NDL: కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (KRMB) ఛైర్మన్ సుబ్రాంగ్ షూ బిశ్వాస్ ఇవాళ శ్రీశైలం డ్యామ్‌ను సందర్శించనున్నారు. డ్యామ్ ప్రస్తుత స్థితిగతులు, అవసరమైన మరమ్మతులను ఆయన స్వయంగా పరిశీలిస్తారు. అనంతరం శ్రీశైలంలోనే ఏపీ, తెలంగాణ రాష్ట్రాల జలవనరుల శాఖ అధికారులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. నీటి విడుదల, డ్యామ్ నిర్వహణపై ఈ భేటీలో చర్చించనున్నారు.
GNTR: నగరంలో అక్రమ నిర్మాణాలపై అధికారులు కొరడా ఝళిపించారు. మోతీలాల్ నగర్‌లో అక్రమ కట్టడాలను అధికారులు కూల్చివేశారు. ఇళ్ల తొలగింపులను సీసీఐ కార్యకర్తలు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు, రైల్వే అధికారులతో కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు.
కృష్ణా: గన్నవరం పరిధిలోని రాయ్‌నగర్‌లో సోమవారం ఐదుగురు యువ ఇంజినీర్లు కలిసి సరికొత్త టెక్నాలజీ సంస్థను ప్రారంభించారు. ట్రిపుల్ ఐటీ విద్యను పూర్తిచేసిన వీరు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో డ్రోన్ల ప్రొపెలర్స్, రోబోటిక్స్ డిజైన్‌ల అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నారు. వీరి సంకల్పానికి పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మార్కాపురం జిల్లా కంభం పోలీస్ స్టేషన్ పరిధిలోని కందులాపురం సెంటర్ వద్ద రోడ్డు భద్రత చర్యల్లో భాగంగా మంగళవారం కన్వెక్స్ మిర్రర్స్‌ను ఏర్పాటు చేశారు. మలుపుల వద్ద వాహనదారులకు స్పష్టమైన దృశ్యాన్ని కల్పించేందుకు ఈ అద్దాలు ఉపయోగపడతాయని ఎస్సై శివకృష్ణ రెడ్డి తెలిపారు. వీటి ద్వారా ఎదురుగా వచ్చే వాహనాలను ముందుగానే గమనించే అవకాశం ఉండటంతో రోడ్డు ప్రమాదాలను తగ్గించవచ్చన్నారు.
SKLM: పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష మంగళవారం ప్రజలకు అందుబాటులో ఉండనున్నారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఆమె ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు. నియోజకవర్గ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదలైంది.
అన్నమయ్య: రాయచోటి పట్టణంలో అనారోగ్యంతో బాధపడుతున్న పూజారి వీరేంద్రకు ప్రభుత్వం తరపున రూ.3,06,500 విలువైన LOC పత్రాన్ని మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి సోమవారం అందజేశారు. వైద్య ఖర్చులకు ఇబ్బంది పడుతున్న పూజారి కుటుంబం అభ్యర్థన మేరకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పందించి ఈ సహాయం అందించారు. వీరేంద్ర కుటుంబ సభ్యులు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
NTR: విజయవాడలో సంచలనం రేపిన ఉగ్ర లింకుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న 11 మందికి రిమాండ్‌ను మే 4 వరకు పొడిగించారు. అదే కేసులో సంబంధం ఉన్న మైనర్‌కు సంబంధించిన కస్టడీ, బెయిల్ పిటిషన్ విచారణను ఈ నెల 24కు వాయిదా వేస్తూ విజయవాడలోని సీజేఎం కోర్టు వెల్లడించింది. కేసు తదుపరి విచారణపై ఆసక్తి నెలకొంది.
