Adnan Sami: ఇదీ అసలు సమస్య.. జగన్ ఫ్యాన్స్‌కు అద్నాన్ సమీ గట్టి చురకలు
తెలుగు జెండా రెపరెపలాడుతోంది అని జగన్ ట్వీట్ చేయడంపై అద్నాన్ సమీ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏపీ సీఎం జగన్‌ను 'ఒక చెరువులో ప్రాంతీయ భావాలు కలిగిన కప్ప' అని విమర్శించారు.
జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR), రామ్ చరణ్ తేజ (Ram Charan) హీరోలుగా, రాజమౌళి దర్శకత్వంలో (Director SS Rajamouli) వచ్చిన ఆర్ఆర్ఆర్ (RRR) సినిమాలోని నాటు నాటు (Naatu Naatu song) పాటకు గాను బెస్ట్ ఒరిజినల్ సాంగ్స్ కేటగిరీలో ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు (oscar awards 2023) దక్కిన విషయం తెలిసిందే. ఆస్కార్ అవార్డుకు గాను ప్రముఖులు అందరూ శుభాకాంక్షలు (Greeting for Oscar) తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి (Chief Minister of Andhra Pradesh YS Jagan Mohan Reddy) కూడా శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు. అయితే మొత్తం భారత్ దేశానికి ఆపాదించాల్సిన ఈ అవార్డును… ఆయన తెలుగు భాష అంటూ ట్వీట్ చేశారు. దీనిపై ప్రముఖ గాయకుడు అద్నాన్ సమీ విమర్శలు గుప్పించారు. మన జానపద వారసత్వాన్ని చూసి గర్వపడుతున్నాను.. ఈ రోజు అంతర్జాతీయ గుర్తింపు లభించింది, ఆనందంగా ఉంది.. ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు పాట అవార్డు గెలుచుకోవడం సంతోషంగా ఉందని, రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ పాడిన ఈ పాట చరిత్ర సృష్టించిందని, ప్రపంచ ప్రేక్షకులను కట్టి పడేసిందని కూడా పేర్కొన్నారు. ట్వీట్ ప్రారంభంలోనే తెలుగు జెండా రెపరెపలాడుతోంది అని ట్వీట్ చేశారు. భారత జెండా అనాల్సింది తెలుగు జెండా అన్నారు. దీనిపై అద్నాన్ సమీ స్పందించారు.
తెలుగు జెండా రెపరెపలాడుతోంది అని జగన్ ట్వీట్ చేయడంపై అద్నాన్ సమీ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏపీ సీఎం జగన్‌ను ‘ఒక చెరువులో ప్రాంతీయ భావాలు కలిగిన కప్ప’ అని విమర్శించారు. అయితే సీఎం జగన్ పైన అద్నాన్ చేసిన విమర్శ పైన ఆ పార్టీ నేతలు భగ్గుమన్నారు. జగన్ ప్రాంతీయ భావాన్ని పక్కన పెట్టి, జాతీయ భావంతో ఆలోచించాలనే అద్నాన్ సమీ వ్యాఖ్యలు వారికి రుచించనట్లుగా ఉన్నాయి. తన పైన విమర్శలు చేస్తున్న వైసీపీ అభిమానులకు ఆయన తిరిగి కౌంటర్ ఇచ్చారు.
తన సమస్య భాష గురించి కాదని, నేను చెప్పింది చాలా స్పష్టంగా ఉందని, అన్ని భాషలు… మాండలికాలతో సంబంధం లేకుండా మనం భారతీయులమనే విషయం మొదట గుర్తుంచుకోవాలని, తొలుత భారతీయులం… ఆ తర్వాతే ఏదైనా అని చురకలు అంటించారు. భాషలు అన్నీ కూడా భారతీయత అనే గొడుగు కింద ఉన్నాయని అభిప్రాయపడ్డారు. తాను వివిధ ప్రాంతీయ భాషల్లో ఎన్నో పాటలు పాడానని, అందరికీ సమాన గౌరవం ఇస్తానని స్పష్టం చేశారు.
అంతేకాదు, తనను విమర్శించే వైసీపీ అభిమానులకు గతాన్ని గుర్తు చేసే ప్రయత్నం చేసారు. 1947 భారత విభజనకు ముందు దారి తీసిన కచ్చితమైన మనస్తత్వం ఇది అని, ఈ రోజు కూడా ఇలాంటి విపత్తు ప్రతిధ్వనిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాంతీయ సంస్కృతి, ప్రాంతీయ వారసత్వాన్ని చూసి ప్రతి ఒక్కరు గర్వపడాల్సిందేనని, అందులో ఎలాంటి అనుమానం లేదని, కానీ విదేశీ గడ్డ పైన జాతీయ ప్రతిష్ట, ఐక్యత ముందు అనే సోయి ఉండాలని గుర్తు చేశారు. ఇది ప్రమాద వైఖరి హెచ్చరించారు.