NDL: జిల్లాలో మొత్తం 449 రెవెన్యూ గ్రామాలు ఉండగా, ఇప్పటివరకు 263 గ్రామాల్లో రీ సర్వే పూర్తైందని కలెక్టర్ రాజకుమారి తెలిపారు. కలెక్టరేట్లో అధికారులతో శనివారం సమీక్ష నిర్వహించారు. పూర్తి చేసిన గ్రామాలలో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను త్వరితగతిన పంపిణీ చేయాలని ఆదేశించారు. 5వ విడతలో భాగంగా ఈనెల 15 నుంచి 30 గ్రామాల్లో రీ సర్వే ప్రారంభించామన్నారు.
కోనసీమ: జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఆర్.ఎస్. కుమారీశ్వరన్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్‌ను శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల నూతనంగా విధుల్లో చేరిన సందర్భంగా మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆయన రామచంద్రపురం ఎక్సైజ్ సీఐ శ్రీనివాస్‌తో కలిసి ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
SS: శ్రీ సత్యసాయి జిల్లాలో మున్సిపల్ అభివృద్ధి పనులు, పారిశుధ్యం, పౌర సేవలపై కలెక్టరేట్‌లో కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ శనివారం సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో రూ. 760.59 కోట్లతో నీటి సరఫరా, మురుగునీటి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. అమృత్ (AMRUT) 1.0 & 2.0 పనులను గడువులోగా పూర్తి చేయాలని సూచించారు.
విజయనగరం: పోలీసు ఉద్యోగుల సంక్షేమంలో భాగంగా 2024-25 విద్యా సంవత్సరంలో ప్రతిభ కనబర్చిన విద్యార్ధులను ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ అభినందించారు. కో-ఆపరేటివ్ సభ్యత్వం కలిగిన 47 మంది పోలీసు ఉద్యోగుల పిల్లలకు రూ. 2.17లక్షలను మెరిట్ స్కాలర్షిప్స్‌ను అందజేశారు. ఉన్నత విద్యను అభ్యసించి, కోరుకున్న రంగంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించి, విద్యార్థుల్లో స్ఫూర్తి నింపారు.
TPT: పేద పిల్లలు ఉన్నత స్థాయికి చేరాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యమని మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి పేర్కొన్నారు. తిరుపతి అంబేడ్కర్ స్టడీ సర్కిల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన, అభ్యర్థులతో ముచ్చటించారు. మొత్తం 340 మందికి సివిల్స్ ఉచిత రెసిడెన్షియల్ కోచింగ్, 100 మందికి ట్యాబ్‌ల ద్వారా ఆన్‌లైన్ శిక్షణ అందిస్తున్నట్లు వెల్లడించారు.
ATP: తాడిపత్రి MLA జేసీ అస్మిత్ రెడ్డి శనివారం యాడికి మండల అధికారులు, సచివాలయ సిబ్బందితో తాడిపత్రిలోని తన స్వగృహంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రజల నుంచి వస్తున్న వినతులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని, ప్రజా సమస్యల పట్ల నిర్లక్ష్యం వహించకూడదని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా అభివృద్ధి పనులు, సచివాలయ సేవలపై కూడా చర్చించారు.
CTR: రొంపిచర్ల తెలుగు ప్రాథమిక పాఠశాల శతాబ్ది ఉత్సవం శనివారం అత్యంత వేడుకగా జరిగింది. 1926లో స్థాపితమైన ఈ పాఠశాల వంద ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పూర్వ విద్యార్థులంతా ఒకచోట చేరి పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన డివైఈవో ఇందిరా, ఎంఈఓ శ్రీనివాసులు సీనియర్ విద్యార్థులను ఘనంగా సన్మానించి, పాఠశాల అభివృద్ధిని కొనియాడారు. ఈ వేడుక ఎంతో ఉత్సాహంగా సాగింది.