కోనసీమ: తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారికి విజయవాడ వాస్తవ్యులు నిమ్మల శ్రీను, పద్మ వారి కుటుంబ సభ్యులు 8.38 గ్రాముల బంగారు నామము విరాళంగా సమర్పించారు. ముందుగా వారు స్వామివారిని దర్శించి పూజలు నిర్వహించారు. అనంతరం వారు విరాళాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి వేద ఆశీర్వాదాలు అందజేసి స్వామి వారి చిత్రపటాన్ని అందజేశారు.
W.G: నెట్ సెంటర్, ఏటీఎంలు ఏర్పాటు చేయిస్తామంటూ నమ్మించి లక్షలాది రూపాయలు వసూలు చేసిన ఘటన భీమవరంలో వెలుగు చూసింది. బాధితుడు గ్రంథం హరిప్రసాద్ ఫిర్యాదుతో వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులు పరిచయాన్ని ఆసరాగా చేసుకుని హరిప్రసాద్ నుంచి రూ.13.50 లక్షలు కాజేశారని, ఇదే ముఠా మరో ఇద్దరి వద్ద రూ.17 లక్షలు వసూలు చేసినట్లు ఎస్సై కిరణ్ కుమార్ తెలిపారు.
VZM: కొత్తవలస పట్టణ కేంద్రం కుమ్మరివీధిలో శ్రీకాకుళపు శ్రీను ఇంటిలో గత నెలలో ముగ్గురు నిందితులు దొంగతనానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.కేసులో మూడో నిందితుడైన సంత మార్కెట్ ఎస్సీ కాలనీ చెందిన కే.నానిని అరెస్ట్ చేసి, అతని వద్ద నుండి మండ చైను, మూడు బంగారు ఉంగరాలను స్వాధీనం చేసుకున్నామని సీఐ షణ్ముఖరావు తెలిపారు.
PPM: వీరఘట్టం ప్రాంతానికి చెందిన భోగి శ్రీధర్, సుజాత దంపతుల కుమారుడు శ్రీకర్ జేఈఈ మెయిన్స్‌లో ప్రతిభ చాటాడు. తాజాగా విడుదలైన జేఈఈ ఫలితాల్లో 99.59 స్కోర్ సాధించి ఆల్ ఇండియా స్థాయిలో 6571వ ర్యాంక్ ఈబీసీ విభాగంలో 777వ ర్యాంక్ పొందాడు. ఈ విజయంతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేయగా, గ్రామస్థులు శ్రీకర్ ను అభినందించారు.
నెల్లూరు: సంగం మండలం జెండాదిబ్బ గ్రామం సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పుట్టంవారిగుంట వద్ద రోడ్డు పక్కన గోడపై కూర్చున్న సుబ్బారెడ్డిని తాటి మొద్దుల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ ఢీకొని కాలువలోకి దూసుకెళ్లింది. తీవ్రగాయాలైన సుబ్బారెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తిరుపతి జిల్లాలో వేటగాళ్ల విద్యుత్ ఉచ్చులు మనుషులకు, జంతువులకు శాపంగా మారాయి. గత రెండు నెలల్లో ఇద్దరు వ్యక్తులు, మూడు ఏనుగులు బలి కాగా, తాజాగా యర్రావారిపాళెం మండలం అయ్యగారిపల్లిలో విద్యుత్ తీగలు తగిలి అడవి పంది మృతి చెందింది. అటవీ శాఖ భయంతో రైతు జంతు కళేబరాన్ని దాచిపెట్టగా, అధికారులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు.
CTR: వెదురుకుప్పం మండలం డ్రోన్ నిఘా పర్యవేక్షణలో ఉన్నట్లు ఎస్సై నవీన్ బాబు పేర్కొన్నారు. మండలంలోని చవటగుంట బ్రాహ్మణపల్లి మార్గమధ్యంలో ఎస్సై పోలీస్ సిబ్బందితో కలిసి డ్రోన్ కెమెరాతో వాహనాల రాకపోకలను పర్యవేక్షించారు. డ్రగ్స్, నాటు సారా తయారీ స్థావరాలపై డ్రోన్ కెమెరాతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు.