NDL: శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు. నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు. శనివారం ఉదయం 6 గంటల సమయానికి డ్యామ్ నీటి మట్టం 820.30 అడుగులకు చేరింది. వేగంగా శ్రీశైలం జలాశయం నీటి నిల్వలు అడుగంటుతున్నాయి. ఈ ఏడాది రెండు తెలుగు రాష్ట్రాలకు తాగునీటి కష్టాలు తప్పేలా లేవని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం 41.0482 TMCలుగా ఉంది.
KRNL: NH-167పై పలుచోట్ల మృత్యువు మాటేసింది. తరచూ జరుగుతున్న ప్రమాదాలు కలవర పెడుతున్నాయి. ఈ జాతీయ రహదారి కర్ణాటకలోని బళ్లారి నుంచి ఎమ్మిగనూరు మీదుగా మంత్రాలయం, రాయచూర్ వెళ్తుంది. మధ్యలో కొటేకల్ నగరవరం, ముగతి, చిలకలడోణ, కల్లుదేవకుంట, మాధవరం, చెట్నేపల్లి వద్ద పోలీసులు బ్లాక్ స్పాట్లను గుర్తించారు. ఈ ప్రాంతాల్లో ప్రమాదాల కట్టడికి చర్యలు చేపట్టాల్సి ఉంది.
W.G: భీమవరం బీజేపీ జిల్లా ఆఫీస్‌లో కిసాన్ మోర్చా జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర కార్యదర్శి Y.V సుబ్బారావు, జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతల నుంచి కిసాన్ మోర్చాను బలోపేతం చేస్తామని అన్నారు. జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు గాదిరాజు వెంకట సూర్యనారాయణరాజు అధ్యక్షతన ఈ సభ జరిగింది.
SKLM: పోలాకి మండలం దీర్ఘాసి గ్రామంలో ప్రత్యేక ఎన్రోల్మెంట్ డ్రైవ్ శనివారం నిర్వహించారు. మండల విద్యాశాఖ అధికారి ఎస్ శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు పోగోటి రామచంద్రరావు ఆధ్వర్యంలో ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు చేర్పించాలని తల్లిదండ్రులకు తెలియజేశారు. ప్రభుత్వం విద్యార్థులకు సంబంధించి అన్ని సౌకర్యాలు కల్పిస్తుందన్నారు
NLR: కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి మంత్రి పదవి వస్తుందని గత కొద్ది రోజులుగా ప్రచారం సాగింది. బహిరంగ సభల్లో కూడా నాయకులు ఆమెకు మంత్రి పదవి రావాలని ఆకాంక్షించారు. అన్యూహంగా పార్టీ అధిష్టానం ప్రశాంతి రెడ్డిని పోలిట్ బ్యూరో సభ్యులుగా నియమించారు. దీంతో ఎమ్మెల్యేకు ఇక మంత్రి పదవి లేనట్టే అని ప్రచారం సాగుతోంది.
సత్యసాయి: సోమందేపల్లి మండలం మంచేపల్లి గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు వెంకటరమణప్ప (70) అనారోగ్యంతో మరణించారు. శనివారం ఈ విషయం తెలుసుకున్న మండల కన్వీనర్ వెంకటేష్, టీడీపీ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, వెంకటరమణ, తదితరులు వారి గ్రామానికి వెళ్లి మృతదేహానికి పూలమాల, టీడీపీ జెండా కప్పి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.
ATP: అనంతపురంలోని నేషనల్ పార్కులో పర్యటించిన ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అక్కడ పనిచేసే సిబ్బందితో కలిసి అల్పాహారం చేశారు. సామాన్య కార్మికులతో కలిసి టిఫిన్ చేస్తూ వారి కుటుంబ యోగక్షేమాలను, పిల్లల చదువుల గురించి ఆరా తీశారు. గతంలో ఏ ప్రజాప్రతినిధి తమను ఇలా గుర్తించలేదని, ఎమ్మెల్యే స్వయంగా తమతో కలవడంపై సిబ్బంది సంతోషం వ్యక్తం చేశారు.
