ప్రకాశం: మద్దిపాడు మండలం దొడ్డవరప్పాడు బస్టాండ్ సమీపంలో జాతీయరహదారిపై మంగళవారం తెల్లవారుజామున పెను ప్రమాదం తప్పింది. చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు ముందు టైరు పగలడంతో అదుపు తప్పి డివైడర్ మీదకు వెళ్లింది. ఆ సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఏమి కాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
AKP: నర్సీపట్నం అగ్నిమాపక కేంద్రం పరిధిలో 9 మండలాలకు సేవలు అందుతున్నాయి. 1982 సంవత్సరంలో ఏర్పాటు చేసిన అగ్నిమాపక శకటం ద్వారా అనకాపల్లి జిల్లాలో ఆరు మండలాలు, అల్లూరు జిల్లాలో మూడు మండలాలకు ఆపద సమయంలో సేవలందిస్తున్నారు. అయితే మరో అగ్నిమాపక శకటం ఏర్పాటు చేయాలని ఈ ప్రాంత కోరుతున్నప్పటికీ కార్యరూపం దాల్చలేదు.
KRNL: ఎమ్మిగనూరు సమీపంలోని శ్రీ మహాయోగి లక్ష్మమ్మ అవ్వ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యాశాఖ అధికారులు సోమవారం తనిఖీలు నిర్వహించారు. ప్రిన్సిపల్ డా. మహబూబ్ భాష సమక్షంలో వసతులు, రికార్డులు, బోధన విధానాలు పరిశీలించారు. సంతృప్తి వ్యక్తం చేసిన అధికారులు సిబ్బందిని అభినందించారు. ఇందులో పలువురు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
ప్రకాశం: బాలికపై అత్యాచారం కేసులో నిందితుడికి 3 సంవత్సరాల జైలు శిక్షతోపాటు రూ. 5వేల జరిమానా విధిస్తూ ఒంగోలు POCSO కోర్టు తీర్పు వెలువరించింది. దొనకొండ మండలానికి చెందిన వ్యక్తి 14 ఏళ్ల బాలికను మాయమాటలతో హైదరాబాద్‌కు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. పోలీసుల దర్యాప్తుతో నేరం రుజువై శిక్ష విధించగా.. సంబంధిత అధికారులను ఎస్పీ హర్షవర్ధన్ రాజు అభినందించారు.
NDL: బేతంచెర్ల మండలం రేపల్లె గ్రామానికి ఇవాళ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాశ్ రెడ్డి రానున్నట్లు టీడీపీ మండల కన్వీనర్ ఎల్ల నాగయ్య తెలిపారు. ముందుగా పట్టణంలోని డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ విగ్రహానికి కోట్ల పూలమాలవేసి నివాళులర్పిస్తారు. అనంతరం రేపల్లె గ్రామంలో పీఎం సూర్యఘర్ పథకం కింద ఎస్సీలకు వంద శాతం ఉచిత సౌర విద్యుత్ ఏర్పాట్లను ప్రారంభిస్తారన్నారు.
AKP: మునగపాక మండలం చూచుకొండ గ్రామంలో ఉపాధి హామీ పనిచేస్తూ మృతి చెందిన వేతన దారుడు రాము కుటుంబానికి నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని సీఐటీయూ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గనిశెట్టి డిమాండ్ చేశారు. సోమవారం గ్రామంలో మాట్లాడుతూ.. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న నేపాధ్యంలో వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పనిచేసే ప్రదేశాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు.
SKLM: మందస మండలం ఉపాధ్యాయుడిపై దాడికి పాల్పడిన ముద్దాయికి ఆరు నెలలు జైలు శిక్ష విధిస్తూ సోంపేట జూని యర్ సివిల్ జడ్జి కె. శ్రీనివాసరావు తీర్పు ఇచ్చారని మందస ఎస్సై కె.కృష్ణప్రసాద్ తెలిపారు. సరియా పల్లి ఉపాధ్యాయుడు (2020లో) మెట్ట దామోదరరావుతో అదే గ్రామానికి చెందిన గస్యా శ్రీనివాసరావు ‘నాడు-నేడు’ పనుల బిల్లుల విషయమై గొడవపడ్డారు.
PLD: అమరావతి మద్దూరు రోడ్డులో నూతనంగా నిర్మించిన అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవానికి రేపు సీఎం చంద్రబాబు నాయుడు రానున్నారు. ఈ నేపథ్యంలో గుంటూరు రోడ్డులో సీఎం హెలిప్యాడ్ కోసం పరిసరాలను శుభ్రం చేసి, రహదారులను సిద్ధం చేశారు. కలెక్టర్ కృతిక శుక్లా స్వయంగా హెలిప్యాడ్ ప్రాంతాన్ని సందర్శించి, భద్రత, ఇతర ఏర్పాట్లను పర్యవేక్షించారు.
