»Age Limit Increased For Telangana Government Jobs
Telangana : తెలంగాణలో ఉద్యోగార్థులకు శుభవార్త.. వయో పరిమితి పెంపు
ప్రభుత్వ ఉద్యోగాల కోసం పరీక్షలు రాసే అభ్యర్థుల వయో పరిమితిని పెంచుతూ తెలంగాణ సర్కారు నిర్ణయం తీసుకుంది. దీంతో ఉద్యోగార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆ వివరాలు ఏమిటంటే...
Age limit for telangana govt jobs : తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం పరీక్షలు రాయాలనుకుంటున్న అభ్యర్థులకు రేవంత్ రెడ్డి సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. వారి వయోపతిని 46 ఏళ్లకు పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో వయసు మించిపోవడం వల్ల పరీక్షలకు దూరమైన వారు మరో రెండేళ్ల పాటు చక్కగా వాటిని రాసుకునే వీలు కలగనుంది. ఈ ప్రకటనతో ఉద్యోగార్థుల్లో పండగ వాతావరణం నెలకొంది.
గతంలో తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలకు వయో పరిమితి 44 ఏళ్లుగా ఉండేది. ఇప్పుడు అది 46 ఏళ్లకు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం జీవోను జారీ చేసింది. ఒక యూనిఫామ్ సర్వీసుల్ని మినహాయించి మిగిలిన అన్ని ఉద్యోగాలకు ఈ వయోపరిమితి వర్తిస్తుందని తెలిపింది.
ప్రశ్నాపత్రాల లీకేజీ లాంటి సమస్యలతో ఇక్కడ గ్రూప్ -1 పరీక్షల్లాంటివి(group 1 exams) వాయిదా పడుతూ వస్తున్నాయి. అయితే ఈ లోపు వయసు పెరిగిపోతుండటంతో అనర్హులుగా మారుతున్న పలువురు మనస్తాపానికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ ప్రకటన చేయడం వారికి ఊరటగా మారింది. అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కొన్ని నిబంధనల వల్ల టీఎస్పీఎస్సీ(tspsc)ప్రక్షాళన ఆలస్యం అవుతోందన్నారు. అలాగే పోలీసు ఉద్యోగాల కోసం యువత చాలా ఎదురు చూస్తోందని చెప్పారు. త్వరలోనే 15 వేల ఉద్యోగాల భర్తీకి ఏర్పాట్లు చేస్తామని ఆయన సభాముఖంగా ప్రకటించారు.