VSP: లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు (131వ రాజ్యాంగ సవరణ) వీగిపోవడంపై జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు వర్మ హర్షం వ్యక్తం చేశారు. శనివారం జగదంబ కాంగ్రెస్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ప్రజాస్వామ్య శక్తుల ఐక్యతతో అధర్మం ఓడి ధర్మం గెలిచిందన్నారు. రాహుల్ గాంధీ, ఖర్గే నాయకత్వంలో విపక్షాల ఏకతాటిపైకి రావడం చారిత్రాత్మకమన్నారు.
CTR: అప్పలాయగుంటలో రేపు నగరి MLA గాలి భాను ప్రకాష్ పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. ఆదివారం ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగే కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. వడ్డిపల్లి రోడ్డు, గుంట కట్ట వద్ద సిమెంట్ రోడ్డు, హరిజనవాడ మార్గం, శివాలయం వరకు రహదారులతో పాటు అప్పలాయగుంట-కమ్మపల్లి గ్రామీణ లింక్ రోడ్డును ప్రారంభిస్తారు. మొత్తం రూ.2 కోట్లతో ఈ పనులు ప్రారంభం కానున్నాయి.
SKLM: కంచిలి మండలం అర్జునపురం గ్రామంలో శనివారం ఉమ్మరంగా పారిశుధ్యం పనులు చేపట్టారు. సంబంధిత పంచాయతీ కార్యదర్శి, ఆపాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆధ్వర్యంలో గ్రామస్తులు పాఠశాల ఆవరణలో ఉన్న వ్యర్థాలతో పాటు, పరిసరాలలో ఉన్న వ్యర్థాలను తొలగించే చర్యలు చేపట్టారు. పారిశుధ్యం తోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యం అవుతుందని హెచ్.ఎం, బుడ్డెపు కామేశ్వర్ రెడ్డి అన్నారు.
కోనసీమ: రాయవరం మండలం వెదురుపాకలో శనివారం ఉపాధి హామీ పనికి వచ్చిన కూలి సత్తి వనుము రెడ్డి ఆకస్మికంగా మృతి చెందాడు. ఉదయం 6:30 గంటల ప్రాంతంలో గుండెపోటు రావడంతో కూలీలు వెంటనే సీపీఆర్ చేశారు. అయినా ఫలితం లేకపోవడంతో ఘటనా స్థలంలోనే మృత్యువాత పడ్డాడు. 74 సంవత్సరాల వయసు కలిగిన వనుమురెడ్డి మృతి పట్ల ఉపాధి కూలీలు సంతాపం వ్యక్తం చేశారు.
కృష్ణా: విజయవాడ భారతీనగర్‌లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను పటమట, టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ హోటల్‌లో గుట్టుచప్పుడు కాకుండా బెట్టింగ్ సాగిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. నిందితులు గణేశ్, ప్రసాద్, శ్రీనివాసరావు, రంగబాబులను అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుంచి రూ. 2 లక్షల నగదు, ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు.
PPM: కురుపాం మండలంలో వేసవి దాహం తీర్చేందుకు చర్యలు వేగం పుంజుకున్నాయి. క్రాస్ ప్రోగ్రామ్‌లో భాగంగా శనివారం బోర్ మెకానికులు గ్రామాల్లో పాడైన తాగునీటి బోర్లను మరమ్మతు చేశారు. నీటి కొరతను దృష్టిలో ఉంచుకుని సమస్యాత్మక బోర్లను గుర్తించి పనులు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ప్రజలు నీటిని జాగ్రత్తగా వినియోగించాలని సూచించారు.
ATP: గుత్తి మున్సిపాలిటీలో శనివారం స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించారు. మున్సిపల్ అధికారులు ప్రజలకు పరిశుభ్రత ప్రాముఖ్యత, మురిగినీటి నిర్వహణ, ప్లాస్టిక్ వినియోగ నివారణ తదితర అంశాలపై వివరించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులవ్వాలంటూ మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా పిలుపునిచ్చారు.
TPT: విజయవాడకు చెందిన వెలగపూడి విజయలక్ష్మీ కుటుంబ సభ్యులు తిరుమలలోని అదనపు ఈవో కార్యాలయంలో అన్నదానానికి భారీ విరాళం అందజేశారు. దాత శ్రీ వెంకటేశ్వర అన్నదాన ట్రస్టుకు రూ.1.08 కోట్లు విరాళంగా అందించారు. ఈ విరాళాన్ని అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్వీకరించారు. ఈ సందర్భంగా దాత కుటుంబాన్ని అదనపు ఈవో అభినందించారు.