ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో స్పష్టత లేదన్న విషయం అందరికీ తెలిసిందే. గత ప్రభుత్వం… అమరావతిని రాజధానిగా ప్రకటించగా… ప్రస్తుత ప్రభుత్వం మూడు రాజధానులను ప్రకటించింది. విశాఖను పరిపాలన రాజధానిగా కన్ఫామ్ చేస్తూ… సీఎం జగన్ ప్రకటన చేశారు. ఈ విషయంలో భిన్నాభిప్రాయాలు తలెత్తుతున్నాయి.
దీనికి సంబంధించిన అంశం ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉన్నది. సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉండగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. రాష్ట్ర హైకోర్టు ఇప్పటికే దీనిపై తీర్పును ఇచ్చింది. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని తీర్పులో పేర్కొన్నది. అయితే, ఈ తీర్పును రాష్ట్రప్రభుత్వం సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేసింది.
రాష్ట్రంలో రాజధానుల అంశం రాష్ట్రానికే ఉంటుందని, రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలన్నది రాష్ట్రప్రభుత్వం ఇష్టమని ఏపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభలో పేర్కొన్నారు. రాజధానిపై పూర్తి అధికారం రాష్ట్రానిదేనని అన్నారు.
రాష్ట్రంలోని మూడు ప్రాంతాల అభివృద్ధి, మూడు ప్రాంతాల మధ్య అంతరాలను తొలగించేందుకే మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. మూడు ప్రాంతాల ప్రజలు కూడా మూడు రాజధానులను కోరుకుంటున్నారని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తాము పనిచేసుకుంటూ పోతున్నామని విజయసాయి రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో జీతాలు ఇచ్చేందుకే అవస్థలు పడుతున్న ప్రభుత్వం మూడు రాజధానులను ఎలా ఏర్పాటు చేయగలుగుతుందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.