KA Paul: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాన పార్టీ అధినేతలు బిజీగా ఉన్నారు. ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ (KA Paul) కూడా రంగంలోకి దిగారు. తమ పార్టీ తరఫున అభ్యర్థులు బరిలోకి దిగుతారని.. తాను సికింద్రాబాద్ నుంచి పోటీ చేస్తానని అంటున్నారు. అధికార బీఆర్ఎస్ పార్టీపై తనదైన శైలిలో విమర్శలు చేశారు. ఆ పార్టీ మేనిఫెస్టో మసిపూసి మారేడు కాయ చేసినట్టు ఉందన్నారు. ఇటు టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కూడా వదల్లేదు.
రూ.10 వేలు చాలు..
కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థుల నుంచి టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి భారీగా డబ్బులు అడుగుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ అంశంపై కేఏ పాల్ (KA Paul) మాట్లాడారు. రేవంత్ రెడ్డి రూ.10 కోట్ల నుంచి రూ.50 కోట్ల వరకు వసూల్ చేస్తుందని మండిపడ్డారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు కోట్లు ఖర్చు పెట్టలా అని అడిగారు. తమ పార్టీ తరఫున బరిలోకి దిగే వారు కేవలం రూ.10 వేలు మాత్రం ట్రాన్స్ ఫర్ చేయాలని.. దాంతోపాటు అభ్యర్థి రెజ్యుమో పంపించాలని సూచించారు. సదరు అభ్యర్థితో కోర్ కమిటీ కలిసి డిస్కష్ చేస్తోందని వివరించారు. కార్యాలయానికి వచ్చి సంప్రదించిన ఫర్లేదని సూచించారు.
స్వర్గసీమగా సికింద్రాబాద్
ప్రజాశాంతి పార్టీకి ఎన్నికల సంఘం గుర్తింపు ఇచ్చిన తర్వాత తాను పోటీ చేసే స్థానాన్ని అధికారికంగా ప్రకటిస్తానని తెలిపారు. ఒకవేళ సికింద్రాబాద్ నుంచి పోటీ చేస్తే గెలిపించాలని.. నియోజకవర్గాన్ని స్వర్గసీమ చేస్తానని అంటున్నారు. విదేశాల నుంచి నిధులు తీసుకొస్తానని చెబుతున్నారు. 200 దేశాల్లోని వారు ఇక్కడికి వచ్చి చూసేలా చేస్తానని హామీనిచ్చారు. స్థానిక అభ్యర్థి పద్మారావు ఏం చేశారని ప్రశ్నించారు.
ఇప్పుడు పెంచుతారా..?
అర్హత ఉన్నవారికి పెన్షన్ ఇవ్వలేదని కేఏ పాల్ మండిపడ్డారు. ఇప్పుడు మాత్రం పెంచుతామని కబుర్లు చెబుతున్నారని ఫైరయ్యారు. ప్రజాశాంతి పార్టీ మేనిఫెస్టోను బీఆర్ఎస్ కాపీ కొట్టిందని హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు చోట్ల తమ పార్టీ అధికారంలోకి వస్తోందని మరోసారి స్పష్టంచేశారు.