తెలంగాణలో ప్రతి ఒక్క నిరుద్యోగికి లక్ష రూపాయల నిరుద్యోగ భృతి ఇవ్వాలని బీజేపీ(BJP) తెలంగాణ అధ్యక్షులు బండి సంజయ్(Bandi Sanjay) డిమాండ్ చేశారు. మరోవైపు TSPSC లికేజీ కేసును సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తప్పు చేయకుంటే ఎందుకు విచారణ జరిపించడం లేదని సంజయ్ ప్రభుత్వాన్ని నిలదీశారు. లేదంటే ట్విట్టర్ టిల్లు ఈ కేసుకు బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని సవాల్ చేశారు.
తెలంగాణలో బీఆర్ఎస్(BRS) ప్రభుత్వం నిర్లక్ష్యం, చేతగాని తనం వల్ల ప్రస్తుతం లక్షల మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ(BJP) తెలంగాణ అధ్యక్షులు బండి సంజయ్ అన్నారు. TSPSC లికేజీ కేసు(TSPSC leakage case)లో ఇప్పటివరకు 13 మంది అరెస్టు అయ్యారని గుర్తు చేశారు. కానీ ట్విట్టర్ టిల్లు మాత్రం ఈ కేసుతో ఇద్దరికే సంబంధం ఉందని చెప్పారని పేర్కొన్నారు. దీనిపై కేటీఆర్(KTR) సమాధానం చెప్పాలని…లేదంటే బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని స్పష్టం చేశారు. మరోవైపు ఈ కేసును సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బండి సంజయ్(Bandi Sanjay) అన్నారు. ఈ ఘటనపై సమగ్రంగా దర్యాప్తు చేయించాలని కోరారు. తప్పు చేయకపోతే ఎందుకు విచారణ జరపించడం లేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం దొంగలకు సపోర్టుగా ఉంటూ..ప్రతి పక్ష నేతలకు నోటీసులు పంపిస్తుందని ఎద్దేవా చేశారు. హైదరాబాద్(hyderabad) ఇందిరా పార్క్(indira park) వద్ద నిర్వహించిన బీజేపీ నిరుద్యోగ మహాధర్నా(BJP Maha Dharna) కార్యక్రమంలో భాగంగా సంజయ్ ప్రసంగించారు.
ఇలాంటి క్రమంలో ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క నిరుద్యోగికి లక్ష రూపాయల నిరుద్యోగ భృతి ఇవ్వాలని బండి సంజయ్ డిమాండ్(Bandi Sanjay)చేశారు. లక్షలాది మంది యువకులు కష్టపడి అనేక రోజులు చదువుకుంటే వారి కష్టాన్ని వృథా చేశారని తెలిపారు. వారి డబ్బును సమయాన్ని తిరిగి తెస్తారా అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. పేద ప్రజలు, నిరుద్యోగుల ఆశలను ప్రభుత్వ నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. ఈ క్రమంలో నిరుద్యోగులు సహా తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవడమే లక్ష్యంగా బీజేపీ(BJP) ముందుకు వెళుతున్నట్లు చెప్పారు. భయపడే పార్టీ బీజేపీ కాదని, దేశం కోసం, పేద ప్రజల కోసం మద్దతుగా నిలిచే పార్టీ తమదని సంజయ్ వెల్లడించారు.
తెలంగాణలో యువత అందరూ ఒక్కటైతే ఎలా ఉంటుందో చూపిస్తామని సంజయ్ అన్నారు. ఈ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా బీజేపీ యుద్ధాన్ని ప్రకటించినట్లు చెప్పారు. మరోవైపు కేసీఆర్ కుటుంబం అహాంకారాన్ని ప్రజలు గమనిస్తున్నారని సంజయ్ గుర్తు చేశారు. అనేక మందిపై కేటీఆర్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని తెలిపారు. అబద్దాలు అపాదిస్తున్నారని అన్నారు.