»Actions If Students Chatgpt Is Used In Class 10 And 12 Exams
ChatGPT: 10, 12వ తరగతి పరీక్షల్లో వాడితే చర్యలు
10, 12వ తరగతి బోర్డు పరీక్షల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత చాట్‌జిపిటి(ChatGPT)ని ఉపయోగించడాన్ని నిషేధించినట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) వెల్లడించింది. విద్యార్థులు ఉపయోగించినట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 10వ, 12వ తరగతి పరీక్షల తేదీని ప్రకటించింది. ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 5 వరకు కొనసాగనున్నాయి. దాదాపు 38,83,710 మంది విద్యార్థులు(students) ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. ఈ క్రమంలో విద్యార్థులు ఎలాంటి ఒత్తిడి లేకుండా హాజరై పరీక్షలు రాయాలని CBSE మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కాగా..విద్యార్థులు చాట్ జీపీటీ ఉపయోగిస్తారనే భయం అధికారుల్లో పట్టుకుంది.
ఇదిలా ఉండగా 10, 12వ తరగతి బోర్డు పరీక్షల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత చాట్‌జిపిటి(ChatGPT)ని ఉపయోగించడాన్ని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) నిషేధించినట్లు అధికారులు వెల్లడించారు. మొబైల్, చాట్‌జిపిటి, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను పరీక్ష హాల్లోకి అనుమతించరని స్పష్టం చేశారు. అయితే ChatGPTని ఉపయోగించడం వల్ల పరీక్షలు కాపీ చేసీ సమాధానాలు రాసే అవకాశం ఎక్కువగా ఉందని బోర్డు అధికారులు తెలిపారు. ఒక వేళ అలా దొరికిన వారిని అన్‌ఫెయిర్ మీన్స్ (UFM) యాక్టివిటీ కింద అదుపులోకి తీసుకుని బోర్డు నిబంధనల ప్రకారం చర్యలు కూడా తీసుకుంటామని వెల్లడించారు.
ఇక నవంబర్ 2022లో ప్రారంభించబడిన ChatGPT (చాట్ జనరేటివ్ ప్రీ-ట్రైన్డ్ ట్రాన్స్ఫార్మర్), ప్రసంగాలు, పాటలు, మార్కెటింగ్ కాపీ, వార్తా కథనాలు, విద్యార్థి వ్యాసాలు అది అందించిన ఇన్పుట్ ఆధారంగా సులువుగా టెక్స్ట్‌ను అందించగలుగుతుంది. ఈ క్రమంలో విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ChatGPTలో ఈజీగా సమాధానాలు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. ఇప్పటికే అనేక మంది విద్యార్థులు తమ హోంవర్క్‌ను పూర్తి చేయడానికి ChatGPTని ఉపయోగిస్తున్నారని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. అంతేకాదు మరికొన్ని పరీక్షల్లో చాట్ జీపీటీ ఉపయోగించి పలువురు విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించారని వెలుగులోకి వచ్చింది.