PLD: కొండమోడు వీరమ్మ కాలనీలో ఆయుష్ వైద్యాధికారి డాక్టర్ ఆర్. శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆరోగ్య శిబిరం నిర్వహించారు. వేసవిలో వడదెబ్బ బారిన పడకుండా ఉండాలంటే తగినంత నీరు, మజ్జిగ, రాగి జావ తీసుకోవాలని, మధ్యాహ్నం వేళ బయట తిరగవద్దని సూచించారు. అనంతరం గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించి, ఆయుష్ మందులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆశ కార్యకర్తలు, పాల్గొన్నారు.
TPT: CMRF చెక్కులను గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ పంపిణీ చేశారు. వేడిచర్ల గ్రామానికి చెందిన శివరాం సలోమికి రూ. 30,028, జడ్డా జయమ్మకు రూ. 23,920 విలువైన చెక్కులను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజకీయ పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని, సీఎం సహాయనిధి ద్వారా పేదలకు వైద్య ఖర్చుల నిమిత్తం భరోసా కల్పిస్తున్నామని పేర్కొన్నారు.
ప్రకాశం: కొండపి మండలం చోడవరం గ్రామంలో శనివారం బ్రహ్మంగారి ఆరాధన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. ముందుగా గ్రామస్తులు స్వామికి ఘన స్వాగతం పలికారు.
BPT: చందోలు ఎస్సై వెంకట శివకుమార్ పోలీసుల నిజాయితీని చాటుకున్నారు. ఓ వ్యక్తి పోగొట్టుకున్న రెండు సవర్ల బంగారు గొలుసును గాలించి పట్టుకున్నారు. మొక్కల పొదల్లో చిక్కుకున్న ఆ గొలుసును గుర్తించి, బాధితుడికి సురక్షితంగా అప్పగించారు. సొత్తు తిరిగి దొరకడంతో అతడు ఊరట చెందాడు. నేరాల నియంత్రణ, ప్రజలకు భరోసా కల్పించడంలో పోలీసుల కృషి స్థానికులు అభినందనీయమన్నారు.
E.G: అసాంఘిక శక్తులపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఎస్‌పీ డి. నరసింహ కిషోర్ ఆదేశాల మేరకు శనివారం తాళ్లపూడి ఎస్సై టి. రామకృష్ణ నేతృత్వంలో గ్రామ శివార్లలో విస్తృత తనిఖీలు చేపట్టారు. గోదావరి పరిసరాలు, పొదలు, తోటల్లో డ్రోన్ కెమెరాలతో నిఘా పెంచారు. బహిరంగ మద్యపానం, జూదం, కోడి పందాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ELR: ద్వారకాతిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను ఈవో వేండ్ర త్రినాథరావు శనివారం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజుకు అందజేశారు. ఈనెల 30న జరిగే స్వామివారి కల్యాణోత్సవం, నూతన ట్రస్టు బోర్డు ప్రమాణస్వీకారం, పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలకు హాజరుకావాలని కోరారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.
KRNL: యూనివర్సిటీ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 27న బంద్‌కు ఇవాళ ఆర్ఎస్ఎఫ్ నేతలు పిలుపునిచ్చారు. నిధుల కేటాయింపు, మౌలిక వసతుల అభివృద్ధి కోసం డిమాండ్లు ఉంచారు. అక్రమ నియామకాలు, అవినీతి అంశాలపై చర్యలు తీసుకోవాలని కోరారు. బంద్‌ను విజయవంతం చేయాలని విద్యార్థులకు, ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
GNTR: వట్టిచెరుకూరు మండలం వింజనంపాడు గ్రామ పరిధిలో పేకాట స్థావరంపై పోలీసులు ఆకస్మిక దాడి నిర్వహించి 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. దాడిలో రూ.17,120 నగదు, 10 సెల్ ఫోన్లు, 3 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను వట్టిచెరుకూరు పోలీస్ స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు.