vizag : నడి సముద్రంలో పడవలో చెలరేగిన మంటలు.. పలువురికి గాయాలు
సముద్రంలో వేటకు వెళ్లిన ఓ మత్స్యకారుల పడవలో ఇంజన్ పేలడంతో మంటలు చెలరేగాయి. దీంతో అందులో ఉన్న జాలర్లకు గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
fire in fishing boat : విశాఖ సముద్ర తీరం నుంచి శుక్రవారం మధ్యాహ్నం ఓ మత్స్యకారుల బోటు చేపల వేటకు సముద్రంలోకి వెళ్లింది. నడి సముద్రంలో ఉండగా వారి బోటులోని ఇంజన్ ప్రమాదవశాత్తూ పేలింది. దీంతో ఆ బోటులో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అందులో ఉన్న తొమ్మిది మంది జాలర్లకు గాయాలయ్యాయి. వారిలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.
కాకినాడ జిల్లాకు చెందిన ఈ జాలర్లు అంతా గత నెల 26వ తదీన శ్రీ దుర్గా భవానీ ఐఎన్డీ ఎపీ 47 బోటులో చేపల వేటకు వెళ్లారు. వీరు ఈ నెల 14వ తేదీన తిరిగి రావాల్సి ఉంది. ఆ మధ్యలోనే నడి సంద్రంలో ఈ ప్రమాదం జరిగింది. విశాఖ(vizag) తీరానికి 20 నాటికన్ మైళ్ల దూరంలో చేపల బోటు ఉన్నప్పుడు ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. బోటులో షార్ట్ సర్య్కూట్ కారణంగా జనరేటర్ పేలిందని, దీంతో మంటలు(fire) ఎగసి పడ్డాయని వారు చేబుతున్నారు.
మంటలంటుకున్న బోటును( boat) చూసి సమీపంలో ఉన్న మరో పడవ వారు వారికి సాయం అందించారు. కోస్టు గార్డు అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో సమీపంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న ఐసీజీఎస్ వీరా నౌక సిబ్బంది గాయపడిన వారికి ప్రథమ చికిత్స అందించారు. తర్వాత నేవల్ డాక్ యార్డ్‌కు తీసుకొచ్చారు. అంబులెన్స్ ద్వారా విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. మత్స్యకారుల్లో ఆర్ . సత్తిబాబు, కె.ధర్మారావు, వై.సత్తిబాబు, ఎన్.వజ్రం, ఎస్.సత్తిబాబులకు తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం వీరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు.