»Former Cm Bs Yediyurappa Delivers His Farewell Speech In Assembly
Farewell Speech ఇదే నా చివరి ప్రసంగం.. రాజకీయాలకు మాజీ సీఎం గుడ్ బై
రెండు నెలల్లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. ప్రస్తుతం బీజేపీకి వ్యతిరేక గాలులు వస్తున్నాయి. ఆ పార్టీ గట్టెక్కడం కష్టంగా ఉందని సమాచారం. ముఖ్యమంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న యడియూరప్పకు మళ్లీ అవకాశం దక్కడం అసాధ్యమే. ఆ పదవి ఇవ్వకుంటే ఇక ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటే తనకు గౌరవం ఉండదని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యాడు.
భారతదేశం (India)లోని ప్రధాన రాష్ట్రానికి నాలుగు సార్లు ముఖ్యమంత్రి (Chief Minister).. బీజేపీ (BJP)లో సీనియర్ నాయకుడు. ఆ రాష్ట్రంలో ఆయనకు తిరుగులేదు. రాజకీయ కురు వృద్ధుడు. ప్రస్తుతం 79 ఏళ్ల వయసు. ఇంకా రాజకీయాలు చేసే శక్తి ఉంది. రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే సామర్థ్యం ఉంది. కానీ పార్టీలో వైఖరి ఆయనకు నచ్చడం లేదు. దీంతోపాటు తన రాజకీయ వారసత్వం కుమారుడికి ఇచ్చేందుకు ఆయన రాజకీయ సన్యాసం (Political Retirement) ప్రకటించారు. ఇక ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించాడు. చట్టసభలో ఇదే నా చివరి ప్రసంగమని ప్రకటించి ప్రత్యక్ష రాజకీయాలకు ముగింపు పలికాడు. ఆయనే కర్ణాటక (Karnataka) మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప (BS Yediyurappa). ఆయన ప్రసంగంతో శాసనసభలో భావోద్వేగ వాతావరణం ఏర్పడింది.
కర్ణాటకలో బడ్జెట్ సమావేశాలు (Budget Session) జరుగుతున్నాయి. బడ్జెట్ పై జరుగుతున్న చర్చలో యడియూరప్ప తన రాజకీయ జీవితంపై ప్రసంగించారు. ‘దేవుడు నాకు శక్తిని ఇస్తే బీజేపీని గెలిపించేందుకు శాయశక్తులన్నీ ధారపోస్తా. నేను ఎన్నిక (Assembly Elections)ల్లో పోటీ చేయడం లేదని చెప్పిన విషయం మీకు తెలుసు.దేశంలో ఏ నేతకు దక్కని గౌరవాన్ని నరేంద్ర మోదీ (Narendra Modi) నాకు ఇచ్చారు. దానికి ధన్యవాదాలు. ప్రత్యక్ష రాజకీయాల్లో లేకున్నా బీజేపీ విజయానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తా. బీజేపీ వాళ్లు కూడా పూర్తి విశ్వాసంతో ఉంటే స్పష్టమైన మెజారిటీతో అధికారం (Power)లోకి తీసుకువద్దాం. ఈ సమావేశాల అనంతరం అసెంబ్లీ (Assembly)కి రావడం కానీ, మాట్లాడడం కానీ ఉండదు. ఇది నాకు వీడ్కోలు లాంటిది’ అని యడియూరప్ప పేర్కొన్నారు.
అయితే యడియూరప్ప ప్రసంగంపై విపక్ష పార్టీల సభ్యులు స్పందిస్తూ మీరు మళ్లీ సభకు రావాలని కోరారు. ‘ఢిల్లీ నేతల మాట విని పోటీ నుంచి విరమించుకోవద్దు. మీలాంటి అనుభవం కలిగిన వ్యక్తుల అవసరం రాష్ట్రానికి అవసరం’ అని యడియూరప్పకు విపక్ష సభ్యులు విన్నవించారు. యడియూరప్ప శివమొగ్గ జిల్లాకు చెందిన వ్యక్తి. శికారిపుర నియోజకవర్గం 1983 నుంచి వరుసగా పోటీ చేస్తూ ఏకంగా ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా పని చేశారు. ఒకసారి డిప్యూటీ ముఖ్యమంత్రిగా, ఒక పర్యాయం లోక్ సభ సభ్యుడిగా యడియూరప్ప పని చేశారు.
కాగా యడియూరప్ప రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించడం వెనుక చాలా కారణాలు ఉన్నాయని తెలుస్తున్నది. ప్రస్తుతం ఆయన పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తన వర్గానికి ప్రాధాన్యం దక్కడం లేదు. ఇక కుమారుడికి రాజకీయ వారసత్వం అప్పగించడం కూడా ఒక కారణం. ముఖ్యమంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న యడియూరప్పకు మళ్లీ అవకాశం దక్కడం అసాధ్యమే. ఆ పదవి ఇవ్వకుంటే ఇక ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటే తనకు గౌరవం ఉండదని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యాడు. దీనికి తోడు ఢిల్లీ పెద్దల ఆదేశం కూడా అదేనని సమాచారం. రెండు నెలల్లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. ప్రస్తుతం బీజేపీకి వ్యతిరేక గాలులు వస్తున్నాయి. ఆ పార్టీ గట్టెక్కడం కష్టంగా ఉందని సమాచారం.