AKP: నర్సీపట్నం మున్సిపాలిటీ ఫైర్ ఆఫీస్ సమీపంలోని శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవాలయంలో మంగళవారం అర్ధరాత్రి హుండీ చోరీ జరిగింది. మద్యం సేవించిన వ్యక్తులు ఈ ఘటనకు పాల్పడినట్లు ప్రాథమికంగా గుర్తించామని టౌన్ ఎస్సై ఉమామహేశ్వరరావు బుధవారం తెలిపారు. హుండీలో ఎంత నగదు పోయిందో తెలియాల్సి ఉంది. ధర్మకర్త ఫిర్యాదుతో కేసు నమోదు చేసి క్లూస్ టీం ఆధారాలు సేకరించింది.
W.G: అత్తిలి మండలంలో బాలిక (17)పై అత్యాచార యత్నానికి పాల్పడిన పవన్ సాయి అనే యువకుడిపై పోక్సో కేసు నమోదైంది. ఈ నెల 20న రాత్రి సమయంలో బాలిక ఇంట్లో ఒంటరిగా ఉండగా, నిందితుడు లోపలికి ప్రవేశించి అకృత్యానికి ఒడిగట్టాడు. బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బుధవారం నిందితుడిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు SI విశ్వనాథ్ చెప్పారు.
కడప రైల్వే స్టేషన్ సమీపంలో నిన్న రైలు కిందపడి చిన్న నరసింహులు (75) మృతి చెందినట్లు కడప రైల్వే SI సునీల్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈయన కడప నగరంలోని ఎర్రముక్కపల్లె నివాసి అని అన్నారు. అలాగే భాకరాపేట సమీపంలో రైలు కిందపడి అశోక్ రెడ్డి అనే వ్యక్తి తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈయన అట్లూరు మండల వాసి అని, వీరిద్దరి మృతిపై వివరాలు తెలియాల్సి ఉంది.
GNTR: విద్యుత్ లైన్ల పునరుద్ధరణ, రోడ్డు విస్తరణ పనుల దృష్ట్యా గురువారం ఉదయం 7 నుంచి 11 వరకు సరఫరా నిలిపివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. లక్ష్మీపురం మెయిన్ రోడ్, చంద్రమౌళీనగర్, అశోక్ నగర్, కుందుల రోడ్ ప్రాంతాల్లో కరెంట్ ఉండదు. ఇందుకు వినియోగదారులు సహకరించాలని విద్యుత్ శాఖ అధికారులు పేర్కొన్నారు.
NDL: జిల్లాలో కొనసాగుతున్న భూ రీసర్వే పనులను నిర్ణీత గడువులోపు సమర్ధవంతంగా పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. కలెక్టరేట్లోని వీసీ హాలులో ఆర్డీవోలు, తహశీల్దార్లు, వీఆర్వోలు, విలేజ్ సర్వేయర్లతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. వచ్చే ఏడాది మార్చి నాటికి ప్రతీ రైతుకు పట్టాదారు పాస్ పుస్తకాలు అందజేయాలన్నారు.
KRNL: మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి మఠంలో బుధవారం హుండీ లెక్కింపు చేపట్టారు. ఏప్రిల్ నెల 22 రోజులకు సంబంధించిన భక్తులు సమర్పించిన కానుకల ద్వారా రూ.3,25,96,854 ఆదాయం వచ్చినట్లు మేనేజర్ శ్రీనివాసరావు తెలిపారు. వీటితో పాటు భక్తులు 47 గ్రాముల బంగారం, 592 గ్రాముల వెండిని సమర్పించినట్లు వెల్లడించారు. ఈ మొత్తాన్ని బ్యాంకులలో జమ చేసినట్లు పేర్కొన్నారు.
