Obesity : బరువు వేగంగా పెరుగుతున్నారా? ఈ తప్పులు చేస్తున్నారేమో?
బరువు ఎక్కువగా పెరుగుతున్నారనిపిస్తే రోజు వారీ జీవితంలో కొన్ని తప్పులు చేస్తున్నారేమో గమనించుకోండి. లేదంటే అధిక బరువు వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు ఎన్నో.
Causes Of Obesity : ఇటీవల కాలంలో చిన్న పిల్లలు, పెద్ద వారు అనే తేడా లేకుండా చాలా మంది లావుగా అయిపోతున్నారు. ఊబకాయంతో బాధ పడుతున్నారు. అంత పరిస్థితి తెచ్చుకోకుండా బరువు వేగంగా పెరుగుతున్నాం అని తెలుసుకున్నప్పుడే జాగ్రత్తలు తీసుకోవడం మంచింది. మనం రోజు వారీ కొన్ని తప్పులు చేస్తున్నామేమో తెలుసుకుని గమనించుకోవాలి. ఒక వేళ తప్పులు చేస్తుంటే సరిదిద్దుకోవాలి. అప్పుడే బరువు పెరగడాన్ని(weight gain) అరికట్టుకోగలుగుతాం.
కొందరు నిద్రకు సరైన ప్రాధాన్యత ఇవ్వకుండా ఫోన్లు చూస్తూ రాత్రిళ్లు గడిపేస్తుంటారు. రోజూ ఇదే పని చేస్తుంటే హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. దీని వల్ల నిద్రలేమి సమస్యతో పాటు బరువు పెరిగే ప్రమాదమూ పెరుగుతుంది. అలాగే ఎక్కువ క్యాలరీలు ఉన్న ఆహారం తీసుకుంటూ తక్కువ పని చేయడం వల్లా బరువు పెరగొచ్చు. రోజూ వ్యాయామాన్ని తప్పకుండా చేయాలి. నడక, పరుగు, సైకిలింగ్ లాంటి వ్యాయామాల్ని చేస్తూ ఉండాలి.
కొంత మంది సరళ పిండి పదార్థాలు ఉండే పిజాలు, బర్గర్లు, చిప్స్ లాంటి వాటిని ఎక్కువగా తినేస్తూ ఉంటారు. ఇలాంటి జంక్ ఫుడ్‌ని రోజూ తింటూ ఉంటే బరువు వేగంగా పెరుగుతాం. అలాగే తీపి పదార్థాలను అధికంగా తినడం వల్లా ఊబకాయం(OBESITY) ప్రమాదం ఎక్కువ అవుతుంది. శీతల పానియాలను తరచుగా తాగుతూ ఉండటమూ ప్రమాదమే. తినే పదార్థాల్లో ఫ్యాట్, ఉప్పు, క్యాలరీలు లాంటి వాటిని దృష్టిలో పెట్టుకోవాలి. అలా కాకుండా తినే పదార్థంపై ఏ అవగాహనా లేకుండా అతిగా తింటూ ఉంటే సమస్యలు తప్పవని గుర్తుంచుకోవాలి. దీనితో పాటు మద్యం తాగడం వల్లా బరువు పెరుగుతారు. రోజువారీ జీవితంలో ఈ తప్పులు చేస్తున్నారేమో గమనించుకుని వీటిని తగ్గించుకోవడం మంచింది.