర్జరీ చేసి యువకుడికి సాధారణ జీవితం కల్పిస్తున్న వైద్యులకు మునీందర్ తల్లిదండ్రులు ధన్యవాదాలు చెప్పారు. వైద్యుల సేవలపై తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు హర్షం వ్యక్తం చేశారు. వైద్య బృందాన్ని అభినందించారు.