మూడు రాజధానులపై(Three capitals) తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్(Jagan) మరోసారి క్లారిటీ ఇచ్చారు. తాము అన్నీ ఆలోచించిన తర్వాత… విశాఖను పరిపాలనా రాజధానిగా ఎంపిక చేశామని ఆయన చెప్పడం గమనార్హం. ఇటీవల ఓ ప్రముఖ పత్రికకు ఆయన ఇంటర్వ్యూ ఇవ్వగా.. అందులో కీలక విషయాలను తెలియజేశారు.
సీఎం ఎక్కడి నుంచి అయినా పాలన చేయవచ్చని కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం ఎక్కడ నుంచి పాలన చేస్తే అక్కడే సహచర మంత్రులు ఉంటారని.. అక్కడే సచివాలయం ఉంటుంది అని, సీఎం ఎక్కడి నుంచి పాలన చేయాలనే విషయాన్ని మిగతావారు ఎలా నిర్ణయిస్తారని జగన్ ప్రశ్నించారు. ఆర్థిక అనుకూలత-పరిపాలనా సౌలభ్యం కోసమే విశాఖ పరిపాలనా రాజధానిగా ఎంపిక చేశామని,వికేంద్రీకరణ స్పూర్తిగా విశాఖను పరిపాలనా రాజధానిగా ఎంచుకున్నామని చెప్పారు.
5 నుంచి 10 వేల కోట్లు ఖర్చు చేస్తే విశాఖ అద్భుత రాజధాని అవుతుందని పేర్కొన్న ఆయన తనకు అమరావతి మీద ఎటువంటి కోపం లేదని, ఇష్టం లేకుంటే అమరావతిలో శాసన రాజధాని ఎందుకు ప్రకటిస్తామని, అక్కడే శాసన వ్యవస్థలు ఉంటాయని చెప్పారు.
ఇక కర్నూలు న్యాయ రాజధానిగా ఉంటుందని అమరావతి అటు గుంటూరు.. ఇటు విజయవాడకు 40 కిలో మీటర్ల దూరంలో ఉందని, అక్కడ ఎటువంటి మౌలిక వసతులు లేవని అన్నారు. ఎకరానికి ఏ స్థాయిలో ఖర్చు చేస్తే మౌలిక వసతులు ఏర్పడుతాయో గతంలోనే చంద్రబాబు వివరించారని, ఆ లెక్కన లక్ష కోట్లకు పైగా ఖర్చు చేసినా పూర్తి స్థాయి రాజధానిగా మార్పు చెందటం కష్టమని అన్నారు.