ATP: రాయదుర్గం పట్టణ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు తెలిపారు. సోమవారం పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. ప్రజల తాగునీటి అవసరాల కోసం రూ.30 లక్షలతో పైప్‌లైన్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 32వ వార్డులోని అయ్యప్ప స్వామి ఆలయ సమీపంలో రూ.30.65 లక్షలతో సీసీ రోడ్డు పనులను మొదలుపెట్టామన్నారు.
PPM: జిల్లాలో భూగర్భ జలాల పెంపు లక్ష్యంగా చేపట్టిన ‘జలధార’ కార్యక్రమంపై కలెక్టర్ డా. ప్రభాకర రెడ్డి సంబంధిత అధికారులతో వర్చువల్ సమావేశం నిర్వహించారు. జలధార ప్రోగ్రాంకు సంబంధించిన జీవో నంబర్ 10 ప్రకారం మొదటి దశలో 10 రోజుల్లో జూన్ 6 నుంచి 15 తేదీ వరకు క్షేత్రస్థాయిలో పనులను వెంటనే గుర్తించాలని అధికారులను ఆదేశించారు.
E.G: అనారోగ్యంతో బాధపడుతున్న టీడీపీ సీనియర్ మహిళా కార్యకర్త చౌట జయలక్ష్మికి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల చౌదరి ఆర్థిక సాయం అందించారు. ఆమె మోకాళ్ల సర్జరీ కోసం తిరుపతి బర్డ్ ఆస్పత్రి అధికారులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందేలా చూడాలని సోమవారం సూచించారు. తక్షణ ఖర్చుల కోసం రూ.10,000 అందజేశారు. పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామన్నారు.
VZM: గంట్యాడ మండల పరిధిలో ఈ నెల 16 నుంచి అన్ని గ్రామ పంచాయతీలలో గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు స్దానిక MPDO రమణమూర్తి తెలిపారు. సోమవారం ఆయన కార్యాలయంలో మాట్లాడుతూ… గ్రామ పంచాయతీల ప్రత్యేక అధికారుల ఆధ్వర్యంలో గ్రామసభలు జరుగుతాయన్నారు. ఏ గ్రామంలో ఏ తేదీన గ్రామసభ జరుగుతుందన్న విషయమై ముందుగా గ్రామాల్లో దండోరా ద్వారా ప్రజలకు తెలియజేస్తారన్నారు.
సత్యసాయి: జిల్లా వ్యాప్తంగా నేరాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. సోమవారం రాత్రి ఫ్యాక్షన్ గ్రామాల్లో పోలీస్ అధికారులు సభలు ఏర్పాటు చేసి మహిళా భద్రత, మాదక ద్రవ్యాల అనర్థాలు, సైబర్ నేరాల పట్ల ప్రజలను అప్రమత్తం చేశారు. బాల్య వివాహాలు, ఈవ్ టీజింగ్ వంటి అంశాలపై వివరిస్తూ కొత్త వ్యక్తులు కనిపిస్తే డయల్ 100కు సమాచారం ఇవ్వాలని సూచించారు.
CTR: కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయ ఛైర్మన్ మణి నాయుడు, ఈవో పెంచల కిషోర్లకు దివ్యాంగ సంఘాల నేతలు వినతిపత్రం అందజేశారు. ఆలయంలో వివిధ విభాగాల్లో దివ్యాంగులకు 4% రిజర్వేషన్ అమలు చేయాలని, దివ్యాంగ భక్తులకు బ్యాటరీ వాహనాలు, వీల్ చైర్లు, అవరోధ రహిత దర్శన సౌకర్యాలు కల్పించాలని కోరారు.
శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా సుమారు 400 హోటళ్లు, రెస్టారెంట్లు, చిరు దాబాలు కొనసాగుతున్నాయి. వాటి ద్వారా సుమారు 15 వేల మంది ఉపాధి పొందుతున్నారు. వాణిజ్య సిలెండర్ల కొరత కారణంగా ఇప్పటికే దాదాపు సగం హోటల్లు మూత పడ్డాయి. పూర్తిగా మూతపడితే ఆయా కుటుంబాలన్నీ రోడ్డున పడాల్సి వస్తుందని యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.