ఉత్తర నైజీరియా(Nigeria)లో పెళ్లికి వెళ్లి తిరిగి వస్తున్న పడవ(boat) ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఈ ఘటనలో పిల్లలతో సహా దాదాపు 103 మంది మరణించారని అక్కడి అధికారులు పేర్కొన్నారు.
నైజీరియా(Nigeria)లో పెళ్లికి వచ్చిన అతిథులతో వెళ్తున్న పడవ(boat) బోల్తా పడి 100 మందికి పైగా చనిపోయారు. ప్రమాద సమయంలో పడవ ఓవర్లోడ్తో ఉన్న కారణంగా బోల్తా పడినట్లు తెలుస్తోంది. ఆ క్రమంలో పడవలో 300 మంది వరకు ఉన్నారని అధికారులు వెల్లడించారు. పడవ ప్రయాణిస్తున్న క్రమంలో లోపల ఉన్న ఓ దుంగను ఢీకొట్టి రెండుగా చీలిపోయిందని తెలిపారు. ఇలోరిన్ నుంచి క్వారా రాష్ట్రంలోని పటేగి జిల్లాలోని నైజర్ నదిపై సోమవారం తెల్లవారుజామున వెళ్తుండగా ప్రమాదం జరిగింది. రద్దీతో కూడిన జనంతో పడవలో వెళుతున్న క్రమంలో బోల్తా పడగా..గల్లైంతన వారికోసం పోలీసులు వెతుకుతున్నారు. ఇప్పటికే 100 మందిని రక్షించినట్లు అధికారులు తెలిపారు.
అయితే అనేక మంది పెళ్లి కోసం మోటారు సైకిళ్లపై పెళ్లి వేడుకకు వచ్చారు. కానీ కుండపోత వర్షం(rain) కారణంగా రహదారిని వరదలు ముంచెత్తడంతో స్థానికంగా ఉన్న పడవలో బయలుదేరిన క్రమంలో ప్రమాదం చోటుచేసుకుంది. నైజర్ రాష్ట్రంలోని ఎగ్బోటి గ్రామంలో ఈ వివాహ వేడుక జరిగిందని అక్కడి నివాసి ఉస్మాన్ ఇబ్రహీం తెలిపారు. తెల్లవారుజామున 3 గంటలకు ప్రమాదం జరిగినందున ఏం జరిగిందో చాలా మందికి తెలియలేదని వెల్లడించారు. బుధవారం వరకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందని పోలీసు అధికార ప్రతినిధి అజయ్ తెలిపారు.
ఈ నేపథ్యంలో క్వారా గవర్నర్ అబ్దుల్రహ్మాన్ మరణించిన వారి కుటుంబాలకు విచారం వ్యక్తం చేశారు. అయితే నైజీరియాలోని అనేక మారుమూల కమ్యూనిటీలలో పడవ ప్రమాదాలు సాధారణం. ఇక్కడ స్థానికంగా తయారు చేయబడిన ఓడలు(boats) సాధారణంగా రవాణా కోసం ఉపయోగించబడతాయి. చాలా ప్రమాదాలు ఓవర్లోడింగ్, సరిగా నిర్వహించని పడవలను ఉపయోగించడం వల్ల సంభవిస్తూ ఉంటాయి.