BPT: కర్లపాలెం మోడల్ ప్రైమరీ స్కూల్‌లో ‘బడి పిలుస్తోంది’ కార్యక్రమం ఇవాళ చేపట్టారు. హెచ్ఎం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ఇళ్లిల్లూ తిరిగారు. ఐదేళ్లు నిండిన పిల్లలను ప్రభుత్వ బడిలో చేర్పించాలని కోరారు. స్థానిక అంగన్‌వాడీ కేంద్రాలను సందర్శించారు. బడి బయట ఉన్న పిల్లలందరినీ పాఠశాలల్లో చేర్పించడమే తమ లక్ష్యమని ఉపాధ్యాయుడు పోలీసురావు పేర్కొన్నారు.
అన్నమయ్య: చిన్నమండెం మండలంలో ఇవాళ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రజా దర్బార్ నిర్వహించారు. పడమటికోన, బోరెడ్డిగారిపల్లి గ్రామాలలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను స్వయంగా విని, తక్షణ పరిష్కారం కోసం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు అందుబాటులో ఉండి సంక్షేమం, అభివృద్ధి అందించడం ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు.
KRNL: తుగ్గలి మండలం రాంపురం గ్రామానికి చెందిన శశి అదృశ్యమవడంతో కుటుంబ సభ్యులు జొన్నగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎస్సై మల్లికార్జున మొబైల్ సిగ్నల్ ఆధారంగా గ్రామ శివారులోని పొలంలో అతడిని గుర్తించారు. స్పృహలేని స్థితిలో ఉన్న శశిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడారు. దీంతో పోలీసులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
GNTR: తెనాలిలో సంచలనం రేకెత్తించిన డ్రగ్స్ కేసులో మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. తెనాలికి చెందిన కొందరు బెంగళూరుకు చెందిన వ్యక్తికి ఫోన్ ద్వారా నగదు పంపి MDMA డ్రగ్‌ను తెప్పించారు. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే ముగ్గురిని అరెస్టు చేశారు. తాజాగా తెనాలి నుంచి బెంగళూరు వెళ్లిన ప్రత్యేక బృందం సదరు డ్రగ్ పెడ్లర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
VZM: జిల్లా విద్యాశాఖ ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించే ప్రక్రియలో భాగంగా తాజా సీనియారిటీ జాబితాను విడుదల చేశారని DEO మాణిక్యం నాయుడు తెలిపారు. సీనియారిటీ ఆధారంగా పదోన్నతులు, బదిలీలు, ఇతర పరిపాలన చర్యలు చేపట్టనున్నట్లు చెప్పారు. సీనియారిటీ జాబితాలో తప్పులు ఉంటే నేటి నుంచి ఈనెల 26 వరకు DEO కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు.
GNTR: వందేళ్ల క్రితం శ్రీరామచంద్ర సరస్వతీ స్వామి ప్రారంభించిన వేద పరీక్షల విధానం నేటికీ సాగుతోంది. కంచి పీఠాధిపతుల ఆశీస్సులతో 2025లో నూతన వ్యవస్థను తీసుకొచ్చారు. ఇందులో భాగంగా మంగళగిరిలో రెండోసారి ఈ పరీక్షలు జరుగుతున్నాయని సుబ్రహ్మణ్యశాస్త్రి తెలిపారు. కాగా, పలు జిల్లాల వారు ఈ స్మార్త, వేద పరీక్షలకు హాజరవుతున్నారు.
NDL: సంజామల మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం జనగణన కార్యక్రమంపై మూడు రోజుల శిక్షణలో భాగంగా సూపర్‌వైజర్లు, ఎన్యుమరేటర్లకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. తహాసీల్దార్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ట్రైనర్లు శ్రీనివాసులు, రాజశేఖర్ జనగణన విధానాలు, ఇంటింటి వివరాల సేకరణ, గృహాల లెక్కింపు, నమోదు ప్రక్రియపై సమగ్ర అవగాహన కల్పించారు.
కాకినాడ: జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్ జిల్లాల బీచ్ కబడ్డీ పోటీలకు ఈ నెల 25న జట్ల ఎంపిక జరుగుతుందని కార్యదర్శి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. కాకినాడ సాయి సార్ క్లబ్‌లో పురుషులు, మహిళల జట్లను ఎంపిక చేస్తారని పేర్కొన్నారు. పోటీల్లో పాల్గొనే పురుష క్రీడాకారులు 85 కేజీలు, మహిళా క్రీడాకారులు 75 కేజీల బరువు కలిగి ఉండాలన్నారు.
