సిట్టింగ్ ఎమ్మెల్యే, 30 సంవత్సరాలు ప్రజా సేవలో ఉన్న వ్యక్తిని గౌరవించుకోలేని దౌర్భాగ్యం పట్టిందని సాయన్న అనుచరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ దళితులపై చిన్నచూపు చూస్తున్నాడని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. దళిత సీఎం మాట తప్పినప్పటి నుంచే దళితులపై కేసీఆర్ కు ప్రేమ లేదని రుజువైందని చెప్పారు. రాజకీయాలు పక్కనపెడితే సాయన్న వ్యవహారంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు అందరిలో అసంతృప్తి రేపుతున్నది.
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ (Hyderabad)లో ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే సాయన్న (Sayanna) అనారోగ్యంతో కన్నుమూశాడు. బీఆర్ఎస్ పార్టీ (BRS Party) కంటోన్మెంట్ (Cantonment) ఎమ్మెల్యే (MLA)గా ఉన్న సాయన్న మృతి చెందడంతో హైదరాబాద్ లో విషాదం అలుముకుంది. సికింద్రాబాద్, కంటోన్మెంట్ ప్రజలు ఆయన మృతిని జీర్ణించుకోలేకపోతున్నారు. దీనికి తోడు ప్రభుత్వం వ్యవహరించిన తీరుతో అక్కడి ప్రజలు, సాయన్న అనుచరులు, అభిమానులు కలత చెందారు. పదవిలో ఉండగానే మరణించిన వ్యక్తికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు (Funerals) నిర్వహించకపోవడం తీవ్ర దుమారం రేపుతున్నది. ఐదు సార్లు ఎమ్మెల్యేగా పని చేసిన వ్యక్తికి ఇచ్చే గౌరవం ఇదా? అని ప్రశ్నిస్తున్నారు. సినీ ప్రముఖులు, మాజీ ప్రజాప్రతినిధులకు గౌరవం ఇస్తారు.. కానీ దళితుడైనందుకు సాయన్నపై వివక్ష చూపుతారా అని నిలదీస్తున్నారు. అంత్యక్రియల వ్యవహారం రాజకీయంగా వివాదాస్పదమైంది.
కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న ఈనెల 19న ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. 30 ఏండ్ల పాటు ప్రజా సేవలో మునిగిన వ్యక్తి. ఎమ్మెల్యేగా ఉండగానే చనిపోయారు. ఆ వ్యక్తికి సీఎం కేసీఆర్ తో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు నివాళులర్పించారు. తరువాతి రోజు 20న మారేడుపల్లిలోని శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. అంతిమయాత్రలో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. తీరా శ్మశానవాటికకు రాగా సాధారణంగా అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. దీనిపై సాయన్న అనుచరులు, అభిమానులు ఆందోళన చేశారు. ఎమ్మెల్యే చనిపోతే అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు చేయరా అని నిరసన తెలిపారు. కొద్దిసేపు అంత్యక్రియల ప్రక్రియ ఆగిపోయింది. శ్మశాన వాటికలోనే ధర్నా చేయడం ఎక్కడా చూసీ ఉండరు. ఈ సందర్భంగా మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డిని నిలదీశారు. సముదాయించే ప్రయత్నం చేసినా వాళ్లు వెనక్కి తగ్గకపోవడంతో మంత్రులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. హరికృష్ణ, కృష్ణ తదితరులకు మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఎమ్మెల్యేలుగా ఉండి మరణించిన నోముల నర్సింహులు, సోలిపేట రామలింగారెడ్డి మరణిస్తే అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు చేశారు. మరి సాయన్న సిట్టింగ్ ఎమ్మెల్యేగా మరణిస్తే అధికార లాంఛనాలు ఏవీ అని ప్రశ్నించారు. దాదాపు మూడు గంటలు అంత్యక్రియలు ఆగిపోయాయి.
ప్రభుత్వ తీరుపై ఆగ్రహం
సమయం మించిపోతుండడంతో డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సాయన్న కుటుంబసభ్యులతో మాట్లాడారు. ఆందోళనకారులను సముదాయించే ప్రయత్నం చేశారు. అధికార లాంఛనాలు చేయకపోవడానికి కారణాలు వివరించారు. అయినా కూడా ఆందోళనకారులు వినకపోవడంతో బలవంతంగా సాయన్న అంత్యక్రియలు ముగించారు. సాయన్న మృతిపై ప్రభుత్వం వ్యవహరించిన తీరు తీవ్ర వివాదాస్పదమైంది. దళితుడు అయినందుకే ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యే, 30 సంవత్సరాలు ప్రజా సేవలో ఉన్న వ్యక్తిని గౌరవించుకోలేని దౌర్భాగ్యం పట్టిందని సాయన్న అనుచరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ దళితులపై చిన్నచూపు చూస్తున్నాడని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. దళిత సీఎం మాట తప్పినప్పటి నుంచే దళితులపై కేసీఆర్ కు ప్రేమ లేదని రుజువైందని చెప్పారు. రాజకీయాలు పక్కనపెడితే సాయన్న వ్యవహారంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు అందరిలో అసంతృప్తి రేపుతున్నది.