మాజీ మంత్రి, టీడీపీ నేత యనమల రామకృష్ణుడుపై మంత్రి దాడిశెట్టి రాజా మంగళవారం తీవ్ర విమర్శలు గుప్పించారు. యనమల చాలా దుర్మార్గుడు అన్నారు. అతని పరిపాలనలో 35 మందిని చంపాడని ఆరోపించారు. ఆరేళ్ల క్రితం జరిగిన తుని రైలు దగ్ధం కేసులో ప్రజలకు నరకం చూపాడన్నారు. నియోజకవర్గంలో ఏమాత్రం అభివృద్ధి చేయలేదన్నారు. అందుకే అతనిని, అతని తమ్ముడ్ని ప్రజలు మూడుసార్లు తిప్పికొట్టారన్నారు. 2016లో కాపు రిజర్వేషన్లకు సంబంధించి బహిరంగ సభకు పిలుపునిచ్చారు ముద్రగడ పద్మనాభం. ఆ సమయంలో తుని సమీపంలో రత్నాచల్ ఎక్స్ప్రెస్ను ఆందోళనకారులు దగ్ధం చేశారు. ఇది అప్పుడు సంచలనం రేపింది. అప్పుడు యనమల ప్రజలను ఇబ్బందులకు గురి చేశారన్నారు.
అలాగే, టీడీపీ నుండి వచ్చే ఎన్నికల్లో తుని నుండి పోటీ చేసే అంశంపై అన్నదమ్ముల మధ్య పోరు కనిపిస్తోన్న విషయం తెలిసిందే. యనమల రామకృష్ణుడు వచ్చే ఎన్నికల్లో తన కూతురును బరిలోకి దింపాలని భావిస్తున్నారు. మరోవైపు ఇప్పటికే రెండుసార్లు పోటీ చేసి ఓడిన అతని సోదరుడు యనమల కృష్ణుడు మాత్రం తానే పోటీ చేస్తానని చెబుతున్నారు. ఇందుకు సంబంధించి ఓ ఆడియో కాల్ వెలుగు చూసి, చర్చనీయాంశంగా మారింది. దీనిపై దాడిశెట్టి రాజా మాట్లాడుతూ… టిక్కెట్ కోసం అన్నదమ్ములు కొట్టుకు చస్తే తనకెందుకు అన్నారు. అది వారి పార్టీకి సంబంధించిన అంశమని అభిప్రాయపడ్డారు.