DELHI HC : భార్య అస్తమానూ పుట్టింటికి వెళ్లడం భర్తను హింసించడమే : దిల్లీ హైకోర్టు
భర్త వైపు నుంచి ఎలాంటి పొరపాటూ లేకపోయినా భార్య పదే పదే పుట్టింటికి వెళ్లడం భర్తను హింసించడమే అవుతుందని దిల్లీ హైకోర్టు వ్యాఖ్యలు చేసింది. దీనిపై కోర్టు ఇంకా ఏమందంటే..?
DELHI HC : భర్త వైపు నుంచి ఎలాంటి పొరపాటు లేకుండా భార్య పదే పదే పుట్టింటికి వెళ్లడం అతడిని మానసికంగా వేదించడమే అవుతుందని దిల్లీ హై కోర్టు అభిప్రాయపడింది. దీన్ని క్రూర చర్యగానే పరిగణించాలని స్పష్టం చేసింది. వైవాహిక బంధం అన్యోన్యంగా ఉండాలంటే వారిద్దరి మధ్య ప్రేమ, విశ్వాసం, ఆరాధనా భావం ఉండాలని జస్టిస్ సురేష్ కుమార్ కౌత్ నేతృత్వం లోని ధర్మాసనం పేర్కొంది.
భార్య(WIFE) హింస కారణంగా విడి విడిగా ఉంటున్న దంపతులకు విడాకులు మంజూరు చేస్తూ ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. దంపతులు సంయమనం కోల్పోతే వారి మధ్య ఎడబాటు పెరుగుతుందని అది కలిసి ఉండలేని స్థితికి తీసుకు వస్తుందని చెప్పింది.
ఓ భర్త తన భార్య విషయంలో కోర్టుకు వెళ్లాడు. 19 ఏళ్ల వైవాహిక జీవితంలో మొత్తం ఏడు సార్లు భార్య తనను వదిలి పుట్టింటికి వెళ్లిందని కోర్టుకు తెలిపాడు. అలా వెళ్లిన ప్రతిసారి పదేసి నెలలపాటు పుట్టింట్లోనే ఉండేదని చెప్పాడు. స్థానిక ఫ్యామిలీ కోర్టు వీరికి విడాకులు ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో ఈ విషయమై అతడు దిల్లీ హైకోర్టును(DELHI HC) ఆశ్రయించాడు. ఈ కేసును విచారించిన కోర్టు వీరిద్దరికీ చివరికి విడాకులు మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో పై వ్యాఖ్యలు చేసింది.