అధికారంలోకి వచ్చిన నాలుగేళ్ల తర్వాత ఉపాధ్యాయల (Teachers Recruitment) పోస్టుల భర్తీపై ఏపీ ప్రభుత్వం దృష్టి సారించింది. త్వరలోనే డీఎస్సీ (DSC Notification) ప్రకటన విడుదల చేస్తామని ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) ప్రకటించారు. వీలైనంత త్వరలోనే సీఎం జగన్ (YS Jagan) విధానపరమైన నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. ఇక రాజధాని (Capital) విషయంపై స్పందించారు. రాజధానికి కాపురానికి అసలు సంబంధం లేదని కొట్టిపారేశారు. ప్రతిపక్షాలు చేస్తున్న పలు విమర్శలకు సమాధానాలు ఇచ్చారు.
విజయవాడలో (Vijayawada) శుక్రవారం నిర్వహించిన ఓ సమావేశంలో బొత్స మాట్లాడారు. ‘ఉపాధ్యాయులు, ఉద్యోగుల బదిలీలపై సమీక్షించాం. త్వరలో బదిలీలపై నిర్ణయం తీసుకుంటాం. బదిలీ విషయంలో (Transfers) పారదర్శకమైన విధానాన్ని మేం తీసుకువస్తాం. దీనికోసం ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలను కూడా పరిశీలిస్తున్నాం’ అని బొత్స తెలిపారు. ఇక రాజధాని విషయంపై కూడా ఆయన స్పందించారు. రాజధాని విశాఖలో (Visakhapatnam) సీఎం జగన్ కాపురం పెడతానని చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు తీవ్రంగా తప్పుబట్టిన విషయం తెలిసిందే. వాటిపై బొత్స స్పందిస్తూ.. ‘విశాఖపట్టణం పరిపాలన రాజధాని అనేది మా విధానం. అమరావతి రాజధాని అయితే చంద్రబాబు కాపురం హైదరాబాద్ లో ఎందుకు పెట్టారు. కాపురానికి రాజధానికి సంబంధం ఏమిటి’ అని ఎదురు ప్రశ్నించారు.
ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ (Vizag Steel Plant) అంశంపై మాట్లాడుతూ.. ‘స్టీల్ ప్లాంట్ విషయంలో కొందరు బాధ్యతరాహిత్యంగా మాట్లాడారు. నేను ముందే చెప్పాను. ఆ విషయం నేటితో స్పష్టమైంది. స్టీల్ ప్లాంట్ కేంద్రం ఆధీనంలోనే ఉండాలని మేం చాలా స్పష్టంగా చెబుతున్నాం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు మేం వ్యతిరేకం. విద్యార్థులకు రాగి జావ (Ragi Java) నిలిపివేశామని తప్పుడు ప్రచారం చేస్తున్నారు’ అని బొత్స తెలిపారు. ఇంకా పలు విషయాలపై ఆయన స్పందించారు.