TPT: చిన్నారులను చిన్నతనం నుంచే ఫోన్లకు, టీవీలకు దూరంగా ఉంచాలని గూడూరు సీడీపీవో మెహబూబీ కోరారు. మంగళవారం గూడూరు ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని తిలక్ నగర్ అంగన్వాడీ కేంద్రంలో పోషణ పక్వాడ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొని ఆమె మాట్లాడుతూ.. చిన్నతనం నుంచి విద్యార్థులు ఆటపాటలపై దృష్టి సారించే విధంగా తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకోవాలన్నారు.
NTR: వైశాఖ శుద్ధ పంచమిని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో జగద్గురు ఆదిశంకరాచార్యుల వారి జయంతి వేడుకలు ప్రారంభమయ్యాయి. కొండపై ఉన్న క్షేత్రపాలక ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణానికి ఎదురుగా ఉన్న పల్లకీ సేవ ప్రాంతంలో శంకరాచార్య స్వామి విగ్రహానికి అర్చకులు శాస్త్రోక్తంగా అభిషేకం చేశారు. అనంతరం భక్తులు పూజలు చేశారు.
CTR: రొంపిచర్ల జడ్పీ బాయ్స్ హై స్కూల్‌కి చెందిన టీచర్లు ‘బడి పిలుస్తోంది’ కార్యక్రమాన్ని ఇవాళ నిర్వహించారు. ఫజులుపేటలో ఇంటింటికి వెళ్లి విద్యార్థులను పాఠశాలల్లో చేర్పించమని ఉపాధ్యాయులు అడుగుతున్నారు. పాఠశాలలో విద్యాపరంగా ఎదుగుదలకు ఉన్న వసతుల గురించి వివరిస్తూ పిల్లల నమోదుకు ప్రయత్నిస్తున్నారు. ఈ కార్యక్రమంలో HM ధనలక్ష్మి, టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.
KRNL: కేంద్ర ప్రభుత్వం 2027 గణతంత్ర దినోత్సవం సందర్భంగా అందించే పద్మ పురస్కారాలు కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి భూపతి రావు తెలిపారు. అంతర్జాతీయ క్రీడల్లో పతకాలు సాధించిన వారు, పాల్గొన్న వారు అర్హులని చెప్పారు. దరఖాస్తు ఫామ్‌లు https://awards.gov.inలో లభిస్తాయని, మే 15లోపు ఆ వివరాలను తమకు అందజేయాలని ఆయన సూచించారు.
ELR: సెల్ఫ్ ఎన్యూమరేషన్’ స్వయం నమోదు దశ కొనసాగుతున్న నేపథ్యంలో సైబర్ నేరగాళ్లు ప్రజలను లక్ష్యంగా చేసుకుంటున్నారని జిల్లా ఎస్పీ ప్రతాప్ కిషోర్ తెలిపారు. సెన్సస్ అధికారులమంటూ ఫోన్ కాల్స్, వాట్సాప్ మెసేజ్‌లు పంపి ప్రజల బ్యాంకు ఖాతాలను ఖాళీ చేసే ప్రమాదం ఉందన్నారు. జనగణన పేరుతో ఎవరైనా మీ బ్యాంక్ వివరాలు లేదా OTP అడిగితే ఇవ్వొద్దని అన్నారు.
గుంటూరు మిర్చి యార్డ్‌లో ఖాళీ గోనెసంచి ధరను 10 ఏళ్ల తర్వాత పెంచారు. గోతానికి రూ.15 నష్టం భరిస్తున్నామని రైతులు మంత్రి అచ్చెన్నాయుడుకు తెలియజేయగా, ఆయన జోక్యంతో నిర్ణయం తీసుకున్నారు. ఈ చర్యతో ఏటా సుమారు రూ.30 కోట్ల లాభం రైతులకు దక్కనుంది. తక్కువ ధర ఇస్తే వెంటనే ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు.
KDP: పులివెందులలోని స్థానిక YSVRM ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఇంటర్ ఫలితాలలో ప్రతిభ చూపిన విద్యార్థులను కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసులు అభినందించారు. కష్టపడి చదివి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆయన సూచించారు. ఇంటర్ ఫలితాల్లో విద్యార్థులు ప్రతిభ చూపడంతో జిల్లా స్థాయిలో తమ కళాశాలను మొదటి స్థానంలో నిలబెట్టారని తెలిపారు.