కృష్ణా: నాగాయలంక సాయిబాబా గుడి వద్ద గురువారం కూలీల ట్రాక్టర్ బోల్తా పడి పది మందికి గాయాలపాలయ్యారు. ప్రమాద బాధితులను అవనిగడ్డ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం ముగ్గురిని మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద బాధితులందరూ నాగాయలంక మండలం గణపేశ్వరం గ్రామానికి చెందిన వారిగా గుర్తింపు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
TPT: తిరుమలలో మోకాళ్ల మెట్లు సమీపంలోని ఘాట్ రోడ్డుపై సుమారు 7 అడుగుల నాగుపాము ప్రత్యక్షమై వాహనదారుల్లో భయాందోళనకు గురిచేసింది. రోడ్డుపైకి వచ్చిన పామును గమనించిన వాహనదారులు కాసేపు ఆగిపోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న అటవీ శాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పామును సురక్షితంగా పట్టుకుని అడవిలో విడిచిపెట్టారు.
NLR: అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా బుధవారం కందుకూరు ఆర్టీసీ డిపోలో సిబ్బందికి ప్రమాదాలపై అవగాహన కల్పించారు. అగ్నిప్రమాదాల పట్ల అప్రమత్తత అవసరమని, అత్యవసర సమయాల్లో వెంటనే సమాచారం ఇవ్వాలని అధికారి ఎం. చంద్రమౌళి కోరారు. అనంతరం కేసరగుంట కాలనీలోని గుడిసెల నివాసితులకు నివారణ చర్యలు వివరించారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు.
SKLM: నరసన్న పేట మండలం మడపాం టోల్ గేట్ వద్ద బుధవారం పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ మేరకు పశువులను అక్రమంగా రవాణా చేస్తున్న రెండు వాహనాలను పట్టుకొని , సీజ్ చేసినట్లు ఎస్సై బి. గణేష్ తెలిపారు. 12 మూగజీవాలను సంరక్షించి, కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. మూగ జీవులను అక్రమ రవాణా చేస్తే చట్ట పరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
CTR: నగరం సమీపంలోని గంగాసాగరం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. హైవే అధికారులు గురువారం ఉదయం లారీలను రోడ్డుపై ఆపుతున్న సందర్భంలో వెంట వెంటనే రెండు లారీలు ఆపడంతో వెనుక నుంచి వచ్చిన కారు లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదం జరగడంతో హైవే అధికారులు వెంటనే అక్కడి నుంచి జారుకున్నారు. అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
VZM: ముందస్తుగా పన్నులు చెల్లిస్తే 5 శాతం రిబేటు పొందవచ్చని బొబ్బిలి మున్సిపల్ కమిషనర్ ఎల్.రామలక్ష్మి సూచించారు. బుధవారం ఆమె కార్యాలయంలో రెవెన్యూ ఉద్యోగులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 2026-27 పన్నులు ఒకేసారి చెల్లిస్తే 5 శాతం రిటేట్ వస్తుందన్న విషయం ప్రజలు సద్వినియోగం చేసుకునేలా ప్రచారం చేయాలన్నారు.
E.G: సీతానగరం మండలంలో కాతేరు నుంచి సీతానగరం వరకు నిర్మించిన సీసీ రోడ్డుపై ఎటువంటి ఆక్రమణలు చేయవద్దని కోరుకొండ సీఐ వివిఎస్ మూర్తి బుధవారం హెచ్చరించారు. రోడ్డుపై ధాన్యం, మొక్కజొన్నలు ఆరబెట్టడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన ప్రమాదానికి కారణమైన వారిపై ఇప్పటికే FIR నమోదు చేసినట్లు తెలిపారు.
ప్రకాశం: కంభం మండలం జంగంగుంట్ల సమీపంలో గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూటీపై వెళ్తున్న భాస్కర్ అనే వ్యక్తిని వెనుక నుంచి కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో అతడికి గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం కంభం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కారు ఓవర్ స్పీడ్‌తో వచ్చి స్కూటీని ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
కాకినాడ జిల్లా పోర్టుతో పాటు పలు గోడౌన్‌లలో పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ తోట సుధీర్, డీఎస్‌వో సత్యనారాయణ రాజు బృందం బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. కొన్ని మిల్లుల్లోని బియ్యంలో పీడీఎస్ బియ్యానికి సంబంధించిన కెర్నాల్స్‌ను అధికారులు గుర్తించారు. దీంతో 910 టన్నుల బాయిల్డ్ బియ్యం, రవాణాకు సిద్ధంగా ఉన్న 10 లారీలను సీజ్ చేశారు.
GNTR: AP రూరల్ రోడ్స్ ప్రాజెక్ట్ కింద జిల్లాలో రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వం రూ.80.50 కోట్లు మంజూరు చేసింది. మొత్తం 53 రోడ్ల పనులకు ఒకే ప్యాకేజీ కింద పంచాయతీరాజ్ శాఖ టెండర్లు ఆహ్వానించింది. ఈ నెల 29 సాయంత్రం 4.30 గంటల వరకు ఆన్‌లైన్‌లో బిడ్లు స్వీకరిస్తారు. ఈ పనులన్నింటినీ 18 నెలల వ్యవధిలో పూర్తి చేయాలని ఎస్ఈ గువ్వల శ్రీనివాసులు నిబంధన విధించినట్లు తెలిపారు.
అల్లూరి: కొయ్యూరు మండలం బాలారం ఏకలవ్య మోడల్ పాఠశాలలో 10వ తరగతి పరీక్షల్లో (సీబీఎస్ఈ) 100 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని ప్రిన్సిపాల్ డాక్టర్ సతీష్ కుమార్ బుధవారం తెలిపారు. 30 మంది బాలురు, 30 మంది బాలికలు మొత్తం 60 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారన్నారు. నంద కిషోర్ 446/500, బద్రి 442/500 పాఠశాలలో మొదటి, ద్వితీయ స్థానాల్లో నిలిచారని తెలిపారు.
బాపట్ల జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ బుధవారం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. పాత బస్టాండ్, గడియార స్తంభం కేంద్రాల్లో స్వయంగా పర్యటించి హెల్మెట్ ధరించిన వారిని అభినందించారు. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న వాహనదారులకు ప్రమాదాల తీవ్రతను వివరించి తప్పనిసరిగా ధరించాలని సూచించారు.
సత్యసాయి: వివాహితపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడు బిల్లా కుమార్‌ను కనగానపల్లి పోలీసులు అరెస్టు చేశారు. ముత్తవకుంట్ల ఎస్సీ కాలనీకి చెందిన ఇతడు, ఈ నెల 14న ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన ఎస్సై మహమ్మద్ రిజ్వాన్, నిందితుడిని పట్టుకుని రిమాండ్‌కు తరలించారు.
అనకాపల్లి: గంజాయి అక్రమ రవాణా కేసులో నిందితుడికి 4 ఏళ్ల 9 నెలల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.5,000 జరిమానా విధిస్తూ విశాఖ 1వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు బుధవారం తీర్పు ఇచ్చింది. 2021లో నర్సీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసులో ఆకాశ్ పాండురంగన్ (A3)పై నేరం రుజువుకావడంతో శిక్ష ఖరారైనట్లు ఎస్పీ తుహీన్ సిన్హా తెలిపారు.
TPT: తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 8 గంటల సమయం పడుతోంది. ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నిండిపోయి, బయట ATGH వరకు భక్తులు వేచి ఉన్నారు. నిన్న మొత్తం 77,077 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకోగా, 27,241 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం రూ.3.47 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.