ఏపీ సీఎం వైఎస్ జగన్, ఏపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు . శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కడప స్టీల్ ప్లాంట్‌తో పాటు విభజన చట్టంలోని అంశాలను సాధించడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. వైసీపీ నేతలు వందల సార్లు ఢిల్లీకి వెళ్లారని, మంత్రి బుగ్గనైతే ఢిల్లీలోనే శాశ్వతంగా వుండిపోయారని, కానీ సాధించింది ఏముందని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాలేదని.. ఏం సాధించారని అసెంబ్లీలో పరిశ్రమలపై చర్చను పెట్టారని ఆయన నిలదీశారు. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నిస్తున్న తమ సభ్యులపై ఎదురుదాడి చేస్తున్నారని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.
సొంత జిల్లాకు కూడా జగన్ పరిశ్రమలను తీసుకురాలేకపోయారని.. సిగ్గు, ఎగ్గు లేకుండా శాసనసభలో పారిశ్రామిక విధానంపై చర్చ పెట్టారంటూ అచ్చెన్నాయుడు దుయ్యబట్టారు. ఆర్ధిక మంత్రి బుగ్గనను పిట్ట కథల మంత్రి, ఆవు కథల మంత్రి అంటూ ఆయన సెటైర్లు వేశారు. కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయలేక, కోవిడ్పైకి నెడుతున్నారని.. చేతకాని వారే ఇలాంటి కారణాలు చెబుతున్నారంటూ అచ్చెన్నాయుడు దుయ్యబట్టారు.