సిఆర్పిఎఫ్ (CRPF) కానిస్టేబుల్ వెపన్ చోరీ సంఘటన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కలకలం సృష్టించింది. ఫిర్యాదు అందుకున్న ఆర్పిఎఫ్, జిఆర్పి పోలీసులు గంటల వ్యవధిలో నిందితుడిని అరెస్టు చేసి వెపన్, రౌండ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. అతనో చిల్లర దొంగ..సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో సంచరిస్తూ పర్సులు..ఇతర వస్తువులు దొంగిలించడం అలవాటు. అదే పనిలో ఉన్న దొంగకి కానిస్టేబుల్ వద్ద సంచి కన్పించడంతో కొట్టేశాడు. తీరా అందులో ఉన్నది వెపన్స్‌ని తెలుసుకుని ఓ చోట పడేసి పారిపోయాడు. కానీ అతను చేసిన పనికి పోలీసులు రోజంతా నానా తంటాలు పడ్డారు.ఎట్టకేలకు ఆయుధాల సంచిని స్వాధీనపరుచుకుని ఊపిరిపీల్చుకున్నారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కేంద్రంగా ఈ ఉదంతం జరిగింది..హైదరాబాద్ చాంద్రాయణగుట్ట (Chandrayanagutta) లోని సీఆర్పీఎఫ్ 95వ బెటాలియన్‌కు చెందిన నలుగురు కానిస్టేబుళ్లు విధి నిర్వహణలో భాగంగా యూపీలోని బెనారస్ వెళ్లే నిమిత్తం ఈ నెల 24న ఉదయం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు వెళ్లారు.
దానాపూర్ ఎక్స్‌ప్రెస్ (Danapur Express) ఎక్కేందుకు పదో ప్లాట్‌ఫాంపై వేచి ఉన్నారు. ఈ క్రమంలో కానిస్టేబుల్ సిద్ధార్థ్సింగ్కు చెందిన సంచి(బ్యాక్‌పాక్) అపహరణకు గురైంది. దీంతో ఆయన సికింద్రాబాద్ జీఆర్పీకి ఫిర్యాదు చేశారు.చోరీకి గురయిన మందు గుండు సామగ్రిని సికింద్రాబాద్ రైల్వే పోలీసులు రికవరీ చేసి.. దొంగిలించిన వ్యక్తిని అరెస్టు చేశారు. రైల్వే ఇన్స్పెక్టర్ శ్రీను తెలిపిన ప్రకారం.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ (Secunderabad Railway Station) ప్లాట్ఫారం నంబరు 10 వద్ద పెట్టిన 60 ఇన్సాస్రౌండ్స్, మూడు మ్యాగజీన్లు, వాటి పర్సు ఉన్న బ్యాక్‌ప్యాక్ బ్యాగ్ చోరీకి గురైనట్లుగా చాంద్రాయణగుట్ట జీడీ ఫోర్స్ సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్సిద్ధార్ధ్ సింగ్ రైల్వే పోలీసులకు కంప్లైంట్ చేశారు. జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు 8 టీమ్‌లుగా ఏర్పడి రైల్వే స్టేషన్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో సీసీ ఫుటేజ్‌ను పరిశీలించారు. ఓ వ్యక్తి బ్యాగ్‌తో వెళ్లడాన్ని సీసీ ఫుటేజ్‌లో గుర్తించి వెంటనే గాలింపు చేపట్టారు. వెపన్స్ బ్యాగ్(Weapons bag)ను దొంగిలించిన వ్యక్తిని గాంధీనగర్ (Gandhinagar) మెట్రో స్టేషన్ ప్రాంతంలో పట్టుకుని విచారించారు.అతడు
ఏపీలోని శ్రీకాకుళం (Srikakulam) జిల్లా రాజం గ్రామానికి చెందిన నక్కేని ఆనందమూర్తి గా గుర్తించారు. సిటీకి వచ్చిన ఆనందమూర్తి కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడని, డబ్బుల కోసం చోరీకి పాల్పడినట్లు అంగీకరించాడు. బ్యాగ్‌ను గాంధీనగర్ మెట్రో స్టేషన్ వద్ద వదిలిపెట్టినట్లు తెలిపాడు. పోలీసులు (Police) అక్కడకు వెళ్లగా.. బ్యాగు కనిపించకపోవడంతో మళ్లీ సీసీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలించారు. ఎరుపు రంగు దుస్తులు ధరించిన 65 ఏళ్ల వృద్ధుడు ఉదయం వాక్కు వెళ్లిన సమయంలో రోడ్డు పక్కన పడి ఉన్న బ్యాగ్‌ను తీసుకువెళ్లినట్లు గుర్తించారు. అతని ఆచూకీ తెలుసుకుని భోలక్‌పూర్(Bholakpur)లోని ఇంటికి వెళ్లిన పోలీసులు విచారించారు. రాచమల్ల సత్యనారాయణ(65)గా గుర్తించారు. రోజు మాదిరిగానే మార్నింగ్ వాక్కు వెళ్లగా రోడ్డు పక్కన ఉన్న బ్యాగ్‌ను తీసుకువెళ్లినట్లు పోలీసులకు చెప్పారు. అతని వద్ద ఉన్న 60 ఇన్సాన్రౌండ్స్, మూడు మ్యాగజీన్లతో పాటు మందుగుండు సామగ్రిని రికవరీ చేశారు. నిందితులను అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ శ్రీను తెలిపారు.