KKD: రాష్ట్రీయ పోషణ్ పక్వాడా జిల్లా స్థాయి వేడుకను గురువారం ఉదయం 10 గంటలకు కాకినాడ కలెక్టరేట్లోని వివేకానంద మందిరంలో నిర్వహించనున్నట్లు ఐసీడీఎస్ పీడీ సీహెచ్. లక్ష్మి తెలిపారు. కలెక్టర్ అధ్యక్షతన జరిగే కార్యక్రమానికి అధికారులు, సిబ్బంది, ప్రజలు హాజరై విజయవంతం చేయాలని కోరారు.
ATP: తాడిపత్రి రూరల్ పరిధిలోని పేకాట స్థావరంపై పోలీసులు బుధవారం దాడులు నిర్వహించారు. సీఐ శివగంగాధర్ రెడ్డి తన సిబ్బందితో కలిసి నిర్వహించిన ఈ దాడుల్లో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. 55,440 నగదును స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా పేకాట నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో ఈ చర్యలు చేపట్టినట్లు సీఐ తెలిపారు.
PLD: నరసరావుపేట మండలం పమిడిపాడులో కృషి విజ్ఞాన కేంద్రం, వ్యవసాయ శాఖ సంయుక్తంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డా. ఎం. గంగాదేవి రసాయన ఎరువులు తగ్గించి జీవ ఎరువులు వినియోగించాలని సూచించారు. భూసారం పెంచి తక్కువ ఖర్చుతో అధిక లాభాలు పొందాలని రైతులకు అవగాహన కల్పించారు.
SKLM: ఆర్టీసీ బస్సులు నడిపే సమయంలో డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ప్రజా రవాణా అధికారి CH అప్పల నారాయణ అన్నారు. శాఖా పరంగా నడుపుతున్న ఆర్టీసీ హెవీ వెహికల్ డ్రైవింగ్ శిక్షణకు సంబంధించిన 26వ బ్యాచ్‌ను బుధవారం ప్రారంభించారు. తదుపరి 27వ బ్యాచ్‌లో చేరుటకు ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.
KRNL: ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రకర్ జైన్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఇవాళ అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున వర్ష సమయంలో చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదని అధికారులు సూచించారు.
VZM: మునిసిపల్ కమీషనర్ బాలాస్వామి బుధవారం ఆయన కార్యాలయంలో ప్రణాళిక విభాగం అదికారులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. నగర క్రమబద్ధికరణలో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. విచ్చలవిడిగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల విషయంలో అసహనం వ్యక్తం చేశారు. వాటిని వెంటనే తొలగించాలన్నారు. నీటి సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు.
NDL: రుద్రవరం మండలం మందలూరు గ్రామానికి చెందిన రజకుల కోసం దోబీ ఘాట్ నిర్మాణానికి ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ దంపతులు బుధవారం 2 ఎకరాల భూమిని విరాళంగా అందించారు. మందలూరు గ్రామ నాయకులు, రజకులు ఎమ్మెల్యే దంపతులకు పుష్పగుచ్ఛాలు అందించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రజకుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
W.G: ఏపీఐఐసీ ఛైర్మన్, జిల్లా టీడీపీ అధ్యక్షుడు మంతెన రామరాజు బుధవారం వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబుని మర్యాదపూర్వకంగా కలిశారు. పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా నియమితులైన తర్వాత ఆయన ముఖ్యమంత్రిని కలవడం ఇదే తొలిసారి, తనపై నమ్మకంతో కీలక బాధ్యతలు అప్పగించినందుకు పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు రామరాజు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
AKP: కొయ్యూరు మండలం గదబపాలెం పంచాయతీ మల్లవరం గ్రామానికి చెందిన తూబిరి మల్లేశ్, దేవిల కుమార్తె వర్షిణి నవోదయ, సైనిక్ ప్రవేశ పరీక్షల్లో ప్రతిభ కనబర్చింది. నవోదయలో 90/100, సైనిక్లో 178/300 మార్కులు సాధించింది. బుధవారం నర్సీపట్నంలో జరిగిన ఓ పాఠశాల ప్రారంభోత్సవంలో స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు వర్షిణిని ప్రత్యేకంగా అభినందించారు.